Share News

వీడబ్ల్యూడీసీ సెంటర్లతో కోర్టుల్లో స్నేహపూర్వక వాతావరణం

ABN , Publish Date - Feb 02 , 2026 | 05:32 AM

మహిళలు, చిన్నారులు, వృద్ధులు, లైంగిక దాడి బాధితులు మానసిక వేదనకు గురికాకుండా వారి వాంగ్మూలాల నమోదుకు సురక్షిత, స్నేహపూర్వక వాతావరణం ఉండేలా కోర్టులో...

వీడబ్ల్యూడీసీ సెంటర్లతో కోర్టుల్లో స్నేహపూర్వక వాతావరణం

  • చైర్‌పర్సన్‌ జస్టిస్‌ గీతా మిట్టల్‌

అమరావతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): మహిళలు, చిన్నారులు, వృద్ధులు, లైంగిక దాడి బాధితులు మానసిక వేదనకు గురికాకుండా వారి వాంగ్మూలాల నమోదుకు సురక్షిత, స్నేహపూర్వక వాతావరణం ఉండేలా కోర్టులో వల్నరబుల్‌ విట్నెస్‌ డిపొజిషన్‌ సెంటర్‌(వీడబ్ల్యుడీసీ)లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు నియమించిన వీడబ్ల్యూడీసీ చైర్‌పర్సన్‌, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిట్టల్‌ అన్నారు. ఏపీ హైకోర్టు వల్నరబుల్‌ విట్నెస్‌ సెంటర్ల కమిటీ సహకారంతో ఆదివారం గుంటూరు కలెక్టరేట్‌లో వీడబ్ల్యూడీసీలపై న్యాయాధికారులకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటుచేశారు. ముఖ్య అతిథి గీతామిట్టల్‌ మాట్లాడుతూ.. ‘కోర్టులో వాంగ్మూలమిచ్చే సమయంలో సాక్షులు నిందితులను నేరుగా ఎదుర్కోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. సాక్షులు వేచి ఉండేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయడంతోపాటు వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం కల్పించాలి. ప్రధాన కోర్టుకు దూరంగా.. పిల్లలకు అనుకూలంగా ఉండేలా ఆట వస్తువులు, పుస్తకాలతో పాటు అన్ని వయస్సులవారికీ అనుకూలంగా ఉండేలా ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలి. సాక్షుల పాఠశాల, పేరు, చిరునామా వంటి వివరాలు బయట పెట్టకుండా నిషేధించాలి’ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీ హైకోర్టు వీడబ్ల్యూడీసీ కమిటీ చైర్మన్‌, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు, జస్టిస్‌ వి.సుజాత, జస్టిస్‌ వి.గోపాలకృష్ణ, జస్టిస్‌ సుభేందు శమంత, జస్టిస్‌ జగడం సుమతి, జస్టిస్‌ కిరణ్మయి, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.కల్యాణచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 05:32 AM