వైద్య సేవ ట్రస్ట్‌లో డేటా చోరీ!
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:19 AM
ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టులో దొంగలు పడ్డారు. ట్రస్ట్‌కు సంబంధించిన డేటాను చాకచక్యంగా చోరీ చేశారు. అత్యంత రహస్యంగా ఉండాల్సిన డేటా మొత్తం ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి అప్పగించారు.
20 వేల మందికి పైగా వైద్యుల సమాచారం బయటకు
ఏపీఎంసీ ఎన్నికల ప్రచారం కోసమే
పోటీలో ఉన్న అభ్యర్థుల చేతికి డేటా
దాని ఆధారంగా ‘పర్సనల్’ ప్రచారం
ట్రస్ట్ ఉద్యోగుల సహకారంతోనే చౌర్యం
వ్యక్తిగత డేటా చౌర్యంపై వైద్యుల ఆందోళన
అమరావతి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టులో దొంగలు పడ్డారు. ట్రస్ట్‌కు సంబంధించిన డేటాను చాకచక్యంగా చోరీ చేశారు. అత్యంత రహస్యంగా ఉండాల్సిన డేటా మొత్తం ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి అప్పగించారు. అయితే, ఈ విషయాన్ని ట్రస్టు అధికారులు ఇప్పటి వరకూ గుర్తించకపోవడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీ మెడికల్ కౌన్సిల్(ఏపీఎంసీ) ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 54 వేల మంది వైద్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు 84 మంది వైద్యులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల నేపథ్యంలోనే డేటా చౌర్యం జరిగిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ఒక్కొక్క వైద్యుడిని కలిసి విన్నవించుకోవడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఫోన్ మేసేజ్‌లు, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఏపీఎంసీ ఎన్నికల్లో చాలా మంది వైద్యులు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. కానీ, 54 వేల మంది వైద్యులకు తమ విన్నపాలు వెళ్తున్నాయా?. వారు చూస్తున్నారా అన్న అనుమానాలుంటాయి. తమకు ఓటు వేయాలన్న విన్నపం ప్రతి వైద్యుడి వద్దకు చేరాలంటే, వారిని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో సంప్రదించాలంటే కచ్చితంగా వారి అడ్ర్‌సలు, మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు అవసరం అవుతాయి. ఈ క్రమంలో వైద్యులకు సంబంధించిన డేటా మొత్తం పోటీ చేసే వారి వద్ద ఉంటే ప్రచారం సులువుగా చేసుకోవచ్చని భావించారు.
20 వేల మంది సమాచారం
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర వ్యవస్థల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యుల డేటా మొత్తం ఏపీ మెడికల్ కౌన్సిల్ వద్దే ఉంటుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌లో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులకు సంబంధించిన వ్యక్తిగత డేటా అందుబాటులో ఉంటుంది. ఇలా సుమారు 20 వేల మంది వైద్యుల సమాచారం ట్రస్ట్‌లో ఉంది. పోటీలో ఉన్న కొంత మంది అభ్యర్థులు తొలుత ఏపీ మెడికల్ కౌన్సిల్‌లోని కొంత మంది సిబ్బందిని సంప్రదించి, వారికి డబ్బును ఎర చూపి వైద్యుల డేటా కావాలని కోరారు. ఈ డేటా బయటకెళ్తే సమస్యలు వస్తాయని భయపడిన సిబ్బంది డేటా ఇచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల కన్ను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుపై పడింది. ఏపీఎంసీలో వైద్యుల అడ్ర్‌సలు, మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు మాత్రమే ఉంటాయి. ట్రస్ట్‌లో మాత్రం ఆ వైద్యులు రాష్ట్రంలో ఏ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారన్న సమాచారం కూడా ఉంటుంది. ఈ విషయన్ని గ్రహించిన అభ్యర్థులు ట్రస్టు ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా డేటాను చౌర్యం చేశారు. ట్రస్ట్‌లో ప్యానల్, ట్రీట్‌మెంట్, స్పెషలిస్ట్ డాక్టర్లు, మెడికోలకు సంబంధించిన వ్యక్తిగత, రహస్య సమాచారం మొత్తం ఇప్పుడు అభ్యర్థుల చేతుల్లోకి వెళ్లింది. ఇది జరిగి దాదాపు వారం గడిచినా ఇప్పటి వరకు ట్రస్ట్ అధికారులకు ఎలాంటి సమాచారం అందలేదు.
సాఫ్ట్‌వేర్ కంపెనీ చేతికి
ఏపీఎంసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న కొంతమంది వైద్యులు ఈ డేటాను తమ ప్రచారానికి ఉపయోగించుకోవడం ప్రారంభించారు. దొంగతనంగా సేకరించిన డేటా మొత్తం సాఫ్ట్‌వేర్ కంపెనీకి అప్పగించారు. సదరు కంపెనీ సహకారంతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మాకు మాత్రమే ఓటు వేయాలంటూ అభ్యర్థుల నుంచి రోజుకు పదులసార్లు వైద్యులకు మేసేజ్‌లు, మెయిల్స్ వెళ్తున్నాయి. ఈ మేసేజ్‌లు చూసి వైద్యులు షాక్‌కు గురవుతున్నారు. తమ ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలు వీరి చేతికి ఎలా వెళ్లాయని వైద్యులు ఆందోళన చెందుతున్నారు.
తొలిసారి ఇలా..
వైద్యుల వ్యక్తిగత డేటా దక్కించుకునేందుకు కొన్ని ఫార్మా కంపెనీలు ఉత్సాహం చూపుతాయి. ముఖ్యంగా వైద్యులపై ఫార్మా కంపెనీల నుంచి ఒత్తిళ్లు ఉంటాయి. తమ కంపెనీ మందు లే ఉపయోగించాలని, వాటినే రోగులకు రాయాలని ఫార్మా కంపెనీలు, మెడికల్ రిప్రజంటేటివ్స్ కోరుతారు. ఈ క్రమంలోనే వైద్యులు తమ వ్యక్తిగత సమాచారాన్ని, ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలను రహస్యంగా ఉంచుతారు. కానీ, తొలిసారి ట్రస్టులో రిజిస్టర్ అయిన వైద్యుల డేటా మొత్తం బయటకు వెళ్లిపోయింది. డేటాను చోరీ చేసిన వారు ఏపీఎంసీ ఎన్నికల వరకు ఉపయోగించుకుని ఆ తర్వాత వదిలేస్తారు. కానీ, ఆ డేటాను వారు స్టాఫ్ట్‌వేర్ కంపెనీకి ఇవ్వడంతో ఈ కంపెనీ సదరు సమాచారాన్ని ఎక్కడైనా వినియోగించుకునే అవకాశం ఉంటుందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి డేటా చోరీకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు.