Share News

సులభతర వాణిజ్యంలో కస్టమ్స్‌ పాత్ర కీలకం

ABN , Publish Date - May 24 , 2026 | 04:49 AM

దేశ భద్రత, సులభతర వాణిజ్యం అంశాల్లో పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ అధికారుల పాత్ర కీలకమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి అన్నారు.

సులభతర వాణిజ్యంలో కస్టమ్స్‌ పాత్ర కీలకం

  • ఐఆర్‌ఎస్‌ 76వ బ్యాచ్‌ స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి

హిందూపురం, మే 23(ఆంధ్రజ్యోతి): దేశ భద్రత, సులభతర వాణిజ్యం అంశాల్లో పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ అధికారుల పాత్ర కీలకమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పాలసముద్రం సమీపంలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్‌, ఇండైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కొటిక్స్‌లో (నాసిన్‌) శనివారం జరిగిన ఐఆర్‌ఎస్‌ 76వ బ్యాచ్‌ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాసిన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 79 మంది ఐఆర్‌ఎస్‌ అఽధికారుల నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ అధికారుల సేవలు భారతదేశ ప్రగతికి దోహదపడతాయని తెలిపారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌(సీబీఐసీ) వేగంగా ఆధునిక సాంకేతిక సంస్థగా రూపాంతరం చెందుతోందని వెల్లడించారు. సైబర్‌ ఆధారిత ఆర్థిక నేరాలు, అక్రమ రవాణా నెట్‌వర్క్‌లు, స్మగ్లింగ్‌ వంటి క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజాసేవకు సత్యనిష్టే పునాది అని, అధికారుల విశ్వసనీయత, నిజాయితీ, నిష్పక్షపాత విధానాలపై ప్రగతి ఆధారపడి ఉంటుందని స్పష్టంచేశారు.

Updated Date - May 24 , 2026 | 04:50 AM