AP Cockfighting: కోట్లలో బరిగీసి.. పెద్ద బరికి 3 కోట్ల ఖర్చు..
ABN , Publish Date - Jan 13 , 2026 | 05:10 AM
సంక్రాంతి పండగ కోడి పందేలకు ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బరులు సిద్ధమయ్యాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే ఈ ఏడాది వందలాది బరులు ఏర్పాటు చేశారు.
జిల్లాల్లో కోడి పందేలకు అంతా రెడీ
రూ.కోట్ల ఖర్చుతో వందల బరులు
అతిథుల రూమ్‌లకు రూ.30 లక్షలు
రకరకాల విందు భోజనాలకు 50 లక్షలు
మద్యానికి రూ.20-30 లక్షల వరకు
కత్తులకే రూ.5 లక్షల వరకు ఖర్చు
షామియానాలు, సెక్యూరిటీ, బౌన్సర్లు, లైట్లు, ఏసీలు, జనరేటర్లకూ లక్షల్లోనే
కోతాటకు వేలం.. అక్కడే గుండాట
బరిని బట్టి పోలీసులకు లక్షల్లో ముడుపులు
సంక్రాంతి పండగ కోడి పందేలకు ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బరులు సిద్ధమయ్యాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే ఈ ఏడాది వందలాది బరులు ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఓ గ్రామంలో కోడి పందెం బరి నిర్వహిస్తే అది చుట్టుపక్కల గ్రామాలకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తమ బరికి మండలం, జిల్లా దాటి రాష్ట్రం, ఇతర రాష్ట్రాల ప్రజలూ రావాలని నిర్వాహకులు ఆశిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బరులు ఏర్పాటు చేస్తున్నారు. అదే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. బరి ఏర్పాటు, నిర్వహణ ఎంతో శ్రమ, ఖర్చుతో కూడుకున్నది. అధికార పార్టీ పెద్దలను ఒప్పించాలి. పోలీసులను ప్రసన్నం చేసుకోవాలి. ఊరిలో బరి ఎక్కడ నిర్వహించాలి? అతిథులకు రూమ్‌లు, వంట వాళ్లు, షామియానాలు, స్టేజీ ఏర్పాట్లు, సెక్యూరిటీ, బౌన్సర్లు, కత్తులు, మద్యం, కార్ పార్కింగ్‌లు వంటి సదుపాయాలు ఎలా కల్పించాలి? తదితర విషయాల్లో సంక్రాంతి పండగకు ఆర్నెల్లు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఒక బరి నిర్వహించాలంటే పది లక్షల నుంచి నుంచి మూడు కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇప్పుడు కోడి పందేలంటే కోట్లలో వ్యాపారం. ప్రధానంగా ప్రజాప్రతినిధులు నేరుగా కాకుండా తమ వారితో వీటిని నిర్వహిస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చుట్టు పక్కల ప్రాంతాలలో ఈసారి కోడి పందేలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
భీమవరంలో భారీ బరులు
భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని బరులలో ఒక్కొక్క దానికి రూ.3 కోట్లపైనే ఖర్చు చేశారు. బరి కోసం స్థల సేకరణ, చదును, స్టేజీల నిర్వహణ, షామియానా, వాటర్ బాటిల్స్, మద్యం, భోజనాలు, రూమ్‌లు, కోళ్లకు షామియానాలు, కార్ పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లు, విద్యుత్ సౌకర్యం, ఏసీలు, జనరేటర్లు, కత్తులు, పూలదండలు, కూలీలు, కత్తులు కట్టేవారు, కోళ్లతో పందేలు జరిపే వారికి జీతభత్యాలు వంటివి అనేక ఖర్చులు ఉంటాయి.
6 నెలల ముందే రూమ్‌లు బుకింగ్
కోడి పందేలకు వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా రూమ్‌లను బుక్ చేస్తారు. ప్రస్తుతం భీమవరంలో రూమ్ ఒక్కోటి.. మూడు రోజులకు 30 వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతోంది. మూడు నుంచి ఆరు నెలల ముందుగానే అడ్వాన్స్ చెల్లించి రూమ్‌లను అతిఽథుల కోసం రిజర్వు చేస్తారు. రూమ్‌ల కోసం రూ.30 లక్షలపైనే ఖర్చు చేస్తున్నారు.
సెక్యూరిటీ, బౌన్సర్లు
కోడి పందేల సందర్భంగా క్రమశిక్షణగా ఉండేందుకు సెక్యూరిటీ, బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటారు. స్టేజీలు, టెంట్ల నిర్వహణకు సూపర్‌వైజర్లు ఉంటారు. అతిఽథులకోసం కొన్నిచోట్ల కర్పూరందండలు ఏర్పాటు చేస్తారు. అవి ఒక్కోటి రూ.10 వేలు పలుకుతుంది.
