టీబీ ఆస్పత్రికి అవినీతి జబ్బు!
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:54 AM
జిల్లా క్షయ నివారణ ఆస్పత్రికి అవినీతి రోగం పట్టుకుంది. ప్రతి పనికి ఓ రేటు కట్టి నగదు వసూలు చేయడం రివాజుగా మారింది. కార్యాలయ ఉద్యోగుల టీఏ బిల్లుల మంజూరుకు కమీషన్ డిమాండ్ చేసే వరకు వెళ్లింది. ఆస్పత్రిలోని ఓ మహిళా ఉద్యోగి ద్వారా వసూళ్లపర్వం నడుపుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు హెచ్చరించినా జిల్లా అధికారి తన తీరు మార్చుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
- సిబ్బంది టీఏ బిల్లుల మంజూరులో చేతివాటం
- టీబీ ఆస్పత్రిలోని ఓ మహిళా ఉద్యోగి ద్వారా వసూళ్లపర్వం!
- నగదు ఇస్తేనే బిల్లులు మంజూరు అంటూ హుకుం
- జిల్లా అధికారి తీరుపై అనేక ఆరోపణలు
జిల్లా క్షయ నివారణ ఆస్పత్రికి అవినీతి రోగం పట్టుకుంది. ప్రతి పనికి ఓ రేటు కట్టి నగదు వసూలు చేయడం రివాజుగా మారింది. కార్యాలయ ఉద్యోగుల టీఏ బిల్లుల మంజూరుకు కమీషన్ డిమాండ్ చేసే వరకు వెళ్లింది. ఆస్పత్రిలోని ఓ మహిళా ఉద్యోగి ద్వారా వసూళ్లపర్వం నడుపుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు హెచ్చరించినా జిల్లా అధికారి తన తీరు మార్చుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం):
జిల్లా టీబీ (క్షయ నివారణ) విభాగంలో 38 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో మూడు కేడర్‌లలో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. వీరు తమకు కేటాయించిన మండలాల్లో పర్యటించి టీబీ, హెచ్‌ఐవీ, లెప్రసీ బారిన పడినవారికి ఆరోగ్యపరంగా పాటించాల్సిన నియమాలు తెలియజేయాలి. మందులు అందజేసి, వాటిని సక్రమంగా వాడుతున్నారో లేదో అని నిత్యం పర్యవేక్షణ చేయాలి. ఎప్పటికప్పుడు బాధితుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి నివేదికలను వైద్యాధికారికి అందజేయాలి. ఇందుకు గాను వీరికి ప్రతి నెలా ట్రావెలింగ్ అలవెన్స్‌ను ప్రభుత్వం ఇస్తుంది. ఈ టీఏ బిల్లులకు సంబంధించిన నగదును విడుదల చేసి నెలలు గడుస్తోంది. అయినా సిబ్బందికి టీఏ బిల్లులు మంజూరు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తూ వస్తున్నారు. ఇటీవల సిబ్బంది తమకు టీఏ బిల్లులు విడుదల చేయాలని కోరారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది అసలు విషయం బయట పెట్టారు. మీకు టీఏ బిల్లులు విడుదల చేయాలంటే.. మీకు వచ్చే మొత్తం నుంచి కొంత నగదు ఇవ్వాలనే ప్రతిపాదన పెట్టారని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ నగదును టీబీ ఆస్పత్రి కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగికి అందజేయాలని హకుం జారీ చేశారని వారు చెబుతున్నారు. తమకు వచ్చే టీఏ బిల్లులే అంతంత మాత్రమని, వాటిని విడుదల చేయడానికి మీకెందుకు నగదు ఇవ్వాలని ఉద్యోగులు ప్రశ్నించినా పట్టించుకునేవారే కరువయ్యారు. అందరూ నగదు ఇచ్చాకే టీఏ బిల్లులు విడుదల అవుతాయని చెబుతుండటంతో సిబ్బందిలో అలజడి నెలకొంది.
లెప్రసీ బాధితులకు దూది, బ్యాండేజీలు కూడా ఇవ్వకుండా..
జిల్లా జనాభాలో రెండు శాతం మంది లెప్రసీ (కుష్ఠు) బారినపడిన వారు ఉన్నారు. మచిలీపట్నంలోని టీబీ ఆస్పత్రిలోని ప్రత్యేక విభాగంలో వీరికి వైద్యసేవలు అందించాలి. కానీ బాధితులకు కనీసంగా ప్రాథమిక వైద్యసేవలు కూడా ఇక్కడ అందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. లెప్రసీ బాధితులకు దూదితో పాటు కట్లు కట్టుకునేందుకు రోలర్ బ్యాండేజీని కూడా ఇవ్వకుండా నామమాత్రంగా వైద్యం చేసి పంపేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బాధితులు బ్యాండేజీతో పాటు దూది, మందులు ఇవ్వాలని కోరితే చిరాకు పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. లెప్రసీ బాధితులకు వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందించినట్లు లెక్కలు మాత్రం పక్కాగా రాసి బిల్లులు చేసుకోవడంలో ఆస్పత్రి వర్గాలు ముందుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి.
మారని అధికారి తీరు!
జిల్లా టీబీ ఆస్పత్రి పరిధిలోని వివిధ విభాగాల్లో 80 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో టీబీ విభాగానికి సంబంధించి 38 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. ఈ విభాగంలో పనిచేసే ఉద్యోగులలో కొంతమందిని అవసరం లేకున్నా సంబంధిత వైద్యాధికారి మచిలీపట్నంలోని టీబీ ఆస్పత్రిలో డిప్యుటేషన్ వేసి, ఇక్కడ ఖాళీగా కూర్చోబెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై ఫిర్యాదులు అందడంతో వైద్యశాఖ ఉన్నతాఽధికారులు టీబీ ఆస్పత్రిలో డిప్యుటేషన్‌లను రద్దు చేసి, ఉద్యోగులను వారి ప్రాంతాల్లో పనిచేసేలా చూడాలని ఆదేశించినా, సంబంధిత వైద్యాధికారి ఈ ఆదేశాలను పట్టించుకోకుండా మిన్నకుండిపోవడం గమనార్హం. హెచ్‌ఐవీ, లెప్రసీ, టీబీ బారినపడిన వారికి స్వచ్ఛంద సంస్థలు తరచూ అవగాహనా సదస్సులు నిర్వహిస్తుంటే, ఈ సదస్సులు తామే నిర్వహించినట్లుగా లెక్కల్లోరాసి బిల్లులు చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ ఆరోపణలన్నింటిపై వైద్యశాఖ అధికారులు విచారణ చేసి టీబీ ఆస్పత్రిలో అవినీతి కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సిబ్బందితోపాటు, పలువురు కోరుతున్నారు.