సొమ్ము కొట్టు.. ఎఫ్‌సీ పట్టు!
ABN , Publish Date - Apr 05 , 2026 | 04:37 AM
రోడ్డు ప్రమాదాలను నియంత్రించి.. ప్రయాణికుల ప్రాణాలకు భరోసా కల్పించాలన్న సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీఎస్) అవినీతి కేంద్రాలుగా మారిపోయాయి.
అవినీతి కేంద్రాలుగా వాహనాల ఏటీఎస్‌లు
టెస్టింగ్‌కు బండి సెంటర్‌కు రాకున్నా.. యథేచ్ఛగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ
పరీక్షలో ఫెయిలైనా లంచాలతో కవరింగ్
వసూలు చేసేది ఏజెంట్లు.. వాటాలు అందరికీ..
అక్రమాలకు రవాణా శాఖ అధికారుల సహకారం
ఫిట్‌నెస్ లేని వాహనాలతో గాల్లో ప్రజల ప్రాణాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రోడ్డు ప్రమాదాలను నియంత్రించి.. ప్రయాణికుల ప్రాణాలకు భరోసా కల్పించాలన్న సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీఎస్) అవినీతి కేంద్రాలుగా మారిపోయాయి. వాహనాలు తప్పనిసరిగా టెస్టింగ్‌కు వచ్చి, పరీక్షలో పాసైతేనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ (ఎఫ్‌సీ) జారీ చేయాల్సి ఉండగా.. లంచాలు పుచ్చుకొని ప్రైవేటు ఏజెంట్ల సిఫారసుతో ఇచ్చేస్తున్నారు. వాహనం ఎక్కడో ఉండి టెస్టింగ్‌కు రాకపోయినా లేదా ఫెయిలైనా ఎఫ్‌సీ జారీ చేసేస్తున్నారు. ఇందుకు సహకరించిన రవాణా శాఖ అధికారులకు సైతం వాటాలు ఇస్తూ.. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఏటీఎస్‌లలో దాదాపు అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఉందని వాహనాల యజమానులు కొందరు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఏటా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై కారణాలను అన్వేషించిన కేంద్ర రవాణా శాఖ తగిన చర్యలకు ఉపక్రమించింది. వాహనం ఫిట్‌నెస్‌తో ఉంటే ప్రమాదాలు తగ్గుతాయని, మాన్యువల్ ఫిట్‌నెస్ పరీక్షలో ఎంవీఐలు అవినీతికి పాల్పడి, అడ్డగోలుగా సర్టిఫికెట్లు జారీ చేస్తుండడంతో కేంద్రం దేశవ్యాప్తంగా ఏటీఎస్‌లు ఏర్పాటు చేసింది.
అన్ని రాష్ట్రాల్లో ఆటోమేటిక్ ఫిట్‌నెస్ స్టేషన్లను ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయించి, మాన్యువల్‌గా కాకుండా మిషనరీ ద్వారా పరీక్ష చేయించడం ద్వారా సరైన కండిషన్‌లో ఉన్న వాహనాలే రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంటుందని భావించింది. భారీ వాహనానికి (బస్సు, లారీ) రూ.వెయ్యి ఫీజు, సర్టిఫికెట్ కోసం మరో రూ.200, సర్వీస్ ఛార్జి రూ.120 కలిపి మొత్తం రూ.1320 వసూలు చేయాలి. క్యాబ్‌లు, కార్లు, ఆటోలు, ఇతర చిన్న వాహనాలకు రూ.860 నుంచి రూ.920 వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించకుండా, ఏటీఎస్‌లే తీసుకుని వారి పెట్టుబడి రికవరీ అయ్యాక అందులో ప్రభుత్వానికి ఒప్పందం మేరకు కొంత శాతం మేర చెల్లింపులు చేస్తారు. ఇందులో ఎంవీఐల పాత్ర నామమాత్రం చేసి, పర్యవేక్షణను జిల్లా స్థాయి రవాణా అధికారికి అప్పగించారు.
అన్ని ఎఫ్‌సీల జారీ ఎలా సాధ్యం?
