Share News

కార్పొరేషన్‌.. 86 డివిజన్లు!

ABN , Publish Date - Apr 15 , 2026 | 01:11 AM

విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ డివిజన్ల పెంపు ప్రతిపాదనలు (డ్రాఫ్ట్‌ ప్రపోజల్స్‌) సిద్ధమయ్యాయి. నగరంలో ప్రస్తుతం ఉన్న 64 డివిజన్లను 86 డివిజన్లకు పెంచుతూ అధికారులు మ్యాపింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ నెల 26వ తేదీన ఈ ప్రతిపాదనలను కార్పొరేషన్‌ అధికారులు అధికారికంగా విడుదల చేయనున్నారు. ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత డివిజన్ల పెంపు తుది జాబితాను ప్రకటిస్తారు.

కార్పొరేషన్‌.. 86 డివిజన్లు!

- నగర పాలక సంస్థలో డివిజన్ల పునర్విభజన కొలిక్కి!

- 64 డివిజన్లను 86 డివిజన్లుగా పెంచుతూ ప్రతిపాదనలు

- నగరంలో పూర్తిగా మారిపోయిన డివిజన్ల భౌగోళిక స్వరూపం

- సర్కిల్‌-1లో 28 డివిజన్లు, సర్కిల్‌-2లో 29 డివిజన్లు, సర్కిల్‌-3లో 29 డివిజన్ల ఏర్పాటు

విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ డివిజన్ల పెంపు ప్రతిపాదనలు (డ్రాఫ్ట్‌ ప్రపోజల్స్‌) సిద్ధమయ్యాయి. నగరంలో ప్రస్తుతం ఉన్న 64 డివిజన్లను 86 డివిజన్లకు పెంచుతూ అధికారులు మ్యాపింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ నెల 26వ తేదీన ఈ ప్రతిపాదనలను కార్పొరేషన్‌ అధికారులు అధికారికంగా విడుదల చేయనున్నారు. ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత డివిజన్ల పెంపు తుది జాబితాను ప్రకటిస్తారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

నగరంలో మూడు సర్కిల్‌ కార్యాలయాల పరిఽధిలో సమాన నిష్పత్తిలో డివిజన్లు పెరిగాయి. డివిజన్‌ పరిధిలో ఓటర్లు కనిష్టంగా 8,500 పైన, గరిష్టంగా 10,500 లోపు ఉండేలా చర్యలు తీసుకున్నారు. పది వేల నుంచి పదకొండు వేల ఓటర్ల లోపు 14 డివిజన్లను ఏర్పాటు చేశారు. తొమ్మిది వేల నుంచి పది వేల ఓటర్ల లోపు 37 డివిజన్లను సిద్ధం చేశారు. మిగిలిన 33 డివిజన్లు 8,500పైన, 9000 లోపు ఓటర్లు ఉండేలా డివిజన్లను విభజించారు.

పెరిగిన డివిజన్లు ఇలా..

- సర్కిల్‌ - 1 పరిధిలో మొత్తం 28 డివిజన్లను ఏర్పాటు చేశారు. 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74 డివిజన్లు సర్కిల్‌-1 పరిధిలో ఉండనున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఈ డివిజన్లన్నీ అంతర్భాగంగా ఉంటాయి.

- సర్కిల్‌ - 2 పరిధిలో మొత్తం 29 డివిజన్లను ఏర్పాటు చేశారు. 1, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86 డివిజన్లు సర్కిల్‌ - 2 పరిధిలో ఉంటాయి. ప్రస్తుత సెంట్రల్‌ నియోజకవర్గం పరిధిలో ఈ డివిజన్లు అంతర్భాగంగా ఉంటాయి.

- సర్కిల్‌ - 3 పరిధిలో మొత్తం 29 డివిజన్లను ఏర్పాటు చేశారు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 డివిజన్లు సర్కిల్‌-3 పరిధిలో ఉంటాయి. ప్రస్తుత విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోకి ఈ డివిజన్లు అంతర్భాగంగా ఉంటాయి.

ఏ డివిజన్లను విభజించారంటే..

నగరంలో పెద్దదిగా ఉన్న 63వ డివిజన్‌ను 83, 84 డివిజన్లుగా విభజించారు. 61వ డివిజన్‌ను 81, 82 డివిజన్లుగా ఏర్పాటు చేశారు. 60వ డివిజన్‌ను 79, 80 డివిజన్లుగా, 59వ డివిజన్‌ను 77, 78 డివిజన్లుగా, 1వ డివిజన్‌ను 1, 35 డివిజన్లుగా విభజించారు. ఇవి కాకుండా మధ్యస్తంగా ఉన్న పలు డివిజన్లను కూడా రెండుగా విభజన చేశారు. భౌగోళికంగా పెద్దగా ఉన్న డివిజన్లు కాకుండా.. ఓటర్ల పరంగా ఎక్కువుగా ఉన్న డివిజన్లను లక్ష్యంగా చేసుకుని రెండుగా విభజించారు.

పాత-కొత్త డివిజన్లు మచ్చుకు కొన్ని ఇలా..

రామలింగేశ్వర నగర్‌లోని 13, 14 డివిజన్లు 19, 20 డివిజన్లుగా మారబోతున్నాయి. పటమట 12వ డివిజన్‌ 21వ డివిజన్‌గా మారుతోంది. రాణిగారితోటలో ఉన్న 15, 16, 17, 18 డివిజన్లు 22, 23, 24, 25, 26 డివిజన్లుగా భౌగోళిక మార్పులకు గురవుతున్నాయి. కృష్ణలంకలోని 20, 21, 22 డివిజన్లు కాస్తా 27, 28, 29, 30 డివిజన్లుగా భౌగోళిక మార్పులు ఏర్పడనున్నాయి. రాణిగారితోట, కృష్ణలంక ప్రాంతాలకు అదనంగా ఒక్కో డివిజన్‌ పెరుగుతోంది. పటమటలంకలో 9వ డివిజన్‌ 18వ డివిజన్‌గా, 10వ డివిజన్‌ 7వ డివిజన్‌గా, 11వ డివిజన్‌ 6వ డివిజన్‌గా మారుతున్నాయి. భవానీపురంలో 37, 38, 39, 41 డివిజన్లు 50, 51, 52, 53 డివిజన్లుగా మారనున్నాయి. సెంట్రల్‌ పరిధిలో కండ్రిక, ఎన్‌ఎస్‌సీ బోస్‌నగర్‌లు ప్రస్తుతం 64 డివిజన్‌గా ఉండగా.. కొత్తగా 86వ డివిజన్‌గా మారబోతోంది. అలాగే 62, 63 డివిజన్లు 84, 85 డివిజన్లుగా మారుతున్నాయి. ఇవి మచ్చుకు మాత్రమే. ఒక్క తూర్పు నియోజకవర్గంలో మాత్రమే చేతి వేళ్ల మీద లెక్కించదగిన సంఖ్యలోనే పాత డివిజన్ల నెంబర్లు ఉన్నాయి. నెంబర్లు పాతవి ఉన్నప్పటికీ స్వల్పంగా వాటి భౌగోళిక స్వరూపం మారుతోంది.

Updated Date - Apr 15 , 2026 | 01:11 AM