Share News

మూల్యాంకనం అక్రమాలపై చర్యలేంటి?

ABN , Publish Date - Mar 18 , 2026 | 06:53 AM

‘గ్రూప్‌-1’ జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాల ఆరోపణలు తేల్చేందుకు ‘సిట్‌’ ఏర్పాటు చేసి నెల రోజులు గడుస్తున్నా దర్యాప్తులో ఎలాంటి పురోగతీ లేదని హైకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

మూల్యాంకనం అక్రమాలపై చర్యలేంటి?

  • నెల రోజుల్లో ఏం చేశారో చెప్పండి

  • వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయండి

  • ‘సిట్‌’కు హైకోర్టు ధర్మాసనం ఆదేశం

  • ఆన్‌లైన్‌లో విచారణకు డీజీ రవిశంకర్‌

  • ఆయన వివరణపై ధర్మాసనం అసంతృప్తి

  • అప్రాధాన్య పోస్టులంటే ఉద్యోగులను కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడం కాదని వ్యాఖ్య

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ‘గ్రూప్‌-1’ జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాల ఆరోపణలు తేల్చేందుకు ‘సిట్‌’ ఏర్పాటు చేసి నెల రోజులు గడుస్తున్నా దర్యాప్తులో ఎలాంటి పురోగతీ లేదని హైకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘సిట్‌’కు నేతృత్వం వహిస్తున్న డైరెక్టర్‌ జనరల్‌(డీజీ) రవిశంకర్‌ అయ్యన్నార్‌ను ఆన్‌లైన్‌లో హాజరుకు ఆదేశించి, దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకుంది. డీజీ వివరణతో సంతృప్తి చెందని ధర్మాసనం సిట్‌ ఏర్పాటైన తర్వాత గత నెలరోజుల్లో తీసుకున్న చర్యలను అఫిడవిట్‌ రూపంలో ఇవ్వాలని ఆదేశించింది. దర్యాప్తు పూర్తి చేసి నివేదిక దాఖలు చేసేందుకు ఎంత సమయం పడుతుందో స్పష్టత ఇవ్వాలని కోరింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. ‘గ్రూప్‌-1’ ప్రధాన పరీక్షలో అక్రమాలను నిర్ధారిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులతో పాటు ఎంపికకాని అభ్యర్థులు మరికొందరు ధర్మాసనం ముందు అప్పీల్‌ చేశారు. వీటిపై తుది విచారణ జరుపుతున్న ధర్మాసనం.. జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాల ఆరోపణలు తేల్చేందుకు డీజీస్థాయి అధికారితో సిట్‌ ఏర్పాటు చేసింది.


అలాగే ఉద్యోగాలకు ఎంపికైనవారిని అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ అప్పీళ్లు సోమవారం విచారణకురాగా డీఎస్పీలు గత స్థానాల్లోనే కొనసాగుతున్నారని వచ్చిన పత్రిక కథనంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అప్పీళ్లు మంగళవారం మరోసారి విచారణకురాగా.. నివేదిక దాఖలుకు సమయం కోరుతూ సిట్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌ను ధర్మాసనం పరిశీలించింది. నివేదిక దాఖలుకు ఎంత సమయం కావాలని సిట్‌ తరఫు అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పాణిని సోమయాజిని ప్రశ్నించింది. కనీసం 5 నెలల సమయం కావాలని ఆయన బదులిచ్చారు. లక్షల పేపర్లను పరిశీలించి నివేదిక తయారు చేయాల్సి ఉందన్నారు. ప్రతి రోజు 300 పేపర్లను పరిశీలించేందుకు అవకాశం ఉందన్నారు. ఈ వాదనపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గతంలో ఏపీపీఎస్సీ కేసు విచారణకు సహకరించలేదని, ప్రస్తుతం ‘సిట్‌’ సైతం అదే పంథాను అనుసరిస్తోందని పేర్కొంది. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు ‘సిట్‌’కు నేతృత్వం వహిస్తున్న అధికారిని ఆన్‌లైన్‌ ద్వారా తమ ముందు హాజరయ్యేలా చూడాలని అదనపు పీపీని ఆదేశించింది. కొద్దిసేపటి తరువాత తిరిగి విచారణ ప్రారంభమైన వెంటనే డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ ఆన్‌లైన్‌లో ధర్మాసనం ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ(సీఎ్‌ఫఎ్‌సఎల్‌) డిప్యూటీ డైరెక్టర్‌ను సంప్రదించామన్నారు. అక్రమాలు తేల్చాలంటే డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేసిన జవాబుపత్రాలు, మాన్యువల్‌ విధానంలో మూల్యాంకనం చేసిన జవాబుపత్రాలను ఒకదానితో ఒకటి పోల్చి ప్రతి పేజీ పరిశీలించాల్సి ఉంటుందన్నారు. రిపోర్ట్‌ ఇచ్చేందుకు నెలల సమయం పడుతుందని డిప్యూటీ డైరెక్టర్‌ చెప్పారని వివరించారు. ఈ వివరణతో ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఉత్తర్వుల మేరకు ఎఫ్‌ఎ్‌సఎల్‌కు 300 మంది అభ్యర్థుల పేపర్లు పంపిస్తే సరిపోతుందని వ్యాఖ్యానించింది. ఇప్పటివరకు ఏం చేశారని డీజీ అయ్యన్నార్‌ను ప్రశ్నించింది.


వారికి పోస్టింగ్‌ ఇవ్వలేదు: ఏజీ

అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. డీఎస్పీలు గత పోస్టుల్లోనే ఉన్నారన్న పత్రిక కథనంలో వాస్తవం లేదన్నారు. ప్రాధాన్య స్థానాల్లో ఉన్న అభ్యర్థులందరినీ బదిలీ చేశారని, డీఎస్పీలు రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో, ఆర్‌డీవోలు సీసీఎల్‌ఏ వద్ద రిపోర్ట్‌ చేశారని వివరించారు. వారికి ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదన్నారు. డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేయడం అంటే అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేయడమేనని తెలిపారు. ఆయా కార్యాలయాల్లో వారికి వేర్వేరు పనులు అప్పగిస్తున్నారని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఉద్యోగులను కార్యాలయాల్లో కూర్చోపెట్టి జీతాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించింది. బదిలీ చేయడానికి అప్రాధాన్య పోస్టులు లేవా? అని నిలదీసింది. సీఎస్‌, డీజీపీని కోర్టుకు పిలిపిస్తే తప్ప తమ ఉత్తర్వులు అమలయ్యేలా లేవని వ్యాఖ్యానించింది. మరోవైపు.. కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని పేర్కొంటూ గొర్ల సుజాత అనే అభ్యర్థి దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌పై విచారణను కూడా ధర్మాసనం ఈ నెల 30కి వాయిదా వేసింది.

Updated Date - Mar 18 , 2026 | 06:54 AM