పంటల బీమాతో ప్రతి రైతుకూ రక్షణ
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:22 AM
ఎల్‌నినో నేపథ్యంలో పంటల బీమా ద్వారా ప్రతి రైతుకూ రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
రైతుల సమ్మతితోనే నమోదు: అచ్చెన్నాయుడు
అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో నేపథ్యంలో పంటల బీమా ద్వారా ప్రతి రైతుకూ రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పంటల బీమా నమోదు రైతుల సమ్మతితోనే జరుగుతోందని, ఎవరినీ బలవంతం చేయట్లేదని ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ‘బీమా గడువుల పొడిగింపునకు కంపెనీలు సుముఖత చూపకపోయినా సీఎం చంద్రబాబు కేంద్రం, బీమా సంస్థలతో మాట్లాడి గడువు పెంచడానికి కృషి చేశారు. పీఎంఎ్‌ఫబీవై గడువును ఆగస్టు 31 వరకు పెంచాలని ప్రతిపాదించాం. రైతుల వివరాల నమోదుకు బ్యాంకులకు మరో 15 రోజుల సమయం ఇచ్చాం. 2025 ఖరీ్‌ఫలో బీమా నమోదు 19.50 లక్షలుగా ఉండగా, 2026 ఖరీ్‌ఫలో 35.17 లక్షలకు పెరిగింది. బీమా విస్తీర్ణం 7.83 లక్షల హెక్టార్ల నుంచి 15.17 లక్షల హెక్టార్లకు పెరిగింది. మొత్తం బీమా రూ.13,983 కోట్లుగా నమోదైంది. గత ప్రభుత్వంలో రూ.1990 కోట్ల ప్రీమియం బకాయిలు చెల్లించలేదు. ఆ కారణంగానే రైతులకు బీమా పరిహారం రాకుండా నిలిచిపోయింది. ఆ బకాయిలను కూటమి ప్రభుత్వం దశల వారీగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటుంది’ అని వివరించారు.