మా ఉత్తర్వులు సరైన స్ఫూర్తితో అమలు చేశారా?
ABN , Publish Date - Mar 17 , 2026 | 06:12 AM
గ్రూప్-1 ప్రధాన పరీక్ష ద్వారా ఉద్యోగాలు పొందిన వారిని అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని తామిచ్చిన ఆదేశాలను సరైన స్ఫూర్తితో అమలు చేశారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
డీఎస్పీలు పాత పోస్టుల్లోనే ఉన్నారన్న పత్రిక కథనం గురించి ఏం చెబుతారు?
రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మాసనం
‘గ్రూప్-1’పై విచారణ నేటికి వాయిదా
అమరావతి, మార్చి 16(ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 ప్రధాన పరీక్ష ద్వారా ఉద్యోగాలు పొందిన వారిని అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని తామిచ్చిన ఆదేశాలను సరైన స్ఫూర్తితో అమలు చేశారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఉద్యోగాలు పొంది వివిధ జిల్లాలో ఆర్‌డీవోలు, డీఎస్పీలుగా చేస్తున్నవారిని అక్కడ నుంచి బదిలీ చేసి డీజీపీ, సీసీఎల్‌ఏకు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. అయితే, డీజీపీ మౌఖిక ఆదేశాలకు అనుగుణంగా సంబంధిత డీఎస్పీలు అక్కడే కొనసాగుతున్నట్టు పత్రికలో కథనం వచ్చిందని ధర్మాసనం తెలిపింది. ‘‘పత్రిక కథనంలో ఉన్న వివరాలు నిజమేనా?’’ అని అడ్వొకేట్ జనరల్(ఏజీ)ని ప్రశ్నించింది. ఉద్యోగులను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలంటూ తామిచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తు చేసింది. పత్రికా కథనం నిజమే అయితే తమ ఆదేశాలు, సుప్రీంకోర్టు ఉత్తర్వులను అధికారులు అగౌరవ పరిచినట్లేనని వ్యాఖ్యానించింది. మరోవైపు, ఈ అప్పీళ్లు విచారణకు వచ్చే రోజు ఉదయం.. నివేదిక దాఖలు చేసేందుకు మరింత సమయం కోరుతూ సిట్ అనుబంధ పిటిషన్ వేయడంపై ధర్మాసనం మండిపడింది. నివేదిక దాఖలు చేయలేమని తెలిసినప్పుడు మరింత సమయం కోరుతూ ముందు రోజు అఫిడవిట్ వేయాలని తెలియదా?.. అని నిలదీసింది. సిట్ పూర్తి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని, ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.
కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్), సిట్ వ్యవహరించడం లేదని, ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తు సక్రమంగా సాగుతుందని ఎలా విశ్వసించగలమని తెలిపింది. రాష్ట్ర పోలీసు వ్యవస్థ సమర్థతపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, దానివల్లే సిట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించామని పేర్కొంది. ఉత్తర్వులు సరైన స్ఫూర్తితో అమలు చేయకుంటే దర్యాప్తును సీబీఐకి అప్పగించే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.
వాస్తవం కాదనిపిస్తోంది: ఏజీ
డీఎస్పీలు గత స్థానాల్లోనే కొనసాగుతున్నారని వ చ్చిన పత్రిక కథనంలో వాస్తవం ఉందని తాను భావించడం లేదని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ ధర్మాసనానికి వివరించారు. మరోవైపు కోర్టు ఉత్తర్వులను అమలుచేయని సీఎస్, సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శిని కోర్టుధిక్కరణ కింద శిక్షించాలంటూ గొర్ల సుజాత వేసిన ధిక్కరణ పిటిషన్‌పై విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.