Share News

అమరావతిలో డీఏవీ పాఠశాల

ABN , Publish Date - Jun 26 , 2026 | 04:52 AM

అమరావతి ప్రాంతంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అమరావతి ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ అకాడమీ (ఏఈసీఏ) ఆధ్వర్యంలో నూతన పాఠశాల నిర్మాణం కానుంది.

అమరావతిలో డీఏవీ పాఠశాల

  • ఏఈసీఏ, సీఆర్‌డీఏ ఒప్పందం

తుళ్లూరు, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): అమరావతి ప్రాంతంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అమరావతి ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ అకాడమీ (ఏఈసీఏ) ఆధ్వర్యంలో నూతన పాఠశాల నిర్మాణం కానుంది. అబ్బరాజుపాలెం గ్రామంలో ఏపీసీఆర్డీఏ కేటాయించిన మూడు ఎకరాల భూమిలో ఈ పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంస్థను డీఏవీ (దయానంద్‌ ఆంగ్లో వేదిక్‌) చెన్నై యాజమాన్యం నిర్వహించనుంది. అమరావతి ప్రాంతంలోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. దీనికి సంబందించిన ఒప్పందం గురువారం పూర్తయింది. ఏపీ సీఆర్డీఏ ఎస్టేట్స్‌ విభాగ జాయింట్‌ డైరెక్టర్‌ జుబిన్‌ రాయ్‌ అగ్రిమెంట్‌ పత్రాలను అమరావతి ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ అకాడమీ ప్రతినిధులకు అందజేశారు. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ పాఠశాలకు అవసరమైన నిధులను అమరావతి రైతులు విరాళాల రూపంలో సమకూరుస్తున్నారు. పాఠశాల నిర్మాణం పూర్తయిన తర్వాత 250 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. ఇప్పటికే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తుళ్లూరులోని అద్దె భవనంలో డీఏవీ పాఠశాలలో తరగతులుప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు రెండేల్లో పూర్తికానుంది.

Updated Date - Jun 26 , 2026 | 04:54 AM