ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రధానం
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:41 AM
‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రధానం, ఎన్నికలకు ప్రజలు ప్రధానం, ప్రజాస్వామ్య పటిష్ఠానికి ఓటు హక్కు వినియోగమే పునాది’ అని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు.
ఎన్నికలకు ప్రజలు ప్రధానం.. ఓటు.. హక్కు కాదు బాధ్యత
జాతీయ ఓటర్ల దినోత్సవంలో సీఎస్ విజయానంద్
విజయవాడ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రధానం, ఎన్నికలకు ప్రజలు ప్రధానం, ప్రజాస్వామ్య పటిష్ఠానికి ఓటు హక్కు వినియోగమే పునాది’ అని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు అత్యంత విలువైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 26న స్థాపించబడిన సందర్భంగా ప్రతి ఏటా అదే తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఓటింగ్ ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం, యువ ఓటర్లను ప్రోత్సహించడం, వారి హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశమన్నారు. ‘ఈ ఏడాది ‘‘నా భారత్-నా ఓటు’’ థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఓటు వేయడం హక్కు మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి బాధ్యత. ప్రతి ఓటూ ప్రజాస్వామ్య భారత నిర్మాణానికి బలమైన పునాది వేస్తుంది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దీని బలం పౌరుల భాగస్వామ్యంలోనే ఉంది. యువత ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన పెంచుకుని, ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలి’ అని పిలుపిచ్చారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వివేక్ యాదవ్ మాట్లాడుతూ.. గతంలో ఓటు నమోదు చేసుకోవడానికి జనవరి 1వ తేదీని మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారని.. ఇప్పుడు కొత్తచట్టం ప్రకారం 18 ఏళ్లు నిండిన వారు సంవత్సరంలో నాలుగు తేదీల్లో (జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబరు 1) ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. కేవలం ఎపిక్ కార్డు ఉంటే ఓటువేసే హక్కు రాదని, ఓటరు జాబితాలో అభ్యర్థి పేరు ఉందో లేదో సీఈవో వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. ఓటు వేయడం రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రకారం లభించే భావప్రకటన, వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఒక వ్యక్తి సాధారణంగా ఎక్కడ నివసిస్తుంటే అక్కడ ఓటుహక్కు కల్పించాలని.. వ్యక్తి పుట్టిన చోటు, ఉద్యోగం చేసే చోటు వేర్వేరుగా ఉండవచ్చని.. తన ఓటు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను అతడికివ్వాలని తెలిపారు. తర్వాత నూతనంగా ఓటు నమోదు చేసుకున్న నలుగురికి ఎపిక్ కార్డులు అందజేశారు. ఓటుహక్కు ప్రాముఖ్యంపై మతం, కులం, జాతి, భాషాపరమైన ప్రలోభాలకు నవ్వకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని కార్యక్రమానికి హాజరైన వారితో సీఎస్ ప్రతిజ్ఞ చేయించారు. ఉత్తమ ఎన్నికల నిర్వహణ అవార్డులను పలు జిల్లాల కలెక్టర్లకు అందించారు. అంతకుముందు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ వర్చువల్‌గా మాట్లాడారు. ‘2025 ఎన్నికల కమిషన్‌కు గణనీయమైన విజయాలు, ఆవిష్కరణల సంవత్సరంగా నిలిచింది. ఓటర్ల జాబితాలో కచ్చితత్వాన్ని, సమగ్రతను పెంపొందించడం, ఓటింగ్ ప్రక్రియను ప్రతి ఓటరుకు మరింత సులభంగా అందుబాటులోకి తెచ్చి.. ఎన్నికల సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడమే ఈసీ లక్ష్యం’ అని తెలిపారు.