దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి
ABN , Publish Date - Apr 01 , 2026 | 06:23 AM
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తప్పుబట్టారు.
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
విజయవాడ(గాంధీనగర్), మార్చి 31(ఆంధ్రజ్యోతి): దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తప్పుబట్టారు. ఈ తీర్పులో న్యాయం చేయాలనే తపన కన్నా ఎలాగైనా కేసు కొట్టేయాలన్న ఆలోచనే కనిపించిందంటూ విమర్శించారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని, సుప్రీం కోర్టు తీర్పును పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం స్థానిక దాసరి భవన్‌లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... ‘ఈ తీర్పుతో రాష్ట్రంలోని మాల, మాదిగ ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. జగన్ అధికారంలో ఉన్నంత కాలం మోదీ దత్త పుత్రుడుగా కొనసాగారు. దళితుల ఓట్లతో అధికారం చేపట్టిన జగన్‌కు వారి పక్షాన నిలవాల్సిన బాఽధ్యత లేదా? సీఎం చంద్రబాబు, జగన్ వారి పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించేందుకు కృషి చేయాలి’ అని కోరారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ... ‘దళిత క్రైస్తవులపై వివక్ష తగ్గనప్పుడు వారికి ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయకూడదు?’ అని ప్రశ్నించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఎస్సీలు క్రైస్తవ మతం స్వీకరిస్తే ఎస్సీ హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగా లేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ.. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలంటే 1950 ఆర్డర్‌లోని మూడో పేరాగ్రా్‌ఫను తొలగించాలన్నారు. దీనికి సంబంధించి సుమారు 15 పిటిషన్లు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, వైసీపీ నేత జూపూడి ప్రభాకర్‌రావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.