ఫిట్‌నెస్ టెస్టు ఒక వాహనాన్ని అన్నివిధాలా ఆటోమేటిక్ పరీక్ష చేయాలంటే కనీసం 15 నిమిషాలు పడుతుంది. అంటే గంటకు నాలుగు మించి పెద్ద వాహనాలు, చిన్నవైతే ఐదారుకు దాటే పరిస్థితి లేదు. రోజుకు పన్నెండు గంటల పాటు పరీక్షలు చేస్తే ఒక ట్రాక్‌పై పెద్దవి 48-50 చేయవచ్చు. చిన్న వాహనాలను అయితే 72-75 వరకూ పరీక్షించవచ్చు. అందులో కనీసం 20 శాతం ఫెయిల్ అయ్యేవి ఉంటాయి. ఈ లెక్కన రోజుకు పెద్దవి 40 లోపు, చిన్నవి 60 లోపు వాహనాలకు ఎఫ్‌సీ జారీ అవుతాయి! అవి కూడా రెండు ట్రాక్‌లు ఉంటేనే! ఒకే ట్రాక్‌లో అయితే ఇందులో సగం మాత్రమే ఎఫ్‌సీ అవుతాయి. అయితే ఇందుకు విరుద్ధంగా రాష్ట్రంలోని ఏటీఎ్‌సలలో 100 నుంచి 200 వరకు ఎఫ్‌సీలు చేస్తున్నారు. అందులోనూ ఏజెంట్ల నుంచి వచ్చే సిఫారసులవే దాదాపు ఉన్నాయని తెలిసింది.
బండి లేకుండానే ఫిట్‌నెస్ టెస్టు!
మన రాష్ట్రంలో విజయవాడలో లారీలు ఎక్కువగా ఉంటాయి. నేషనల్ పర్మిట్‌తో ఇక్కడి నుంచి ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి. చేపల లోడుతో కోల్‌కతాకు వెళ్లిన లారీలకు ఇక్కడ ఎఫ్‌సీ అవుతోందని లారీ డ్రైవర్లే చెబుతున్నారు. అదెలా సాధ్యమని అడిగితే, వాట్సా్‌పలో పేపర్లు పంపిస్తే ఏజెంట్ అన్నీ చేస్తున్నాడని బదులిస్తున్నారు. గత ఆర్నెల్లలో విజయవాడలో ఎఫ్‌సీ జారీ అయిన వాహనాల జీపీఎస్ లేదా టోల్‌గేట్ల పాసింగ్‌ను పరిశీలిస్తే.. ఎన్ని వాహనాలు ఎఫ్‌సీకి రాకుండా పాసయ్యాయో తెలిసిపోతుందని చెబుతున్నారు. గతంలో ఎంవీఐలు ప్రభుత్వానికి చెల్లించే ఫీజు కాకుండా రూ.వెయ్యి నుంచి రూ.3 వేలు తీసుకుంటే.. ఇప్పుడు రూ.5 వేలకు తగ్గకుండా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అందులో ఏటీఎస్ యజమానులకు రూ.3 వేలు, రవాణా శాఖ అధికారులకు రూ.వెయ్యి నుంచి రూ.1500, మిగతా సొమ్మును ఏజెంట్లు తీసుకొంటున్నట్లు కొంత మంది లారీ డ్రైవర్లు వివరిస్తున్నారు.
మాకూ నెల మామూళ్లు ఇవ్వాలి..
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోన్న ఏటీఎ్‌సలలో అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోగా.. ప్రభుత్వానికి చెందిన ఓ కీలక నేత కార్యాలయ ఉద్యోగి ఒకరు ఏటీఎస్‌ల నిర్వాహకులకు ఫోన్లు చేసి వాటా అడుగుతున్నట్లు తెలిసింది. ‘మాకూ నెలనెలా కొంత చొప్పున పంపండి.. మీరూ బాగుండాలి.. మేమూ బాగుండాలి’ అంటూ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రభుత్వమే సొంతంగా నిర్వహించేందుకు విశాఖపట్నంలో రూ.16 కోట్ల ఖర్చుతో 8 ఏళ్ల క్రితం ఏటీఎస్ నిర్మాణం మొదలు పెట్టింది. ఇప్పటి వరకూ అది పూర్తయి, ఎఫ్‌సీలు జారీ చేసే పరిస్థితికి రాకపోవడం గమనార్హం.