దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:58 AM
దళిత హిందువులు, దళిత బౌద్ధవులు, దళిత సిక్కులకు ఎస్సీ హోదా కల్పించినట్టే దళిత క్రైస్తవులకూ ఎస్సీ హోదా కల్పించాలని మాజీ సీజేఐ, షెడ్యూల్డ్ కులాల హోదాపై విచారణ..
జస్టిస్ కేజీ బాలకృష్ణన్‌కు దళిత, ఆదివాసీ సంఘాల జేఏసీ వినతి
న్యూఢిల్లీ, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): దళిత హిందువులు, దళిత బౌద్ధవులు, దళిత సిక్కులకు ఎస్సీ హోదా కల్పించినట్టే దళిత క్రైస్తవులకూ ఎస్సీ హోదా కల్పించాలని మాజీ సీజేఐ, షెడ్యూల్డ్ కులాల హోదాపై విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్‌కు ఏపీ దళిత, ఆదివాసీ సంఘాల జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ విషయమై దళిత, ఆదివాసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు కంఠ వేణు, ప్రధాన కార్యదర్శి తైక్వాండో శ్రీను గురువారం కేజీ బాలకృష్ణన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతం మారినంత మాత్రాన సామాజిక వివక్ష పోదని చెప్పారు. దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా ఇచ్చి సామాజిక న్యాయం అమలు చేయాలని కోరారు. గతంలో కాకా కాలేల్కర్ కమిషన్, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ సహా పలు కమిషన్లు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని సిఫారసు చేశాయని గుర్తు చేశారు. ఆ నివేదికలను పరిగణనలోకి తీసుకుని బాలకృష్ణన్ కమిషన్ కూడా సానుకూలంగా సిఫారసు చేయాలని కోరినట్లు తెలిపారు.