కోతాటకు వేలం
కోడి పందేల బరుల వద్ద జూదానికి పెద్దపీట వేస్తారు. కోతాట నిర్వహణకు వేలం నిర్వహిస్తారు. ఎక్కువగా చెల్లించిన వారికి నిర్వహించుకునే విధంగా అనుమతి ఇస్తారు. వారు కోతాటను నిర్వహిస్తూ కేబుల్ (కొంత నగదు) వసూలు చేసుకుంటారు. ఇది ప్రధాన ఆదాయ వనరు కావడంతో చాలా మంది పోటీ పడతారు. కోతాట ఆడేందుకు ఇతర రాష్ర్టాల నుంచి వేలాది మంది లక్షలాది రూపాయలతో వస్తారు. డెల్టా ప్రాంతంలో ఒక్క బరిలో కోతాట నిర్వహణకు రూ.1.20 కోట్లకు వేలంలో ధర పలికినట్లు సమాచారం.
25 ఎకరాలతో పార్కింగ్
కోడి పందేలకు ఎక్కువగా కార్లలో వస్తుంటారు. పార్కింగ్ సౌకర్యం ఉన్నచోటకే అత్యధికంగా అతిథులు వెళుతుంటారు. కాళ్ళ మండలంలో ఒక బరికి 25 ఎకరాలు పార్కింగ్ స్థలం కేటాయించారు.
పోలీసులకు మామూళ్లు
కోడి పందేల బరుల నిర్వహణకు అనధికారికంగా పోలీసుల అనుమతులు తప్పనిసరి. బరి స్థాయిని బట్టి నగదు, బైండోవర్‌కు వ్యక్తులను ఇవ్వవలసి ఉంటుంది. ప్రస్తుతం సాధారణ బరికి 3 రోజులకు గాను రూ.1.50 లక్షలు, పెద్ద బరులకు రూ.10లక్షలు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కత్తులతో పందేలు నిర్వహించినా, డింకీ పందేల(కత్తులు లేకుండా)ను నిర్వహించినా కేసులు కడుతున్నట్లు సమాచారం. కానిస్టేబుళ్లు, ఐడీ పార్టీ, విజిలెన్స్ ఇలా అనేక మంది బరులు వద్దకు వెళ్లి మరీ నగదు తెచ్చుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మాకూ ఇవ్వండి
సంక్రాంతి పండగకు నిర్వహించే కోడి పందేలలో సంప్రదాయం కోసమని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. కొందరు డబ్బులు పోగొట్టుకుంటుండగా, మరికొంతమంది జేబులు నింపుకొంటున్నారు. మరికొంతమంది గ్రామాల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. కోడి పందేల ప్రారంభంలో గ్రామాల అభివృద్ధికి కేబుల్ వసూలు చేస్తున్నామని చెప్పి, నిర్వాహకులు చిల్లిగవ్వ ఇవ్వకుండా జేబులో వేసుకుంటున్నారు. కాగా తాడేపల్లిగూడెం మండలంలోని ఓ గ్రామంలో పందేలకు గాను గ్రామ పెద్దలు అనుమతిస్తూ ఊరికి మంచినీటి ట్యాంకర్‌ను కేబుల్ కింద వసూలు చేశారు.
పందెగాళ్లు.. ప్రధాన భూమిక
కోడి పందేల్లో పందెగాళ్లు ప్రధాన భూమిక పోషిస్తారు. ఫలానా వారు ఏ బరిలో ఉంటే అక్కడ పందేలు బాగా జరుగుతాయని నానుడి. దీంతో బరుల నిర్వాహకులు పందెగాళ్లను ఆకర్షిస్తారు. ఎక్కువ మంది నుంచి ఆహ్వానం, ఒత్తిడి పెరగడంతో పందెగాళ్లు కేబుల్‌లలో తమకూ కొంత వాటా ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది. వాటాను బట్టి వారు ఆయా కేంద్రాలకు వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
- ఆకివీడు రూరల్, ఆంధ్రజ్యోతి
స్టేట్‌సను బట్టి మద్యం బ్రాండ్లు
కోడి పందేలలో భాగంగా మద్యం కూడా ఉంటుంది. అతిథుల స్టేట్‌సను బట్టి వారికి ఇష్టమైన బ్రాండ్ అందజేస్తారు. మూడు రోజులు మద్యం ఏరులై పారుతుంది. ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినచోట అందజేస్తారు. మద్యంలో మంచింగ్ కోసం రకరకాల వంటకాలు ఉంటాయి. మద్యం కోసం కొన్ని బరుల వద్ద రూ.20 లక్షల నుంచి 30 లక్షలు వరకు ఖర్చు చేస్తున్నారు.
కత్తులు.. ప్రత్యేకం
కోడి పందేలలో కీలకమైనది కత్తి. పందేల్లో జయాపజయాలను ఇదే నిర్ణయిస్తుంది. ఇందుకు ఉపయోగించే కత్తుల కోసం రూ.5 లక్షల వరకు వెచ్చిస్తారు. ఒక్కొక్క కత్తి రూ.600 అవుతుంది. ఒక్కో బరి వద్ద సుమారు 500 కత్తులు సిద్ధంగా ఉంచుతారు. కత్తులు వేసేవారు నాణ్యమైన వాటిని ఎంపిక చేస్తారు. కత్తులు వేసే వారికి అదనంగా కొంత మొత్తంతోపాటు భోజనాలు, ఇతర ఖర్చులు చెల్లిస్తారు.