Share News

పక్కా ‘ప్రణాళిక’తో అందలం!

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:41 AM

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిణిని కూటమి ప్రభుత్వం అందలమెక్కిస్తోంది. టీడీఆర్‌ బాండ్ల అక్రమాల్లో ఆమె పాత్ర ఉందని సాక్షాత్తు విజిలెన్స్‌ విభాగమే తప్పుపట్టినా...

పక్కా ‘ప్రణాళిక’తో అందలం!

  • అవినీతి ఆరోపణలున్నా.. విజిలెన్స్‌ తప్పుపట్టినా..

  • డీటీసీపీ విద్యుల్లతకు ఏపీ రెరాలో స్థానం!!

జగన్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో జరిగిన అవకతవకలకు నాటి డీటీసీపీ విద్యుల్లత మద్దతు ఉందన్న విమర్శలున్నాయి. అప్పట్లో పలువురు టీడీపీ నేతలు సైతం ఆమె అక్రమాలకు బాధితులయ్యారు. వైసీపీ నేతలకు కోట్లు అప్పనంగా కట్టబెట్టేందుకు ఉద్దేశించిన టీడీఆర్‌ బాండ్ల జారీ విషయంలో ఆమె పూర్తిగా అండదండగా నిలిచారని విజిలెన్స్‌ తప్పుబట్టింది. అయినా పట్టణ ప్రణాళికా విభాగంలో పనిచేసిన ఆమె పక్కా ప్రణాళికతో.. ఓ మంత్రి దన్నుతో ఇప్పుడు కీలక పోస్టులోకి వస్తున్నారు. ఏపీ రెరాలో సాంకేతిక సభ్యురాలిగా నియమితులు కానున్నట్లు తెలుస్తోంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిణిని కూటమి ప్రభుత్వం అందలమెక్కిస్తోంది. టీడీఆర్‌ బాండ్ల అక్రమాల్లో ఆమె పాత్ర ఉందని సాక్షాత్తు విజిలెన్స్‌ విభాగమే తప్పుపట్టినా... ఆమెపై చర్యలు తీసుకోకపోగా.. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి పోస్టు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఏపీ రెరా ట్రైబ్యునల్‌ టెక్నికల్‌ సభ్యురాలిగా నియమించనున్నారు. టౌన్‌-కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ (డీటీసీపీ) విద్యుల్లతకు ఇంకా నాలుగేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ.. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి చేసి ఐదేళ్లపాటు ఏపీ రెరా ట్రైబ్యునల్‌ టెక్నికల్‌ సభ్యురాలిగా చేరేందుకు అన్ని లాంఛనాలూ పూర్తయినట్లు తెలిసింది. పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన అధికారిని రెరా ట్రిబ్యునల్‌లో టెక్నికల్‌ మెంబర్‌గా నియమించడం ఆనవాయితీ. ఈ సభ్యులకు సీఎస్‌ స్థాయి హోదా, వసతులు, ప్రొటోకాల్‌ అందుతాయి. సుదీర్ఘకాలం డీటీసీపీలో వివిధ హోదాల్లో పనిచేసిన విద్యుల్లత.. పక్కా ప్రణాళికతో, ఓ మంత్రి చలువతో ఈ కీలక పదవి దక్కించుకోబోతున్నారని సమాచారం. కాకినాడలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ కోసం భూసేకరణ ముసుగులో అవకతవకలు జరిగాయి.


ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ లేవని అధికారులు మభ్యపెట్టి ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు సేకరించి అధిక రేటు నిర్ధారించి టీడీఆర్‌ బాండ్లు జారీచేశారు. టీడీఆర్‌ బాండ్ల ద్వారా భూములు తీసుకుంటున్న విషయం గోప్యంగా ఉంచారు. ఈ కుంభకోణానికి సూత్రధారి, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయడంతో పాటు డీటీసీపీ విద్యుల్లత, కాకినాడ అప్పటి కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహరావు, అప్పటి డిప్యూటీ సిటీ ప్లానర్‌ కె.హరిదా్‌సపై కఠినమైన క్రమశిక్షణ తీసుకోవాలని విజిలెన్స్‌ విభాగం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గత ప్రభుత్వంలో జరిగిన టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంలో మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ, పట్టణ ప్రణాళిక విభాగం ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలొచ్చాయి. వారి ఒత్తిడితోనే పలు పట్టణ స్థానిక సంస్థల్లో ఈ బాండ్లు జారీచేశారని అంటారు. తిరుపతిలో జరిగిన భారీ టీడీఆర్‌ కుంభకోణంపై విచారణకు డీటీసీపీనే నియమించడంపై కూడా విమర్శలొచ్చాయి.


విచారణలు చేసినా..

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గతంలో ఫిర్యాదు చేసిన పలు అంశాలపై కూటమి ప్రభుత్వం వచ్చాక విచారణకు ఆదేశించింది. పురపాలక శాఖ కమిషనర్‌-డైరెక్టర్‌ (సీడీఎంఏ) స్వయంగా విచారించారు. అలాగే గతంలో ఆయా నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి విచారణ జరిపిన వివరాలనూ సేకరించారు. అప్పటి సిటీ ప్లానర్‌ విద్యుల్లతను వివరణ కోరుతూ ప్రభుత్వం నోటీసులూ జారీచేసింది. తీవ్ర ఆరోపణలున్న ఆమెను జగన్‌ హయాంలోనే తొలగిస్తారని అంతా భావించారు. అయితే పురపాలక శాఖ ఇప్పుడవన్నీ పక్కనపెట్టింది. ఆమెకు నాలుగేళ్ల సర్వీసు మిగిలి ఉండగా.. ఐదేళ్ల పదవీకాలం ఉండే కీలక పోస్టు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఏపీ రెరా ట్రైబ్యునల్‌ సభ్యురాలిగా ఆమె నియామక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం చేసినట్లు సమాచారం. ఓ మంత్రి సహకారం లభించడం వల్లే ఆమెపై విచారణలు సైతం వీగిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Updated Date - Jun 15 , 2026 | 04:42 AM