క్రమబద్ధీకరణ దరఖాస్తులు ప్రాసెస్ చేయొద్దు
ABN , Publish Date - Feb 26 , 2026 | 04:15 AM
రాష్ట్రంలోని అనధికార, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు పురపాలకశాఖ జారీచేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.
పురపాలకశాఖ అధికారులకు హైకోర్టు స్పష్టీకరణ
అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అనధికార, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు పురపాలకశాఖ జారీచేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను తాము తదుపరి ఉత్తర్వులిచ్చేవరకూ ప్రాసెస్ చేయవద్దని అధికారులకు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పురపాలక, పంచాయితీరాజ్, సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శులు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్, పురపాలకశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరించేందుకు వీలుగా ప్రభుత్వం పురపాలక చట్టానికి చేసిన సవరణ, తదనంతరం గతేడాది నవంబరు 12న పురపాలకశాఖ జారీచేసిన జీవో 225ను రద్దు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన చిన్నబోయిన హరికృష్ణ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫు న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపిస్తూ క్రమబద్ధీకరణపై పురపాలకశాఖ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించవద్దని ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.