Natu Kodi Prices: నాటు కోడి 2వేలు!
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:41 AM
గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి కోడి పందేలతో పాటు నాటు కోడి వంటకాలకు ప్రాధాన్యం ఎక్కువ. పండుగకు వచ్చే అల్లుళ్లు, బంధువులకు నాటు కోడి..
సంక్రాంతి మొక్కుల ఎఫెక్ట్
గ్రామాల్లో పెరిగిన డిమాండ్
నరసాపురం, జనవరి 7(ఆంధ్రజ్యోతి): గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి కోడి పందేలతో పాటు నాటు కోడి వంటకాలకు ప్రాధాన్యం ఎక్కువ. పండుగకు వచ్చే అల్లుళ్లు, బంధువులకు నాటు కోడి, గారెలతో భోజనం పెట్టడం సంప్రదాయం. దీంతోపాటు ముక్కనుమ రోజున గ్రామ దేవతలకు నాటు కోడిని కోసి నైవేద్యం పెడుతుంటారు. ఈ నేపథ్యంలో నాటు కోళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కాగా, ఈసారి గ్రామాల్లో ఎక్కడా కోడి దొరకని పరిస్థితి. కేజీ కోడి ఉందంటే కొనేందుకు పది మంది పోటీపడుతున్నారు. వంటకాలకు పుంజు కంటె పెట్టలకే మంచి డిమాండ్ ఉంది. కేజీ రూ.2వేల నుంచి రూ.2,500 ధర పలుకుతోంది. మామూలు రోజుల్లో వెయ్యి నుంచి రూ.1200 కే లభించేది. దూర ప్రాంతాల నుంచి పండక్కి వచ్చే బంధువులు తమ మొక్కుల్ని ముందుగానే కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారు. కనీసం కేజీ కోడి అయినా కొనుగోలు చేయాలని చెబుతున్నారు. ఇటీవల వైరస్ సోకి చాలా కోళ్లు చనిపోయాయి. పల్లెల్లో కోళ్లు పెంచే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నాటు కోళ్లకు డిమాండ్ వచ్చి పడింది.