Share News

బెట్టింగ్‌ ముఠా గుట్టురట్టు

ABN , Publish Date - Feb 21 , 2026 | 05:10 AM

క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను నెల్లూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

బెట్టింగ్‌ ముఠా గుట్టురట్టు

  • నెల్లూరులో ఇద్దరు అరెస్టు.. మరో ఇద్దరు పరార్‌

  • రూ.34 లక్షలు, ల్యాప్‌టాప్‌, 13 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం

  • బ్యాంక్‌ ఖాతాలోని మరో రూ.1.64 కోట్లు సీజ్‌

నెల్లూరు(క్రైం), ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను నెల్లూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల శుక్రవారం ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. నెల్లూరులోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన ఓ వ్యాపారిని ఆన్‌లైన్‌ యాప్‌ల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ ఫోన్‌ నెంబరును బుచ్చిరెడ్డిపాలెం రామకృష్ణానగర్‌కు చెందిన కె.వేణుగోపాల్‌ ఇచ్చాడు. దీంతో వ్యాపారి పలు దఫాలుగా ఆ నెంబర్‌కు రూ.53 లక్షల నగదు డిపాజిట్‌ చేశారు. ఆదాయం రాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సాంబశివరావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందం గురువారం రాత్రి బుచ్చిరెడ్డిపాలెంలో వేణుగోపాల్‌కు చెందిన ఓ గదిలో తనిఖీ చేసింది. వేణుగోపాల్‌తోపాటు అక్కడే ఉన్న బి.వెంకటరమణను అదుపులోకి తీసుకుని విచారించగా క్రికెట్‌ బెట్టింగ్‌ విషయం వెలుగులోకి వచ్చిం ది. వేణుగోపాల్‌ అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరితో కలిసి ఆర్‌777 లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రాధే ఎక్స్చేంజ్‌ యాప్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వేణుగోపాల్‌, వెంకటరమణలను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.34,65,800 నగదు, ల్యాప్‌టాప్‌, టీవీ, 13 మొబైల్‌ ఫోన్లు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాలోని రూ.1,64,74,600ను సీజ్‌ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు.

Updated Date - Feb 21 , 2026 | 05:11 AM