Share News

శ్రీనగర్‌లో సీఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ మృతి

ABN , Publish Date - Jul 10 , 2026 | 04:25 AM

శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని దిగువగంగంపల్లికి చెందిన సీఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ యనమల రవిచంద్రారెడ్డి(56) జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మృతి చెందారు.

 శ్రీనగర్‌లో సీఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ మృతి

  • మృతుని స్వస్థలం శ్రీసత్యసాయి జిల్లా దిగువగంగంపల్లి

గోరంట్ల, జూలై 9(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని దిగువగంగంపల్లికి చెందిన సీఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ యనమల రవిచంద్రారెడ్డి(56) జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మృతి చెందారు. ఆయనకు బుల్లెట్‌లు తగిలి గాయపడటంతో ఆస్పత్రికి తరలిస్తున్నామని అక్కడి అధికారులు బుధవారం రాత్రి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత కాసేపటికే మృతి చెందినట్టు సమాచారం అందటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రవిచంద్రారెడ్డి 36 ఏళ్ల క్రితం సీఆర్పీఎఫ్‌ లో చేరిన రవిచంద్రారెడ్డికి ఇటీవలే సీఐగా ఉద్యోగోన్నతి ఖరారైంది. ఆయనకు భార్య గాయత్రి, కూతురు వర్షిత, కుమారుడు తారక్‌నాథ్‌ రెడ్డి ఉన్నారు. ఈ నెల 15వ తేదీన ఇంటికి వస్తానని రవిచంద్రారెడ్డి ఇటీవలే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇంతలోనే ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రవిచంద్రారెడ్డి మృతి గురించి అధికారికంగా సమాచారం అందిందని గోరంట్ల సీఐ శేఖర్‌ తెలిపారు. ఆయన పార్థివ దేహం గురువారం రాత్రి బెంగళూరుకు చేరుకుంటుందని, కుటుంబ సభ్యుల కోరిక మేరకు నేరుగా వారి స్వగ్రామానికి చేరుస్తామని తెలిపారు.

Updated Date - Jul 10 , 2026 | 04:26 AM