సీపీఐ బలోపేతానికి ‘ఐప్యాక్’
ABN , Publish Date - Mar 27 , 2026 | 05:31 AM
రాజకీయంగా ఉనికిని చాటుకోవడంతోపాటు చట్టసభల్లో ప్రాతినిథ్యం కోసం సీపీఐ రాష్ట్ర శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. భారత కమ్యూనిస్టు పార్టీ...
ఈశ్వరయ్యతో ఆ సంస్థ ప్రతినిధుల భేటీ
నూతన జెండా రూపకల్పనకు చాన్సే లేదు
‘ఆంధ్రజ్యోతి’కి తెలిపిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి
అమరావతి, విజయవాడ, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రాజకీయంగా ఉనికిని చాటుకోవడంతోపాటు చట్టసభల్లో ప్రాతినిథ్యం కోసం సీపీఐ రాష్ట్ర శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. భారత కమ్యూనిస్టు పార్టీ... ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా పోరాటాలతో తమ బలాన్ని, బలగాన్ని ప్రదర్శించి, చట్టసభల్లోనూ అంతో ఇంతో తమ వాణిని వినిపించింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రజా సమస్యలపైన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు కొనసాగిస్తోంది. అయితే రాజకీయంగా అంత ప్రభావం చూపలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని పలు రాజకీయ పార్టీలకు సలహాదారుగా వ్యవహరించిన ‘ఐప్యాక్’ సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన గుజ్జుల ఈశ్వరయ్య... రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించారు. పార్టీకి నూతన జవసత్వాలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఐప్యాక్ ప్రతినిథులతోనూ చర్చలు జరిపారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలు, ప్రజలకు దగ్గరయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపినట్లు తెలిసింది. అభ్యుదయ భావాలతో, సమాజం మేలు కోరుకునే యువతను తమ పార్టీ వైపు ఆకర్షించడానికి ఏం చేయాలన్న దిశగా ఐప్యాక్ సూచనలు, సలహాలు తీసుకున్నారు. పార్టీ గురించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఐప్యాక్ బృందాలతో సర్వే చేయించే ప్రతిపాదన కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ జెండాను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దితే బాగుంటుందన్న ఐప్యాక్ ప్రతినిధి... తాము రూపొందించిన జెండా నమూనాను ఈశ్వరయ్యకు చూపించారు. పార్టీ జెండా జాతీయ స్థాయిలో ఏకరూపంతో ఉంటుందని, రాష్ర్టానికో విధంగా మారదంటూ ఆయన తిరస్కరించారని తెలిసింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ఈశ్వరయ్యను సంప్రదించగా... ‘మా పార్టీని బలోపేతం చేసే దిశగా అందరి సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. మాతో కలసి వచ్చే శక్తులతో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మా ఆలోచనలను వారితో పంచుకుంటూ అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తున్నాం. ఈ క్రమంలోనే గతంలో ఐ ప్యాక్‌లో పనిచేసిన ఆప్తులు కొందరు నన్ను కలిశారు. తమ సూచనలు, సలహాలు ఇచ్చారు. ఐప్యాక్ టీమ్‌ను మేం సంప్రదించామనడంలో వాస్తవం లేదు. మాది ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన పార్టీ. సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగిన పార్టీ జెండా రూపురేఖలను మార్చడమనేది హాస్యాస్పదం’ అని కొట్టి పారేశారు.