‘సిట్’ విచారణను మేమే పర్యవేక్షిస్తాం
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:30 AM
గ్రూప్-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించి వాస్తవాలను తేల్చేందుకు తమ ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం...
చిత్తశుద్ధితో విచారిస్తుందని ఆశిస్తున్నాం
గ్రూప్-1 మూల్యాంకనం కేసుపై హైకోర్టు
అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించి వాస్తవాలను తేల్చేందుకు తమ ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పారదర్శకత, చిత్తశుద్ధితో విచారిస్తుందని ఆశిస్తున్నట్టు హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారం కొలిక్కి వచ్చే వరకు సిట్ విచారణను తామే పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలను నిర్ధారిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్ల విచారణకు ఇప్పటికే ఎక్కువ సమయం కేటాయించామని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్లకు తార్కిక ముగింపు ఇచ్చేవరకు వాటిని తమవద్దే ఉంచుకొని విచారణ జరుపుతామని పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్-1 ప్రధాన పరీక్షలో అక్రమాలను నిర్ధారిస్తూ సింగిల్ జడ్జి గతంలో తీర్పు ఇచ్చారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో పాటు ఎంపికకాని మరికొందరు అప్పీల్ చేశారు. వీటిపై తుది విచారణ జరుపుతున్న ధర్మాసనం జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాల ఆరోపణలు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేసింది. అలాగే, అప్పట్లో ఉద్యోగాలకు ఎంపికై ప్రస్తుతం సర్వీసులో ఉన్న వారిని అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని ఆదేశించింది. దీనికిగాను ఈ నెల 25న జరిగిన విచారణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ హైకోర్టును సమయం కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి పిటిషన్లపై విచారణ జరిగింది. సీఎస్ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) ఎస్.ప్రణతి వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఉత్తర్వులను అమలు చేశామని తెలిపారు. వివరాలతో మెమో దాఖలు చేశామని పేర్కొన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. తమ ఆదేశాలకు అనుగుణంగా సిట్ ఏర్పాటు అయ్యిందా? విచారణ జరుగుతోందా? అని ప్రశ్నించింది. ఎస్‌జీపీ బదులిస్తూ.. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు అయిందని బదులిచ్చారు.
కోర్టుధిక్కరణ కేసులో నోటీసులు
గ్రూప్-1లో ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులను తక్షణం అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలంటూ 11న హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సీఎస్ విజయానంద్, సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు అమలు చేయలేదని పేర్కొంటూ గొర్ల సుజాత అనే అభ్యర్థి కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం.. విజయానంద్, శ్యామలరావుకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ విచారణను 16కు వాయిదా వేసింది.