Sankranti Cockfights: పండగ కోడికి కార్పొరేట్ కళ
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:06 AM
వారధి ..హైటెక్ కోడి పందేల వేడుకకు నిర్వాహకులు పెట్టిన పేరు ఇది. ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు ఈ వేడుకే హాట్ టాపిక్‌గా మారింది.
కృష్ణా, ఏలూరు సరిహద్దుల్లో హైటెక్ బరి
అద్దాలు, ఏసీలతో నిండిన ప్రత్యేక గ్యాలరీలు
‘వారధి’ పేరిట శుభలేఖలా ఆహ్వాన పత్రికలు
పాస్‌లు ఇస్తూ రారండోయ్.. అంటూ పిలుపులు
విస్తీర్ణం 28 ఎకరాలు.. ఏడు ఎకరాల్లో పార్కింగ్
రోజుకు 40 పందేలు.. 5 లక్షలు-కోటి వరకు బెట్టింగ్
వీఐపీలకు మహారాజ ఆతిథ్యం.. రక్షణగా బౌన్సర్లు
అక్కడికే విందు భోజనాలు అందించేలా ఏర్పాట్లు
బహుమతులుగా కార్లు ఇస్తామంటూ ప్రకటనలు
రోజుకు 40 పందేలు 5లక్షలు-కోటి వరకు బెట్టింగ్‌లకు సై
సంక్రాంతి కోసం కోడి రెడీ అవుతోంది. కార్పొరేట్ లుక్‌ను జోడిస్తూ కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని గన్నవరం, నూజివీడు సరిహద్దుల్లో హైటెక్ బరిని సిద్ధం చేస్తున్నారు. పూర్తిగా అద్దాలు, ఏసీతో వీఐపీ గ్యాలరీలు... పెళ్లి శుభలేఖ అంత అందంగా ఆహ్వాన పత్రికలు, రండి.. రండి.. దయ చేయండి.. అంటూ స్వయంగా పిలుపులు.. గెలిస్తే కార్లు బహుమతులుగా ఇస్తామంటూ ప్రకటనలు..! వెరసి కోడి కూతను మోతెక్కించేందుకు నిర్వాహకులు అన్ని హంగులతో సిద్ధమవుతున్నారు.
వారధి ..హైటెక్ కోడి పందేల వేడుకకు నిర్వాహకులు పెట్టిన పేరు ఇది. ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు ఈ వేడుకే హాట్ టాపిక్‌గా మారింది. కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం, ఏలూరు జిల్లాలోని నూజివీడు రూరల్ మండలాల సరిహద్దుల్లో 28 ఎకరాల్లో బరులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో ప్రధాన బరిని కార్పొరేట్ లెవల్‌లో ముస్తాబు చేస్తుండగా, మరో మూడు చిన్న బరులు కూడా సిద్ధమవుతున్నాయి. ఆహ్వానపత్రికలను ముద్రించి, పెద్దలకు, ప్రముఖులకు అందిస్తూ.. రారండోయ్...అంటూ స్వయంగా నిర్వాహకులు పిలుస్తున్నారు. పండగకు ముందు, ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు సంక్రాంతి సంబరాలు...పండగ మూడురోజులూ కోడి పందేలు నిరంతరాయంగా నిర్వహించేలా రూ.కోట్ల ఖర్చుతో ఏర్పాట్లు చేస్తున్నారు..
ప్రధాన బరికి ఒక పక్కగా వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. దీనిని అద్దాలతో, పూర్తి ఏసీతో అత్యాధునికంగా తయారు చేస్తున్నారు. నిర్వాహకుల అనుమతితో తప్ప ఎవరినీ లోనికి అనుమతించకుండా పాసులను అందజేస్తున్నారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానూ, ఇతర రాష్ట్రాల నుంచీ వచ్చే అతిధుల కోసం ప్రత్యేకంగా విజయవాడ, హనుమాన్‌జంక్షన్. నూజివీడు, ఏలూరు ప్రాంతాల్లో లగ్జరీ హోటళ్లలో రోజుకు 5 వేలకుపైగా ఖరీదైన రూములను సిద్ధం చేశామని నిర్వాహకులు ఓపెన్‌గానే చెబుతున్నారంటే, పందేల జోరు ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు.
