మావిగన్ అజెండా.. జగన్ అవివేకం: రామకృష్ణ
ABN , Publish Date - Jul 04 , 2026 | 04:48 AM
‘జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతిస్తున్నాం.. రాజధాని నిర్మాణానికి 30వేల ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా అన్నాడు.
కర్నూలు, జూలై 3(ఆంధ్రజ్యోతి): ‘జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతిస్తున్నాం.. రాజధాని నిర్మాణానికి 30వేల ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా అన్నాడు. అధికారం రాగానే మూడు రాజధానులని, ఒక్కటీ కట్టలేదు. ఇప్పుడేమో మావిగన్ అంటూ కొత్తపాట అందుకున్నాడు’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. కర్నూలు నగరం పందిపాడులోని నిర్వహిస్తున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘మావిగన్ అజెండాను తీసుకోవడం జగన్ అవివేకం. అమరావతి నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం రూ.49 వేల కోట్లు అప్పులు చేసింది. 30వేల మందికి పైగా కూలీలు, 18,500కి పైగా భారీ యంత్రాలతో పనులు జరుగుతున్నాయి. ఇదే వేగంతో జరిగితే రెండేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుంది. 2029 ఎన్నికల్లో మావిగన్ అజెండానే ఉండదు. విద్యార్థులు, యువత రాజకీయాల్లోకి రావాలని మంత్రి లోకేశ్ పిలుపునివ్వడాన్ని అభినందిస్తున్నాం. కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు ఇప్పటికే సీఎం చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్... నాలుగుసార్లు శంకుస్థాపనలు చేశారు. మళ్లీ చంద్రబాబు శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉంది’ అని రామకృష్ణ డిమాండ్ చేశారు.