Share News

Spurious Liquor Case: నకిలీ మద్యం కేసులో.. ముగిసిన జోగి సోదరుల కస్టడీ

ABN , Publish Date - Jan 05 , 2026 | 04:06 AM

అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌(ఏ-32), ఆయన సోదరుడు రాము (ఏ-33) కస్టడీ విచారణ ఆదివారంతో ముగిసింది.

Spurious Liquor Case: నకిలీ మద్యం కేసులో.. ముగిసిన జోగి సోదరుల కస్టడీ

  • నేడు విజయవాడ జైలుకు తరలింపు

అన్నమయ్య/ములకలచెరువు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌(ఏ-32), ఆయన సోదరుడు రాము (ఏ-33) కస్టడీ విచారణ ఆదివారంతో ముగిసింది. దీంతో వీరిద్దరిని విజయవాడ నుంచి ప్రత్యేక బలగాల మధ్య రాత్రి 9.30 గంటల సమయంలో తంబళ్లపల్లె కోర్టుకు తీసుకొచ్చారు. వీరిద్దరినీ మూడ్రోజులు కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లె జూనియర్‌ సివిల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ నెల 2వతేదీన విజయవాడ జైలులో ఉన్న జోగి సోదరులను ఎక్సైజ్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సుదీర్ఘంగా విచారించి కీలక విషయాలు రాబట్టారు. ఆదివారం కస్టడీ ముగియడంతో తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరచి.. మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు. సోమవారం ఉదయం తిరిగి విజయవాడ జైలుకు తీసుకెళ్లనున్నారు. కాగా.. తంబళ్లపల్లె కోర్టుకు జోగి రమేశ్‌ కుమారుడు రాజీవ్‌, వైసీపీ తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి వచ్చారు. కోర్టులోకి వచ్చిన రమేశ్‌తో వీరిద్దరూ మాట్లాడారు. మరోవైపు.. జోగి సోదరులను కోర్టుకు తీసుకొస్తున్నారని తెలిసి వైసీపీ కార్యకర్తలు అక్కడకు తరలివచ్చారు. వారు లోపలకు వెళ్లేందుకు ప్రత్నించగా పోలీసులు మూడు చోట్ల బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు.

Updated Date - Jan 05 , 2026 | 04:11 AM