మోదీపై ఒత్తిడి తేగల నాయకుడు బాబే!
ABN , Publish Date - Mar 23 , 2026 | 04:29 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధోన్మాద విధానాలను అవలంభిస్తున్నారని, ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం పాటించడం సరైంది కాదని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ ఆరోపించారు.
దేశ రాజకీయాల్లో చంద్రబాబుది కీలకపాత్ర
ట్రంప్ యుద్ధోన్మాదంపై మోదీ మౌనం సరికాదు
తిరుమల ప్రతిష్ఠను కాపాడాలి: సీపీఐ
మధ్యాహ్న భోజనంపై గరికపాటి వ్యాఖ్యలకు ఖండన
విజయవాడ, మార్చి 22(ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధోన్మాద విధానాలను అవలంభిస్తున్నారని, ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం పాటించడం సరైంది కాదని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ ఆరోపించారు. యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్‌పై మోదీ ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. మోదీపై ఒత్తిడి తీసుకురాగల నాయకుడు సీఎం చంద్రబాబు మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన నాయకుడిగా చంద్రబాబు ముందుకు రావాలన్నారు. యుద్ధం ఆపే దిశగా అమెరికాపై ఒత్తిడి తేవాలంటూ మోదీపై చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ప్రపంచవ్యాప్తంగా సంక్షోభానికి దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ యుద్ధం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం సాగుతోందని ఆరోపించారు. గ్యాస్, ఆయిల్ ధరలు పెరిగి రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. గ్యాస్ కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు మూతపడ్డాయని, కార్మికవర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు. ఈనెల 29న హైదరాబాద్‌లో ‘నో వార్’ పేరుతో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే, తిరుమలకు అపకీర్తి తెచ్చేలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను పదవుల్లో కొనసాగించడం తగదని నారాయణ వ్యాఖ్యానించారు.
భక్తుల విశ్వాసాన్ని కాపాడేలా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తిరుమల ప్రతిష్ఠకు భంగం కలగకుండా ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. అమరావతిలో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నిర్మాణాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చేపట్టాలని సూచించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను నారాయణ ఖండించారు. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ కుటుంబంలో ఆస్తి వివాదాలపైనా నారాయణ స్పందించారు. వ్యక్తిగత సమస్యలను బహిరంగంగా తీసుకురావడం తగదన్నారు. ఇలాంటి అంశాలను న్యాయపరంగా లేదా పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.