Share News

సీఎస్ఈ.. వెరీ ఈజీ!

ABN , Publish Date - Jun 02 , 2026 | 05:54 AM

2023 నుంచి 2025 వరకు రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో అడ్మిషన్లపై ఉన్నత విద్యాశాఖ విశ్లేషణ చేసింది. ఏ ర్యాంకు విద్యార్థులు ఏ కోర్సుల్లో సీట్లు పొందుతున్నారనే దానిపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

సీఎస్ఈ.. వెరీ ఈజీ!

  • ఇంజనీరింగ్‌లో ‘సీఎస్ఈ’ సీటు కొట్ట డం అంటే ఒకప్పుడు చాలా కష్టం! మంచి ర్యాంకు సాధిస్తేనే కంప్యూటర్‌ సైన్స్‌లో సీటు వచ్చేది. అదే ఇప్పుడు చాలా ఈజీ!! లక్షన్నర ర్యాంకు వచ్చిన వారు కూడా సీఎస్ఈలో అడ్మిషన్‌ పొందుతున్నారు. దీనికి కారణం రాష్ట్రంలోని కాలేజీలు గత కొన్నేళ్లుగా సీట్ల సంఖ్య ఎడాపెడా పెంచుకుంటూ పోవడం.. అందులోనూ సీఎస్ఈ బ్రాంచ్‌ల్లోనే అదనపు సీట్లకు అనుమతులు తెచ్చుకోవడం! భారీ సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉండడంతో సీఎస్‌ఈ అడ్మిషన్‌ పొందడం అటు టాపర్లతో పాటు ఇటు చివరి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కూడా చాలా సులభమైపోయింది.

  • సులభమైపోయిన కంప్యూటర్‌ సైన్స్‌ సీటు

  • టాపరైనా, చివరి ర్యాంకరైనా అడ్మిషన్‌ గ్యారంటీ

  • లక్షన్నర ర్యాంకు వచ్చిన వారికీ సీఎస్ఈ సీటు

  • సీఎస్ఈ-ఏఐ అడ్మిషన్లలో సగటు ర్యాంకు 1,05,865

  • ఇంజనీరింగ్‌ అడ్మిషన్లపై ఉన్నత విద్యాశాఖ విశ్లేషణ

  • ఫీజుల కోసం కాలేజీలు ఎడాపెడా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల సీట్లు పెంచుకోవడమే కారణం

  • మొత్తం ఇంజనీరింగ్‌ సీట్లలో సీఎస్ఈ వాటా 54శాతం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

2023 నుంచి 2025 వరకు రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో అడ్మిషన్లపై ఉన్నత విద్యాశాఖ విశ్లేషణ చేసింది. ఏ ర్యాంకు విద్యార్థులు ఏ కోర్సుల్లో సీట్లు పొందుతున్నారనే దానిపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. స్టేట్‌ టాపర్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో చేరుతున్నాడు. దాదాపు లక్షన్నర ర్యాంకు వచ్చిన విద్యార్థి కూడా సీఎస్ఈలోనే అడ్మిషన్‌ పొందుతున్నాడు. లక్ష దాటి ర్యాంకులు వచ్చిన వారిలోనూ సీఎ్‌సఈలో చేరుతున్నవారు ఎంతో మంది ఉంటున్నారు. 2024లో అడ్మిషన్లను పరిశీలిస్తే.. సీఎస్ఈలో సగటు ర్యాంకు 80,150గా ఉంది. అంటే ఆ ఏడాది సీఎస్ఈలో అడ్మిషన్లు పొందిన వారిలో టాప్‌ 25 శాతం ర్యాంకర్లు 30 శాతం సీట్లను మాత్రమే తీసుకున్నారు. 25-50 శాతం ర్యాం కర్లు 26 శాతం సీట్లను, 50-75 శాతం ర్యాంకర్లు 24 శాతం సీట్లను పొందారు. చివరి 25శాతం ర్యాంకర్లు కూడా 20 శాతం సీట్లు పొందారు. ఒకప్పుడు టాప్‌ నుంచి 50శాతం ర్యాంకర్లతోనే సీఎస్ఈ సీట్లు నిండిపోయేవి. కానీ ఇప్పుడు పెరిగిన సీట్ల కారణంగా చివరి ర్యాంకుల విద్యార్థులు కూడా ఏదొక కాలేజీలో సులభంగా సీఎస్ఈ సీట్లు పొందుతున్నారు. సీఎస్ఈ-ఏఐఎంల్‌ సీట్లను మొదటి 25 శాతం ర్యాంకర్లు 35 శాతం పొందారు. ఈ బ్రాంచ్‌లో చివరి ర్యాంకర్లకూ 19శాతం సీట్లు దక్కాయి. సీఎస్ఈ డేటా సైన్స్‌లో మొదటి 25శాతం ర్యాంకర్లు 25 శాతం సీట్లు పొందగా... చివరి క్వార్టర్‌ ర్యాంకర్లు 26 శాతం సీట్లు దక్కించుకున్నారు. సీఎస్ఈ-ఏఐలో మొదటి ర్యాంకర్లు కేవలం 17శాతం సీట్లు తీసుకుంటే, చివరి ర్యాంకర్లు 30శాతం సీట్లు తీసుకున్నారు. ఈ బ్రాంచ్‌ లో సగటు అడ్మిషన్ల ర్యాంకు ఏకంగా 1,05,865. ఈసీఈ కోర్సులో అడ్మిషన్లు చూస్తే మొదటి ర్యాంకర్లు 22శాతం సీట్లు పొందగా, చివరి ర్యాంకర్లు 27 శాతం సీట్లు పొందారు. 2025లోనూ దాదాపుగా ఇదే ట్రెండ్‌ కనిపించింది.


