కల్తీ నెయ్యితో ప్రసాదం మహాపాపం
ABN , Publish Date - May 04 , 2026 | 05:09 AM
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి కల్తీ ప్రసాదాలను నివేదించి మహా పాపాలకు ఒడిగట్టిన పాపాత్ములపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సింఘాల్, వైవీ, ధర్మారెడ్డి, భూమనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: భానుప్రకాశ్‌రెడ్డి
తిరుపతి(నేరవిభాగం), మే 3 (ఆంధ్రజ్యోతి): కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి కల్తీ ప్రసాదాలను నివేదించి మహా పాపాలకు ఒడిగట్టిన పాపాత్ములపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, అప్పటి ఈవోలు అనిల్‌కుమార్ సింఘాల్, ధర్మారెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవలసిందేనని స్పష్టంచేశారు. దీనిని బుధవారం (6న) జరిగే పాలక మండలి సమావేశంలో తాను ప్రతిపాదిస్తానని తెలిపారు. ఆదివారం ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. శ్రీవారి ఆలయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అపచారాలు అన్నీ ఇన్నీ కావన్నారు. అత్యంత పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వాడడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాటి సీఎం జగన్ పరోక్ష సహకారంతో టీటీడీలో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. ముఖ్యంగా స్వామివారి ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి విషయంలో అప్పటి పాలకమండలి నిబంధనలను ఇష్టారాజ్యంగా సడలించిందన్నారు. నాడు ప్రసాదాల తయారీకి వాడింది అసలు నెయ్యే కాదని, కేవలం కెమికల్స్‌తో తయారుచేసిన రసాయన నెయ్యి అని సిట్, దినేశ్‌కుమార్ కమిషన్ స్పష్టం చేశాయని చెప్పారు. పవిత్రమైన నైవేద్యాన్ని కల్తీ చేసి, దేవుడికి, భక్తులకు ద్రోహం చేసినవారు ముమ్మాటికీ పాపాత్ములేనన్నారు. స్వామి పట్ల అపచారం చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసిన వారికి చట్టపరంగా తగిన బుద్ధి చెప్పేవరకు పాలక మండలి విశ్రమించదన్నారు.