Share News

పాడిపై రెజి వెట్‌ కేర్‌

ABN , Publish Date - Mar 13 , 2026 | 01:02 AM

పాడి పరిశ్రమ వృద్ధికి కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. పాడి రైతులకు నిత్యం ఎదురయ్యే సమస్యలకు సకాలంలో సలహాలు అందించేందుకు, పాడి పశువుల ఆరోగ్యం, ఉత్పత్తి, పునరుత్పత్తి అంశాలపై అవగాహన కల్పించేందుకు ‘రెజి వెట్‌ కేర్‌’ అనే ఆధునిక యాప్‌ను రూపొందించింది.

పాడిపై రెజి వెట్‌ కేర్‌

- పాడి పరిశ్రమ వృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

- పశువుల సమాచారం రెజి వెట్‌ కేర్‌ యాప్‌లో నిక్షిప్తం

- ఒక్క కాల్‌తో గ్రామాలకు సెమెన్‌లు

- రైతులను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సందేశాలు

- పాడిరైతు సేవలో కృష్ణా మిల్క్‌ యూనియన్‌

ఆంధ్రజ్యోతి-విజయవాడ:

పాడి పరిశ్రమ వృద్ధికి కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. పాడి రైతులకు నిత్యం ఎదురయ్యే సమస్యలకు సకాలంలో సలహాలు అందించేందుకు, పాడి పశువుల ఆరోగ్యం, ఉత్పత్తి, పునరుత్పత్తి అంశాలపై అవగాహన కల్పించేందుకు ‘రెజి వెట్‌ కేర్‌’ అనే ఆధునిక యాప్‌ను రూపొందించింది. కృష్ణా మిల్క్‌ యూనియన్‌కు పాలు సరఫరా చేసే ప్రతి రైతు గేదె పునరుత్పత్తి స్థితిని ఈ యాప్‌ ద్వారా తెలుసుకునే వ్యవస్థను రెడీ చేసింది. పశువైద్య సేవల పర్యవేక్షణకు ఈ యాప్‌ ఎంతో ఉపయోగపడుతుంది. కృష్ణా మిల్క్‌ యూనియన్‌ పశువైద్య విభాగంలో పనిచేస్తున్న 10 సంచార పశువైద్యశాలల కార్యకలాపాలు ఈ యాప్‌లో నమోదవుతాయి. పశువైద్యులు ఏ గ్రామానికి, ఏ తేదీన వెళ్లారు, చేసిన చికిత్సలు, వాడిన మందులు, వాటి విలు వంటి వివరాలు క్లస్టర్‌ కోడ్‌, సంఘం కోడ్‌, రైతు నంబర్‌తో సహా యాప్‌లో అందుబాటులో ఉంటాయి. పశువులకు వచ్చే వ్యాధుల విశ్లేషణ, అత్యవసర, సాధారణ కేసుల వివరాలు, గేదెల పరిస్థితి, వాటికి చేసిన చికిత్సలు, తదుపరి పరీక్షల ఫలితాలు వంటి సమాచారం కూడా యాప్‌లో నమోదవుతుంది. కృష్ణా మిల్క్‌ యూనియన్‌లో 32 మంది సంచార సెమెన్‌ వర్కర్లు, 28 మంది స్థానిక సెమెన్‌ వర్కర్లు ఉన్నారు. రైతుల నుంచి కాల్స్‌ వచ్చిన వెంటనే ఆయా గ్రామాలకు వెళ్లి గేదెలకు సెమెన్‌ చేస్తారు. ఆ వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. సెమెన్‌ చేసిన వెంటనే రైతుకు మొబైల్‌లో మెసేజ్‌ పంపుతారు.

రైతు ఫోన్‌కు సందేశం

సెమెన్‌ చేసిన 21 రోజుల తర్వాత ‘మీ గేదెకు సెమెన్‌ చేసి 21 రోజులు అవుతోంది. మళ్లీ ఎదకు వస్తుందేమో పరిశీలించండి’ అనే సందేశం రైతుకు వెళ్తుంది. ఆ తర్వాత సెమెన్‌ వర్కర్లు రైతును సంప్రదించి గేదె ఎదకు వచ్చిందా లేదా అనే వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. 90 రోజుల తర్వాత కూడా గేదె ఎదకు రాకపోతే గ్రామానికి వచ్చే డెయిరీ వైద్యుడితో చూడి పరీక్ష చేయించుకోవాలని మరో సందేశం రైతుకు వస్తుంది. పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండేందుకు గేదెల ఈతల మధ్యకాలం 15 నెలల్లోపే ఉండేలా రైతులకు అవగాహన కల్పించడం ఈ యాప్‌ లక్ష్యం. గేదె ఈనిని తర్వాత మూడు నెలల్లో ఎదకు రావడం, తర్వాత చూడి నిలిచి పది నెలల్లో మళ్లీ ఈనడం వంటి అంశాలపై రైతులకు సూచనలు అందుతాయి. ఖనిజ లవణ మిశ్రమం వినియోగం, దాణా, పశుగ్రాస వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. ఇక పర్యవేక్షణ అధికారులకు ఈ యాప్‌ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి సెమెన్‌ వర్కర్‌ ఎన్ని గేదెలకు సెమెన్‌ చేశారు, ఎన్ని చూడి పరీక్షలు జరిగాయి, చూడి శాతం ఎంత అనే వివరాలను తెలుసుకోవచ్చు. ఏ రకం సెమెన్‌ మంచి ఫలితాలు ఇచ్చిందన్న సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. అదే విధంగా పుట్టిన దూడల జాతి లక్షణాలు, ఆరోగ్య పరిస్థితి, బరువు, వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చిన తేదీలు, నట్టల నివారణ వివరాలు యాప్‌లో నమోదవుతాయి. పాడి రైతులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తూ, పాడి పశువుల ఆరోగ్యం, ఉత్పత్తిని మెరుగుపరచడంలో ‘రెజివెట్‌ కేర్‌’ యాప్‌ కీలకపాత్ర పోషించనుందని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమితి అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు ఆదేశాల మేరకు పాడి రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్టు వివరించారు.

Updated Date - Mar 13 , 2026 | 01:02 AM