Share News

మరో పోరాటానికి కార్మికవర్గం సమాయత్తం కావాలి

ABN , Publish Date - May 02 , 2026 | 03:46 AM

స్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ కార్మికులారా ఏకంకండి అనే నినాదాన్ని మరింత ముందుకు తేవాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉందని...

మరో పోరాటానికి కార్మికవర్గం సమాయత్తం కావాలి

  • మేడే వేడుకల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ

గుంటూరు(తూర్పు), మే 1(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ కార్మికులారా ఏకంకండి అనే నినాదాన్ని మరింత ముందుకు తేవాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. గుంటూరు సంగడిగుంటలోని రేగుల రాఘవయ్య భవన్‌ వద్ద 140వ మేడే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఏఐటీయూసీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు రావుల అంజిబాబు అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ... ‘ఏ పోరాటం ద్వారా హక్కులు సాధించారో ఆ హక్కులను నిలబెట్టుకోవడానికి మరో పోరాటానికి కార్మికవర్గం సమాయత్తం కావాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసేలా నాలుగు లేబర్‌ కోడ్లు తెచ్చి వారి పొట్టకొడుతుంది. కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వారి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నం చేస్తోంది. దేశ సంపదను కార్పొరేట్‌లకు దోచి పెడుతుంది. ప్రజలను మత ప్రాతిపదికపై చీల్చి తద్వారా తమ రాజకీయ అధికారాన్ని సురక్షితం చేసుకోవాలని చూస్తుంది’ అని రామకృష్ణ మండిపడ్డారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ... ‘కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికవర్గాన్ని యజమానులకు, కార్పొరేట్‌ సంస్థలకు ఆధునిక కట్టుబానిసలుగా తయారు చేస్తున్నాయి. దీనిని ప్రతిఘటించడం కోసం రానున్న రోజుల్లో మరింత పోరాడాల్సిన అవసరముంది’ అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, వెలుగూరి రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 03:46 AM