కాకినాడ సెజ్‌లో డీఏసీఎల్ ప్లాంట్
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:24 AM
రాష్ట్రానికి మరో ప్రముఖ పరిశ్రమ వస్తోంది. కాకినాడ సెజ్‌లో గుజరాత్‌కు చెందిన డీఏసీఎల్ ఫైన్ కెమ్ సంస్థ స్పెషాలిటీ కెమికల్స్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.
రూ.500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు
50 ఎకరాల్లో ప్లాంట్ నిర్మాణం
దేశ విదేశీ మార్కెట్ల కోసం స్పెషాలిటీ కెమికల్స్ తయారీ
వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు
తొండంగి/హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి మరో ప్రముఖ పరిశ్రమ వస్తోంది. కాకినాడ సెజ్‌లో గుజరాత్‌కు చెందిన డీఏసీఎల్ ఫైన్ కెమ్ సంస్థ స్పెషాలిటీ కెమికల్స్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటవుతుంది. ఇక్కడ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం స్పెషాలిటీ కెమికల్స్‌ను తయారు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల స్థానికంగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో తయారీ రంగం మరింత బలోపేతంకానుంది. ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై కాకినాడ సెజ్ సీఈవో రాంరెడ్డి ఓజిలి, డీఏసీఎల్ పైన్ కెమ్ చైర్మన్ అమిత్ మెహతాల మధ్య హైదరాబాద్‌లో సోమవారం సంతకాలు జరిగాయి. కాకినాడ పారిశ్రామిక పార్క్ మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక లొకేషన్, సమీకృత ఏకోసిస్టమ్‌పై ప్రముఖ తయారీ కంపెనీలకున్న విశ్వాసాన్ని ఈ పెట్టుబడి ప్రతిబింబిస్తోందని ఈ సందర్భంగా రాంరెడ్డి పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు స్పెషాలిటీ కెమికల్స్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్‌కు కాకినాడను ఒక ప్రాధాన్య గమ్యస్థానంగా మార్చుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. డయామైన్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థ అయిన డీఏసీఎల్ ఫైన్ కెమికల్ లిమిటెడ్.. ఫార్మాసూటికల్స్, ఆగ్రోకెమికల్స్, పాలీమర్స్, ప్లాస్టిక్స్, పెయింట్స్, కోటింగ్ ఇండస్ట్రీస్‌కు అవసరమైన స్పెషాలిటీ కెమికల్స్, కెమికల్ ఇంటర్‌మీడియటీస్, పెర్‌ఫార్మెన్స్ కెమికల్స్‌ను తయారు చేస్తుంది. ప్రతిపాదిత ప్రాజెక్టు అధిక విలువ కలిగిన తయారీ రంగ పెట్టుబడులను ఆకర్షించేందుకు కాకినాడ సెజ్ చేస్తున్న ప్రయత్నాల్లో ఒక మైలురాయిగా నిలువనుంది. కాకినాడ సెజ్ ఆరువేల ఎకరాల్లో విస్తరించి ఉండడం, ఇక్కడే గేట్‌వే పోర్టు అందుబాటులో ఉండడంతో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనువైన ప్రాంతంగా పెట్టుబడుదారులు గుర్తించారు. దీంతో ఇప్పటికే ఇక్కడ అరబిందో ఫార్మా ఏర్పాటు కాగా మరో ఆరు సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ డజను వరకూ సీఫుడ్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.