Share News

సీఎస్‌తో ఎన్‌డీసీ ప్రతినిధి బృందం భేటీ

ABN , Publish Date - Mar 18 , 2026 | 06:27 AM

ఢిల్లీలోని నేషనల్‌ డిఫెన్స్‌ కళాశాల(ఎన్‌డీసీ)కు చెందిన ఎం.వి.పటేల్‌ నేతృత్వంలో 16 మంది ప్రతినిధుల బృందం మంగళవారం అమరావతి సచివాలయంలో...

సీఎస్‌తో ఎన్‌డీసీ ప్రతినిధి బృందం భేటీ

  • విశాఖ స్మార్ట్‌సిటీ, అమరావతి అభివృద్ధిపై అధ్యయనం

అమరావతి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని నేషనల్‌ డిఫెన్స్‌ కళాశాల(ఎన్‌డీసీ)కు చెందిన ఎం.వి.పటేల్‌ నేతృత్వంలో 16 మంది ప్రతినిధుల బృందం మంగళవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌తో భేటీ అయ్యింది. ఇందులో భాగంగా అమరావతి నూతన రాజధాని నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను ప్రభుత్వం అధిగమిస్తూ నిర్మాణ పనులను ఏవిధంగా ముందుకు తీసుకువెళుతున్నదీ సీఎ్‌సను అడిగి తెలుసుకున్నారు. సీఎస్‌ సాయిప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఎదురవుతున్న అనేక ఆర్థికపరమైన ఇబ్బందులను అధికమిస్తూ రాష్ట్రానికి ఒక బృహత్తరమైన రాజధాని ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు సమీకరించి ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడిన నూతన రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. కేవలం రాజధాని నిర్మాణమే కాకుండా రాష్ట్ర సర్వతోముఖాభివృద్దిని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాల్లో తగిన అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఎన్డీసీ ప్రతినిధి ఎంవీపటేల్‌ మాట్లాడుతూ.. ఎన్డీసీ ప్రతి ఏటా 47వారాల జాతీయ భద్రత, వ్యూహాత్మక అధ్యయన కోర్సు నిర్వహిస్తోందని, ఈ కోర్సులో భాగంగా వివిధ రాష్ర్టాలు, దేశాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈకోవలోనే రాష్ర్టానికి వచ్చామన్నారు. విశాఖలో స్మార్ట్‌ సిటీ అభివృద్ధిపై, అమరావతిలో రాజధాని అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నట్లు పేర్కొన్నారు. తమ కోర్సు సభ్యులు.. ఇక్కడ రాష్ట్రాధిపతులను కలుసుకుని రాష్ట్రంలో జరిగే రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక పరిస్థితులను అర్థం చేసుకుంటారని చెప్పారు.

సీఎస్‌తో మేజర్‌ జనరల్‌ అజయ్‌ మిశ్రా భేటీ

తెలంగాణ, ఆంధ్రా సబ్‌ ఏరియా(టీఏఎస్ఏ) మేజర్‌ జనరల్‌ అజయ్‌ మిశ్రా నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం అమరావతి సచివాలయంలో సీఎస్‌ సాయి ప్రసాద్‌ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆర్మీ సంబంధిత యూనిట్లు, ఇతర అంశాలకు సంబంధించిన భూ కేటాయింపు తదితరవాటిపై సీఎ్‌సతో చర్చించింది.

Updated Date - Mar 18 , 2026 | 06:32 AM