ఏటా భారీగా పెరుగుతున్న సీట్లు

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్లు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. 2023లో మొత్తం మంజూరైన సీట్లు 1,33,236. వాటిలో కన్వీనర్‌ కోటాలో 77,804, మేనేజ్‌మెంట్‌ కోటాలో 22,839 సీట్లు భర్తీ అయ్యాయి. 2024లో సీట్ల సంఖ్య 1,66,553కు పెరిగింది. వాటిలో కన్వీనర్‌ కోటాలో 1,03,686, మేనేజ్‌మెంట్‌లో 30,936 సీట్లు నిండాయి. 2025లో మొత్తం సీట్ల సంఖ్య ఏకంగా 1,87,618కు చేరింది. కన్వీనర్‌లో 1,11,431, మేనేజ్‌మెంట్‌లో 32,648 సీట్లు భర్తీ అయ్యాయి. కాగా, 2025లో మొత్తం సీట్లలో కేవలం సీఎస్ఈ సీట్లే 1,01,274 ఉన్నాయి. మొత్తం ఇంజనీరింగ్‌ సీట్లలో సీఎస్ఈ వాటానే 54 శాతంగా ఉంది.

ఇంకా పెంచుతున్న కాలేజీలు

కాలేజీ యాజమాన్యాలు ప్రతి ఏటా సీఎస్ఈ సీట్లను పెంచుకుంటూ వెళ్తున్నాయి. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం సీఎస్ఈతో పాటు కనీసం నాలుగు బ్రాంచ్‌లు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇతర బ్రాంచ్‌ల్లో విద్యార్థుల చేరికలు భారీగా తగ్గడంతో వాటిలో సీట్లు తగ్గించి, సీఎస్ఈ బ్రాంచ్‌ల్లో పెంచుకుంటున్నాయి. మెకానికల్‌, సివిల్‌, ఈఈఈ లాంటి బ్రాంచ్‌లు నామమాత్రంగా మారిపోతున్నాయి. సీఎస్ఈలోనే ఉప బ్రాంచ్‌లు పెరిగిపోవడంతో వాటిలో సీట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి. ఏఐసీటీఈ కూడా ఉదారంగా సీట్ల పెంపునకు అనుమతులు ఇస్తోంది. సీఎస్ఈ సీట్లు పెరగడం వల్ల కాలేజీలకు రాబడి పెరుగుతోంది. ఒకప్పుడు సీఎస్ఈలో సీటు రాకపోతే కొందరు డిగ్రీ కోర్సుల్లో చేరేవారు. కానీ ఇప్పుడు ఏదొక కాలేజీలో సీఎస్ఈ సీటు లభించే పరిస్థితి రావడంతో డిగ్రీ వైపు చూడటం లేదు. పైగా చివరి ర్యాంకులు వచ్చినవారూ సీఎ్‌సఈలోనే చేరడం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వంపై పెరుగుతున్న భారం

కాలేజీలు సీట్లు పెంచుకుంటూ పోతుండటం ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారుతోంది. రాష్ట్రం లో ఇంజనీరింగ్‌ కోర్సుల కనీస ఫీజు రూ.40 వేలుగా ఉంది. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంతో మొత్తం భారం ప్రభుత్వంపైనే పడుతోంది. మరోవైపు డిగ్రీ కోర్సుల సగటు ఫీజు రూ.15వేలుగా ఉంది. సీఎస్ఈ సీట్లు పెరగడంతో డిగ్రీలో కాకుండా ఇంజనీరింగ్‌లో చేరడం వల్ల ప్రభుత్వానికి భారం అవుతోంది. కాలేజీలు ఏటా సీట్లు పెంచడంతో భారం ఇంకా పెరుగుతోంది.

Updated Date - Jun 02 , 2026 | 05:54 AM