కాసులు కురిపిస్తున్న డీటీసీలు!
ABN , Publish Date - Mar 26 , 2026 | 04:04 AM
డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు (డీటీసీ) రవాణా శాఖలో కొందరికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. డీటీసీ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకొనేవారిని ఆ శాఖ సిబ్బంది లంచాల కోసం వేధిస్తున్నారు..
దరఖాస్తుదారులపై రవాణా ఉద్యోగి ‘ప్రతాపం’
ఐదు లక్షల లంచం ఇవ్వాలని వేధింపులు
అడిగినంత ఇవ్వకుంటే కొర్రీలతో కాలయాపన
అవినీతి ముఠాపై ఎంపీకి బాధితుల ఫిర్యాదు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు (డీటీసీ) రవాణా శాఖలో కొందరికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. డీటీసీ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకొనేవారిని ఆ శాఖ సిబ్బంది లంచాల కోసం వేధిస్తున్నారు. తమకు రూ.లక్షల్లో ముట్టజెప్పకపోతే వారి దరఖాస్తును కేంద్రానికి పంపకుండా కొర్రీలు వేసి ఆపేస్తున్నారు. రవాణాశాఖ కమిషనరేట్‌లో తమపై ‘ప్రతాపం’ చూపిస్తోన్న ఉద్యోగి వేధింపుల గురించి కొందరు బాధితులు ఓ ఎంపీకి ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 70 శాతం డ్రైవర్ల తప్పిదం వల్లే సంభవిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. డ్రెవింగ్‌లో యువతకు శిక్షణ ఇచ్చి పారదర్శకంగా డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసి ఇటు ప్రమాదాల నివారణతో పాటు అటు యువతకు ఉపాధి కల్పించాలని భావించింది. దీనిలో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాకు రెండు డీటీసీలు మంజూరు చేసింది. రెండెకరాల స్థలం ఉన్నవారు డీటీసీ ఏర్పాటుకు ముందుకొస్తే కేంద్రం రూ.2.5 కోట్ల ఆర్థిక సాయం అందిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 53 కేంద్రాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించి, వాటిని రవాణా శాఖ పరిశీలించిన తర్వాత కేంద్ర రవాణా శాఖకు పంపాల్సి ఉంది. తొలి విడతలో భాగంగా ఏపీలో 27 డీటీసీల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సొంత భూమి లేనివారు ఇతరుల వద్ద లీజుకు తీసుకున్నా కలెక్టర్లు అనుమతిచ్చారు. అయితే రాష్ట్ర రవాణా శాఖ హెడ్‌క్వార్టర్స్ నుంచి కేంద్రానికి దరఖాస్తులు పంపే ముందు దరఖాస్తుదారులకు ఫోన్లు వెళ్లాయి. వాటిలో ఏదో ఒక లోపం చూపిస్తూ ఓ ఉద్యోగి వారినుంచి లంచం డిమాండ్ చేశారు. కొందరు ఆయన అడిగినంత సమర్పించుకున్నారు. మరికొందరు ఇంకా మంజూరు కాకముందే ఎలా ఇస్తామని ప్రశ్నించారు. అయితే ప్రశ్నించే వారిపై ప్రతాపం చూపించడం కంటే వారిలో ‘చైతన్యం’ నింపితే వసూలు సులభంగా ఉంటుందంటూ మరో ఉద్యోగి రంగంలోకి దిగారు. ‘మీరూ బాగుండాలి.. మేమూ బాగుండాలి.. మీకు కేంద్రం నుంచి రూ.2.5కోట్లు వస్తున్నాయి.. అందులో 2శాతం మాకు ఇవ్వలేరా..’ అంటూ బేరమాడిననట్లు తెలిసింది. మరోవైపు గడువు సమయం దగ్గర పడుతుండటంతో బాధిత దరఖాస్తుదారులు ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎంపీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. టీ20 ప్రపంచకప్ టికెట్ల కోసం తనకు ఫోన్‌చేసిన ఒక ప్రజాప్రతినిధితో సదరు ఎంపీ ఈ విషయాన్ని పంచుకున్నారు. ఎట్టకేలకు కొంతమేర సడలింపులతో దరఖాస్తులు కేంద్ర రవాణా శాఖకు పంపినట్లు సమాచారం.
చిన్న ఉద్యోగి.. పెద్ద వ్యాపారాలు!
డీటీసీల దరఖాస్తుదారుల నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవాణాశాఖ ఉద్యోగి గురించి ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. చిన్న ఉద్యోగం చేసే ఆ వ్యక్తి రోజుకో వాహనంలో విధులకు హాజరవుతారు. సమయ పాలన లేకుండా రావడమే కాకుండా తనకు తోచినప్పుడు బయటకు వెళ్లిపోతారు. సహచర మహిళా ఉద్యోగి ఒకరు పూర్తిగా సహకరిస్తూ, ఆయన పేరుతో తేదీ లేని లీవ్ లెటర్‌ను సిద్ధంగా ఉంచుకుంటారని సమాచారం. కమిషనర్ తనిఖీ చేస్తే సెలవు పెట్టారని చెప్పేందుకు ముందు జాగ్రత్త అని తెలిసింది. సదరు ఉద్యోగి విజయవాడలో ఒక ఆస్పత్రిని నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్ కూడా చేసే ఆయనకు బెజవాడలోని ఓ పబ్‌లో భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించారు.