‘సీడ్ యాక్సెస్’కు లైన్ క్లియర్!
ABN , Publish Date - Jul 12 , 2026 | 05:25 AM
రాజధాని పరిధిలోని ఉండవల్లి గ్రామంలో భూసమీకరణ కింద ఇవ్వని భూములను సీఆర్‌డీఏ అధికారులు భూసేకరణ కింద తీసుకున్నారు.
భూసేకరణలో 2.75 ఎకరాలు స్వాధీనం
అడ్డుకున్న రైతులు.. ఉండవల్లిలో ఉద్రిక్తత
తాడేపల్లి/గుంటూరు(రాజధాని), జూలై 11(ఆంధ్రజ్యోతి): రాజధాని పరిధిలోని ఉండవల్లి గ్రామంలో భూసమీకరణ కింద ఇవ్వని భూములను సీఆర్‌డీఏ అధికారులు భూసేకరణ కింద తీసుకున్నారు. 10 మంది రైతులకు చెందిన 2.75 ఎకరాలను శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత రైతులు అడ్డుపడడంతో కొద్దిపాటి ఉద్రిక్తత ఏర్పడగా, పోలీసులు వారిని నియంత్రించారు. సీఆర్‌డీఏ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏజీ చిన్నికృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నడుమ ఈ ప్రక్రియ జరిగింది. పొలాల్లోకి జేసీబీలతో ప్రవేశించిన సిబ్బంది వాటిల్లో ఉన్న మొక్కలను దున్నేశారు. భూ యజమానులు, సంబంధీకులు అడ్డుకున్నారు. తమకు మార్కెట్ ధర ప్రకారం అఽధిక పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. స్పెషల్ డిప్యూటి కలెక్టర్ ఏజీ చిన్నికృష్ణ మాట్లాడుతూ సీఆర్‌డీఏ వీరికి భూసేకరణ కోర్టులో రూ.7.14 కోట్ల పరిహారం జమచేసిందని పేర్కొన్నారు.