Relay Hunger Strike: 5 నుంచి సహకార ఉద్యోగుల రిలే దీక్షలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 06:22 AM
రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు రిలే నిరాహర దీక్షలు చేపట్టనున్నారు
విజయవాడ (గాంధీనగర్), జనవరి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు రిలే నిరాహర దీక్షలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ మేరకు జేఏసీ నేత బొల్లినేని రఘురామ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 9వ తేదీ లోగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేదంటే ఆమరణ నిరాహరదీక్షకు దిగుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖజనాపై ఎటువంటి ఆర్ధికభారం పడని సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఆయన తప్పుబట్టారు. జీవో 36ను అమలు చేయాలని జేఏసీ నాయకులు సీహెచ్.నరసింహారావు, ఎస్.కొండల శర్మ, ఏరా గోపిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.