Share News

విడ్డూరం.. వైద్యుల అత్యుత్సాహం!

ABN , Publish Date - Mar 17 , 2026 | 05:29 AM

పలా సలో కిడ్నీ ఆస్పత్రికి ఆది నుంచీ ప్రాణం పోసిన తెలుగుదేశం పార్టీని కాదని, వైసీపీ నేతలను అక్కడి వైద్యులు ఆకాశానికెత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

విడ్డూరం.. వైద్యుల అత్యుత్సాహం!

  • కిడ్నీ ఆస్పత్రికి ప్రాణం పోసిన కూటమి సర్కారు

  • కానీ, మాజీమంత్రి సీదిరి ఇంటికి వెళ్లి వైద్యుల అభినందనలు

  • చర్చనీయాంశమైన వైద్యుల తీరు.. మండిపడుతున్న కూటమి శ్రేణులు

శ్రీకాకుళం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): పలా సలో కిడ్నీ ఆస్పత్రికి ఆది నుంచీ ప్రాణం పోసిన తెలుగుదేశం పార్టీని కాదని, వైసీపీ నేతలను అక్కడి వైద్యులు ఆకాశానికెత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలివీ.. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీవ్యాధి బాధితుల సంఖ్య వేలల్లో ఉంది. ఈ సమస్యపై 2014-19 మధ్యకాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ సుజలధార పథకం పేరుతో సురక్షిత నీటిని మంజూరు చేసింది. ఆపై కిడ్నీ వ్యాధి బాధితులకు, డయాలసిస్‌ చేయించుకుంటున్నవారికి ఖరీదైన వైద్యపరీక్షలతోపాటు పింఛన్‌లు సైతం మంజూరు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారి వైసీపీ కొలువు తీరింది. పలాసలో కిడ్నీ ఆసుపత్రి భవన నిర్మాణం వైసీపీ హయాంలో దాదాపు పూర్తయింది. అప్పట్లో వివిధ విభాగాల్లో ఔట్‌ సోర్సింగ్‌లో సుమారు 50 మందిని నియమించారు. వారికి ఏకంగా 11 నెలలకుపైగా వేతనాలు కూడా చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. పాత బకాయిలను సైతం క్లియర్‌ చేసి... ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు.. ఇతర అవసరాలను సమకూర్చారు. ఇటీవల ఈ ఆసుపత్రిలో విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కూడా నిర్వహించారు. వైద్యులను ఎమ్మెల్యే శిరీష అభినందించారు. ఇంతవరకు ఓకే.. ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ జక్కుల కిశోర్‌, నెఫ్రాలజిస్టు యర్రా రాకేశ్‌.. ఆదివారం పలాసలో మాజీమంత్రి సీదిరి అప్పలరాజు వద్దకు వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి మరీ అభినందనలు తెలిపారు. పెండింగ్‌ బకాయిలను సైతం కూటమి ప్రభుత్వం తీర్చి.. ఆపై అవసరమైన సదుపాయాల కల్పనలో అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తే.. సూపరింటెండెంట్‌, నెఫ్రాలజిస్టు వైసీపీ నేత ఇంటికి వెళ్లి అభినందించడం గమనార్హం.

Updated Date - Mar 17 , 2026 | 05:30 AM