మహారాజ ఆతిథ్యం...
వివిధ రాష్ట్రాల నుంచి కోడిపందేలు చూసేందుకు వచ్చేవీవీఐపీలు, ఉభయ తెలుగు రాష్ర్టాల నుంచి వచ్చే ప్రముఖుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ టీమ్‌తో పాటు, తెలంగాణకు చెందిన ప్రముఖులు కూడా వస్తున్నారని చెబుతున్నారు. వారందరికీ ప్రత్యేకంగా ఏసీ గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన బరికి ఇది అభిముఖంగా ఉంటుంది. గాజు అద్దాలతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులోనే వీఐపీలకు విందు భోజనాలు ఉంటాయి. సామాన్యుల తాకిడి తట్టుకునేందుకు వీవీఐపీలు, వీఐపీల కోసం 80 మంది బౌన్సర్లను ప్రత్యేకంగా రప్పిస్తున్నారు.
రూ.లక్షల్లో పందేలు... బహుమతులుగా కార్లు
ప్రధాన బరితో పాటు చిన్నపాటివి మూడు బరులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన బరిలో కనిష్ఠంగా రూ.5 లక్షల నుంచి రూ. కోటి వరకుపందేలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రోజుకు 40 పందేలకు పైగా ఒప్పందాలు జరిగిపోయాయి. మిగతా బరుల్లో రూ. లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ఒకటి, రూ. లక్ష లోపు మరొకటిగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానబరిలో జరిగే పందేలలో వరుసగా 4 పందేలు గెలిచిన వ్యక్తికి బ్రెజా కారు, థార్ బహుమతులుగా ప్రకటించారు. ఈ బహుమతులను బట్టి ఎంత పెద్దఎత్తున కోడిపందేలు జరగనున్నాయో ఊహించుకోవచ్చు.
- విజయవాడ /హనుమాన్‌జంక్షన్ రూరల్, ఆంధ్రజ్యోతి
కబడ్డీ పోటీలతో సంబరాలు మొదలు..
సంక్రాంతి సంబరాల పేరుతో నిర్వహించే ‘వారధి’ని ఈ నెల 9వ తేదీన కబడ్డీ పోటీలతో ప్రారంభిస్తున్నారు. 10వ తేదీన ఎద్దుల పోటీలతో పాటు అవుల ఆందాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. 11వ తేదీన 200 మంది మహిళలతో ముగ్గుల పోటీలు జరుపుతారు. బహుమతులుగా రూ. 25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు అందిస్తారు. పశుపోషకులకు కన్సొలేషన్ (పాల్గొన్నందుకు) బహుమతులు కూడా అందజేయనున్నారు.
కార్ల పార్కింగ్ కోసమే ఏడెకరాల స్థలం
కోడి పందేల వీక్షకులు, పందెపు రాయుళ్ల కోసం ప్రత్యేకంగా ఏడు ఎకరాల్లో కారు పార్కింగ్ ఏర్పాటుచేశారు. బిళ్లనపల్లి రోడ్డులోని సీపీ ఫ్యాక్టరీని ఆనుకుని ఉన్న స్థలాన్ని దీనికోసం చదును చేశారు. ద్విచక్ర వాహనాలకు ప్రత్యేకంగా రెండు ఎకరాలు సిద్ధం చేస్తున్నారు. రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ సిబ్బందిని కూడా ఏర్పాటుచేయడం ప్రత్యేకం. కార్లను పార్కింగ్ చేయడంతో పాటు పకడ్బందీగా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. సెక్యూరిటీ కోసమే 200 మందికి పైగా గార్డులను నియమించుకున్నట్టు తెలుస్తోంది.