ఆమెకు పుట్టుకతోనే తండ్రి ఆస్తిపై సమాన హక్కు
ABN , Publish Date - May 13 , 2026 | 05:27 AM
హిందూ వారసత్వ (సవరణ) చట్టం-2005 ప్రకారం కుమారులతో సమానంగా కుమార్తెలకు ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని హైకోర్టు పునరుద్ఘాటించింది.
1988 నాటి ఆస్తి వివాదంలో హైకోర్టు తీర్పు
చట్టం అమలునాటికి తండ్రి బతికి ఉండక్కర్లేదు
అప్పటికి కుమార్తె ఉంటే చాలునని స్పష్టీకరణ
అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): హిందూ వారసత్వ (సవరణ) చట్టం-2005 ప్రకారం కుమారులతో సమానంగా కుమార్తెలకు ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని హైకోర్టు పునరుద్ఘాటించింది. ఈ చట్ట సవరణ జరిగిన నాటినుంచే కుమార్తెలకు పుట్టుకతోనే కుమారులతో సమానంగా ఆస్తిపై హక్కు సంక్రమిస్తుందని వినీతాశర్మ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బెంచ్ ఉటంకించింది. 2005 సెప్టెంబరు 9న సవరణ చట్టం అమల్లోకి వచ్చిందని గుర్తుచేసింది. ఆ నాటికి తండ్రి జీవించి ఉన్నారా, లేదా అనే విషయంతో సంబంధం లేకుండా కుమార్తె జీవించి ఉంటే ఆస్తిలో సమాన వాటా పొందేందుకు ఆమె అర్హురాలని స్పష్టం చేసింది. మూడు దశాబ్దాలకు పైగా నలుగుతున్న వివాదంలో తండ్రి ఆస్తిని కుమారుడికి, కుమార్తెకు సమానంగా విభజిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ మెడమల్లి బాలాజీతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన మారెప్పకు భార్య నాగమ్మ, కుమార్తె వీరమ్మ, కుమారుడు బసప్ప ఉన్నారు. మారెప్పకు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి ఉంది. ఆయన మరణం తరువాత మారెప్ప ఆస్తిలో తమకు వాటా ఇప్పించాలని నాగమ్మ, వీరమ్మ 1988లో బసప్ప, ఆయన కుమార్తెలపై కర్నూలు కోర్టులో దావా వేశారు. విచారించిన కోర్టు మారెప్ప భార్య నాగమ్మకు ఆస్తిలో 1/4 వంతు దక్కుతుందని ఉత్తర్వులు ఇచ్చింది. కుమార్తె వీరమ్మకు ఆస్తిలో వాటా ఇవ్వలేదు. దీంతో నాగమ్మ, వీరమ్మ 1990లో హైకోర్టులో అప్పీల్ చేశారు. ఆస్తిలో భార్య నాగమ్మ, కుమార్తె వీరమ్మ, కుమారుడు బసప్పకు హైకోర్టు సమాన వాటాలు కేటాయిస్తూ 2003లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు సైతం ఖారారు చేసింది. అయితే 2005లో హిందూ వారసత్వ చట్ట సవరణ, వినీత శర్మ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని కుమార్తె వీరమ్మ తన అప్పీల్‌లో తాజాగా అనుబంధ పిటిషన్లు దాఖ లు చేశారు. దానితోపాటు, తల్లి నాగమ్మ కూడా మరణించడంతో ఆమె వాటాను సైతం కమారుడు, కుమార్తెకు కోర్టు సమానంగా పంచింది. గతంలో ఇచ్చిన అప్పిలేట్ డిక్రీని సవరించి, కుమార్తెకు ఆస్తిలో సగం వాటా ఇస్తూ నిర్ణయం వెల్లడించింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా తుది డిక్రీ జారీ చేయాలని కర్నూలు ట్రయల్ కోర్టును ఆదేశించింది.