మోసగాళ్లతో మిలాఖత్
ABN , Publish Date - May 10 , 2026 | 04:51 AM
లక్షల్లో మ్యూల్ ఖాతాల సృష్టి... తాము దోచేసిన రూ.కోట్లను వాటిలోకి మళ్లించి, కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు... నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల రుణాలు తీసుకొని ఎగ్గొడుతున్న కేటుగాళ్లు...
బ్యాంకులు, ఆర్థిక, బీమా సంస్థల సిబ్బంది పాత్రపై పోలీసుల నజర్
మోసాల్లో బయటపడుతున్న ‘సంబంధాలు’
(ఆంధ్రజ్యోతి - విజయవాడ)
లక్షల్లో మ్యూల్ ఖాతాల సృష్టి... తాము దోచేసిన రూ.కోట్లను వాటిలోకి మళ్లించి, కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు... నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల రుణాలు తీసుకొని ఎగ్గొడుతున్న కేటుగాళ్లు... బతికున్నోళ్లను చంపేసి బీమా సొమ్ము కాజేస్తున్న మోసగాళ్లు... వీళ్లందరి వెనుకా ఆయా ఆర్థిక సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. నేర పరిశోధనలో వీరు ఏమాత్రం సహకరించకుండా తమవారిని కాపాడుకుంటున్న వైనాన్నీ ఎత్తిచూపిస్తున్నారు.
మ్యూల్ ఖాతాల వెనుక...
చెన్నైకి చెందిన ఓ యువకుడు కృష్ణా జిల్లా యనమలకుదురులోఉన్న బంధువులతో బ్యాంకు ఖాతాలు తెరిపించాడు. సైబర్ నేరాల ద్వారా వచ్చిన డబ్బులను ఈ ఖాతాల్లో జమచేయించాడు. ఆ సొమ్మును వివిధ మార్గాల్లో తనకు మళ్లించుకున్నాడు. ఈ ఖాతాలు తెరవడానికి ఆ ప్రభుత్వ రంగ బ్యాంకులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి సహకరించాడు. స్వయంగా అతడే కొన్ని ఖాతాలను తెరిచి, సహకరించాడు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి, కేవైసీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఆయా సంస్థల్లోని అధికారులు కూడా లక్షల్లో జరుగుతున్న అనుమానిత లావాదేవీలపై కన్నేయకుండా నేరగాళ్లకు సహకరిస్తున్నారు.
బీమా పాలసీలనూ నొక్కేస్తున్నారు...
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఒక అధ్యాపకుడు తన కుమార్తెల భవిష్యత్ అవసరాల కోసం వేర్వేరు ప్రైవేటు బీమా సంస్థల నుంచి పాలసీలు తీసుకున్నారు. నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి ఆ పాలసీలకు నకిలీ పత్రాలు సృష్టించాడు. అసలు పాలసీదారుడిగా అవతారమెత్తాడు. అసలు పాలసీలు పరిశీలించే అవకాశం అతనికి రావడానికి సదరు బీమాసంస్థలోని ఉద్యోగులే సహకరించారు. ఆ తరువాత అతను ఇచ్చిన నకిలీ పత్రాలను ఏ మాత్రం పరిశీలించకుండా సహకరించారు. దీంతో ఆ మోసగాడు రూ.16 లక్షలు తన ఖాతాలో జమ చేయించుకున్నాడు. ఈ కుట్రలో బీమా సంస్థకు చెందిన ఏజెంట్ ఉన్నాడని పోలీసులు నిర్ధారించారు.
కంపెనీ నకిలీ పత్రాలతో...
గుంటూరుకు చెందిన మారం మోహన్ మరికొంతమందితో కలసి విజయవాడకు చెందిన రాజ్ ఎంటర్‌ప్రైజస్ లేబర్ లైసెన్స్, జీఎస్టీ లైసెన్స్‌లకు నకిలీలు తయారు చేయించాడు. వాటిని ఉపయోగించుకుని ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల నుంచి కోట్లాది రూపాయల రుణాలు పొందాడు. ఇందుకు ఆయా సంస్థల్లో ఉద్యోగులు సహకరించారు. షెల్ కంపెనీల పేరుతో ఖాతాలను తెరవడానికి, వాటిలోకి నిధులు మళ్లించుకోవడానికి సైబర్ నేరగాళ్లకు ఆస్కారమిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ఇలా సహకరించిన బ్యాంకు సిబ్బంది, మేనేజర్లను దేశ వ్యాప్తంగా పదుల సంఖ్యలో పోలీసులు, కేంద్ర నేర పరిశోధనా సంస్థలు అరెస్టు చేశాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.
సిబ్బంది సంపూర్ణ సహకారంతోనే...
ఈ మోసాల తీరు వేర్వేరుగా ఉన్నా... వాటన్నింటి మధ్యా ఒక సారూప్యత ఉంది. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది నిందితులకు సంపూర్ణ సహకారం అందించారు. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు పోటీగా ప్రైవేటు బ్యాంకులు కార్యకలాపాలను విస్తరించాయి. వాటితోపాటు కొత్త ఫైనాన్స్ సంస్థలు మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నాయి. భవిష్యత్తు అవసరాల కోసం, పిల్లల కోసం తమ సంపాదనలో కొంత మొత్తాన్ని పాలసీల రూపంలో భద్రపరచుకునే వారి సంఖ్య పెరిగింది. అదే సమయంలో వారి సొమ్ముకు సంపూర్ణ భద్రతా ప్రశ్నార్థకమవుతోంది. అన్ని రంగాల్లోను ఆన్‌లైన్ సేవలు విస్తరించాయి. వినియోగదారులు బీమా పాలసీ తీసుకోవాలన్నా, సొమ్ము వెనక్కు తీసుకోవాలన్నా, రుణాలు పొందాలన్నా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దీనిని ఆసరా చేసుకొని మోసగాళ్లు నకిలీ పత్రాలతో ఆన్‌లైన్‌లో రుణాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. వాటిని పరిశీలించే సిబ్బందితో కమీషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటున్నారు. దీనితో సిబ్బంది దరఖాస్తులను పైపైనే పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నట్టు రిమార్కులు రాసి సంతకాలు చేస్తున్నారు. తర్వాత చకచకా రుణాలు మంజూరు చేస్తున్నారు. సిబ్బంది మిలాఖత్ అవడంతో జరుగుతున్న మోసాలపై నమోదు అవుతున్న కేసులన్నీ చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగానే ఉంటున్నాయి. కేసుల దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆయా సంస్థలకు వెళ్లి వివరాలు అడిగినప్పుడు దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారు. అన్ని దరఖాస్తులు, రికార్డులు ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలోని ప్రధాన కార్యాలయాల్లో ఉంటాయని చెబుతున్నారు. తద్వారా తమ తప్పులు పోలీసుల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చివరికి సీసీ ఫుటేజీల విషయంలోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు.