సీదిరి కొడుక్కి వీఐపీ ‘ట్రీట్‌మెంట్’
ABN , Publish Date - Jul 15 , 2026 | 03:56 AM
వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బెయిల్ పిటిషన్‌ను పలాస కోర్టు తిరస్కరించింది. నిర్లక్ష్యంగా బైక్ నడిపి ఒకరి మరణానికి కారణమైన కేసులో..
యాక్సిడెంట్ గాయాల చికిత్స కోసం రిమ్స్‌కు
‘రాజు’ భక్తి చూపిన కొందరు వైద్యులు
ఫోన్ చాంబరులో వదిలి వెళ్లిన సూపరింటెండెంట్
తొలుత వీఐపీ గదికి.. అక్కడి నుంచి ఐసీయూకు
ఆరవ్ బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు
అవేం వ్యాఖ్యలు జగన్.. యాదవ సంఘాల ఫైర్
శ్రీకాకుళం, జూలై 14(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బెయిల్ పిటిషన్‌ను పలాస కోర్టు తిరస్కరించింది. నిర్లక్ష్యంగా బైక్ నడిపి ఒకరి మరణానికి కారణమైన కేసులో సోమవారం ఆరవ్ వర్మను అరెస్టుచేసి అంపోలు జిల్లా జైలుకు పోలీసులు తరలించిన విషయం తెలిసిందే. బైక్ ప్రమాదంలో చేతులకు, ముఖానికి గాయాలు అయిన ఆరవ్ వర్మను వైద్య చికిత్స కోసం మంగళవారం ఉదయం జైలునుంచి శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి (రిమ్స్) తరలించారు. పరీక్షల కోసం ముందుగా రిమ్స్ క్యాజువాలిటీకి తీసుకువచ్చారు. వాస్తవానికి పలాసలో ప్రభుత్వాసుపత్రి వైద్యులు ‘ఫిట్ ఫర్ రిమాండ్’ అని నిర్ధారించాకనే ఆరవ్ వర్మను జైలుకు తరలించారు. అయితే, మంగళవారం ఉదయం మాత్రం ఆస్పత్రిలో భిన్నమైన వాతావరణం కనిపించింది. సీదిరి అప్పలరాజుకు మాజీ మంత్రిగా ఆ జిల్లాలోని వైద్యులతో ఉన్న పరిచయాల ప్రభావం ఆరవ్ వర్మకు ఇచ్చిన ‘ట్రీట్‌మెంట్’లో కనిపించిందని చెబుతున్నారు. ఆరవ్ వర్మను ఆస్పత్రిలోని రెండో అంతస్తులోని వీఐపీ గదికి తీసుకు వెళ్లారు. అక్కడే కొన్ని గంటల పాటు ఉంచారు. బయట నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆరవ్ వర్మకు శీతల పానీయాలు తదితరాలు అందించడం కనిపించింది. పోలీసులు వారించినా.. ఆ చుట్టుపక్కలే అతడు తిరుగుతూ గడిపాడు.
వీఐపీ గదిలోకి ఆరవ్ వర్మను తెచ్చిన కొద్దిసేపటికే ఆస్పత్రి సూపరింటెండెంట్ తన అధికారిక ఫోన్‌ను చాంబర్‌లోనే విడిచిపెట్టి బయటకువెళ్లిపోయారు. అలాగే వైద్యులు తరచూ వీఐపీ గదికి వచ్చి వెళ్లడం కనిపించింది. సాధారణ వ్యక్తికైతే ఇంతటి మర్యాద చేస్తారా... అంటూ అక్కడ ఉన్న రోగులు చర్చించుకోవడం కనిపించింది. సాయంత్రం ఆరవ్ వర్మను ఐసీయూకు తరలించారు. ఆరవ్ వర్మ తనకు తలనొప్పి, కడుపులో నొప్పి వంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పడంతో వైద్యులు... అబ్డామన్ స్కాన్, హెచ్‌ఆర్‌సీటీ స్కాన్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. మంగళవారం రాత్రి ఐసీయూలోనే ఉంచుతామని వైద్యులు వెల్లడించారు. కాగా, తామేమీ వీఐపీ గదికి ఆరవ్ వర్మను తరలించలేదని రిమ్స్ సూపరింటెండెంట్ సాయంత్రం ప్రకటించడం కొసమెరుపు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటే బుధవారం డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.
ఆస్పత్రి వద్దనే సీదిరి...
ఆస్పత్రిలో ఈ తంతు నడిచినంత సేపూ వెలుపల తన వాహనంలో మాజీమంత్రి సీదిరి అప్పలరాజు, తన అనుచరులతో మకాం వేశారు. తన కుమారుడితో టీడీపీ రాజకీయం చేస్తోందంటూ కొంతమంది వద్ద ఆయన వాపోయినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, బుధవారం జిల్లా కోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం.