Share News

Minister Nara Lokesh: జగన్‌ హయాంలోనే సీమ ఎత్తిపోతలపై స్టే

ABN , Publish Date - Jan 08 , 2026 | 04:10 AM

విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల బాటలో నడవాలని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. కర్మాగారం రక్షణకు పదేపదే బెయిల్‌ అవుట్‌లు ఇవ్వడం సమంజసం కాదని...

Minister Nara Lokesh: జగన్‌ హయాంలోనే సీమ ఎత్తిపోతలపై స్టే

  • భోగాపురం విమానాశ్రయం గురించి జగన్‌ ఏమన్నారో ప్రజలందరికీ తెలుసు

  • విశాఖ ఉక్కు లాభాల బాట పట్టాలి

  • స్టీల్‌ ప్లాంటు భూములను ఇతర అవసరాలకు కేటాయించేది లేదు

  • 2 నెలల్లో గూగుల్‌ డేటా సెంటర్‌ పనులు

  • రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళనొద్దు: లోకేశ్‌

విశాఖపట్నం, జనవరి 7(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల బాటలో నడవాలని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. కర్మాగారం రక్షణకు పదేపదే బెయిల్‌ అవుట్‌లు ఇవ్వడం సమంజసం కాదని, లాభాలు సాధించాలని తామంతా ఆకాంక్షిస్తున్నామని అన్నారు. జగన్‌ పత్రికపై వేసిన పరువునష్టం కేసులో విచారణ నిమిత్తం బుధవారం ఆయన విశాఖ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం కోర్టు బయట మీడియాతో లోకేశ్‌ మాట్లాడారు. విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌కు ఉక్కు పరిశ్రమ భూములు తీసుకుంటున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదన్నారు. ఉక్కు కర్మాగారం రక్షణకు ఎన్డీయే ప్రభుత్వం రూ.14 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. విశాఖ ఉక్కుకు చెందిన భూములను ఇతర అవసరాలకు మళ్లించే యోచన ఎన్డీయే ప్రభుత్వానికి లేదని లోకేశ్‌ స్పష్టం చేశారు. భూములు మళ్లిస్తున్నారనే స్ర్కిప్ట్‌ ఎక్కడ నుంచి వచ్చిందో సీపీఎం నేతలే చెబితే బాగుంటుందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో క్రెడిట్‌ కోసం తాము ఎలాంటి పోరాటం చేయలేదన్నారు. ఎయిర్‌పోర్టు వల్ల ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరుగుతుందని భావించి శరవేగంగా పూర్తిచేశామని చెప్పారు. ‘‘ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్‌పోర్టు అవసరమా..’’ అని అప్పట్లో జగన్‌ అన్నారా?.. లేదా?..అనేది అందరికీ తెలుసునన్నారు. ఆ వీడియోను అందరూ చూశారని తెలిపారు. భోగాపురం క్రెడిట్‌ కావాలంటే వైసీపీ తీసుకోవచ్చునని, దాంతోపాటు అమర్‌రాజా బ్యాటరీస్‌ సహా పలు కంపెనీలను రాష్ట్రంనుంచి తరిమేసిన క్రెడిట్‌కూడా ఆ పార్టీ తీసుకోవాలని లోకేశ్‌ ఎద్దేవా చేశారు.


రాజధాని రైతుల పక్షాన

విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ను ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి లోకేశ్‌ తెలిపారు. వైసీపీ హయాంలో 108 వాహనాలు ఆగిపోయాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటి కూడా ఆగలేదని గుర్తుచేశారు. అమరావతి రాజధానిని ఎవరూ తరలించలేరని వ్యాఖ్యానించారు. అప్పట్లో సీఎం చంద్రబాబు ముందుచూపుతో భూముల విషయంలో రైతుల పక్షాన అగ్రిమెంట్లు చేశారని, అందుకే రాజధానికి వైసీపీ నేతలు తరలించలేకపోయారని వివరించారు.

ఏపీ నెంబర్‌ 1

ఫార్చ్యూన్‌ 500 వంటి పెద్ద కంపెనీలకు ఎకరా భూమి 99 పైసలకు ఇస్తే తప్పేమిటని మంత్రి లోకేశ్‌ ప్రశ్నించారు. వైసీపీ ఐదేళ్లలో చేయలేనిది తమ ప్రభుత్వం 18 నెలల్లో చేసి చూపించిందన్నారు. ప్రోత్సాహకాలతోపాటు తక్కువ ధరకు భూములు ఇచ్చినందునే కాగ్నిజంట్‌, టీసీఎస్‌, గూగుల్‌ వంటి సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. విశాఖ జిల్లాలోని తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌ పనులు రెండు నెలల్లో ప్రారంభమవుతాయని తెలిపారు. దీనికి సంబంధించి భూముల అప్పగింత, ఇతర కార్యక్రమాలు త్వరలో పూర్తవుతాయని తెలిపారు. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్‌వన్‌ స్థానంలో ఉందన్నారు. మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు.

జల వివాదం సరికాదు

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే 2020లో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్టే వచ్చిందని మంత్రి లోకేశ్‌ తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం దీనిపై కొందరు వివాదం చేస్తున్నారని, ఇది సరికాదని వ్యాఖ్యానించారు. గోదావరి జలాలు తెలంగాణ దాటి ఏపీలోకి ప్రవేశించినతర్వాతే ఆ నీటిని లిఫ్ట్‌ ద్వారా రాయలసీమకు తరలించాలనేది ప్రభుత్వ ఆలోచన అని వివరించారు. నిడమర్రు పాఠశాలను సొంత నిధులతో అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.


ఆస్ర్ట్రేలియాతో ఒప్పందం

రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని లోకేశ్‌ అభిప్రాయపడ్డారు. మహిళా క్రికెట్‌ టీమ్‌ను ముందుగా తానే కలిశానని, మిథాలీరాజ్‌ను ఏసీఏ సలహాదారుగా నియమించామని తెలిపారు. క్రీడల కోసం ఆస్ట్రేలియాలోని గ్రిఫిట్‌ వర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు.

విశాఖ కోర్టుకు లోకేశ్‌

క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసిన ‘జగన్‌ పత్రిక’ లాయర్లు

విశాఖపట్నం లీగల్‌, జనవరి 7(ఆంధ్రజ్యోతి): మంత్రి నారా లోకేశ్‌ బుధవారం విశాఖ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. జగన్‌ పత్రిక ప్రచురించిన కథనంపై లోకేశ్‌ గతంలో పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో లోకేశ్‌ హాజరయ్యారు. ఆయనను జగ న్‌ పత్రిక తరఫు న్యాయవాదులు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశారు. లోకేశ్‌ తరఫున న్యాయవాదులు కోటేశ్వరరావు, ఎస్వీ రమణ, వెన్నెల ఈశ్వరరావు హాజరయ్యారు. అనంతరం కేసు విచారణను జడ్జి రతన్‌కుమార్‌ ఈ నెల 21కి వాయిదా వేశారు.

Updated Date - Jan 08 , 2026 | 04:12 AM