Share News

ఏపీపీఎస్సీ అధికారాలనే లాగేశారు!

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:39 AM

చైల్డ్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌(సీడీపీవో).. వంటి పోస్టుల భర్తీ అధికారం ఏపీపీఎస్సీకే ఉంది. కానీ, గత వైసీపీ ప్రభుత్వానికి ఎందుకో ఇది నచ్చలేదు. తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారో?

ఏపీపీఎస్సీ అధికారాలనే లాగేశారు!

  • శిశు సంక్షేమ ప్రాజెక్టు పోస్టుల భర్తీలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలు బేఖాతర్‌

  • మెడికల్‌ బోర్డు ద్వారా భర్తీకి యత్నం

  • కమిషన్‌ ప్రక్రియను మంత్రిత్వ శాఖకు అప్పగించే ప్రయత్నం.. జీవో కూడా జారీ

  • కమిషన్‌ తిరస్కరించినా ముందుకు

  • కోర్టులో కేసుతో ఆగిపోయిన ప్రక్రియ

  • ఎటూ తేలకుండా ఆగిన 243 ఖాళీలు

  • ప్రస్తుత ప్రభుత్వం.. ఆ పోస్టులను జాబ్‌ క్యాలెండర్‌లో పెట్టాలని డిమాండ్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

చైల్డ్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌(సీడీపీవో).. వంటి పోస్టుల భర్తీ అధికారం ఏపీపీఎస్సీకే ఉంది. కానీ, గత వైసీపీ ప్రభుత్వానికి ఎందుకో ఇది నచ్చలేదు. తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారో? లేదా మరే కారణమోగానీ కమిషన్‌ నుంచి ఆ పోస్టుల భర్తీ అధికారాలను ఏకపక్షంగా తొలగించారు. ఈ పోస్టులను ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భర్తీ చేస్తామని, ఈ మేరకు సమ్మతి తెలపాలని ఏపీపీఎస్సీకి అప్పట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ లేఖ రాసింది. ఈ ప్రతిపాదనను కమిషన్‌ తిరస్కరించింది. అయినా భర్తీ అధికారాన్ని మారుస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ జీవో జారీ చేసింది. దీనిపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు కావడంతో మొత్తం భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ఫలితంగా 243 పోస్టులు సుదీర్ఘకాలంగా భర్తీకి నోచుకోకుండా పోయాయి. తాజాగా ఆ పోస్టులను జాబ్‌ క్యాలెండర్‌లో పెట్టాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.


అసలేం జరిగిందంటే?

వైసీపీ హయాంలో సీడీపీవో పోస్టులు 61, మహిళా శిశు సంక్షేమ శాఖలోని గ్రేడ్‌-1 పోస్టులు(సూపర్‌వైజర్‌) 161, చిల్డ్రన్‌ హోమ్స్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు 21 ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టుల భర్తీకి అనుమతిస్తూ 2023, మార్చి 31న ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. పోస్టులు భర్తీ చేయాలని ఏపీపీఎస్సీకి స్పష్టం చేసింది. ఈ పోస్టులను ఎంఎ్‌సఆర్‌బీ ద్వారా భర్తీచేయాలని అప్పటి సీఎం జగన్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఆగస్టులో ఏపీపీఎస్సీకి లేఖ రాశారు. పోస్టుల భర్తీ అధికారాల బదలాయింపునకు సమ్మతి తెలపాలని కోరారు. దీనికి ఏపీపీఎస్సీ సమ్మతించలేదు. ఆ పోస్టులను తామే భర్తీ చేస్తామని, పోస్టుల రోస్టర్‌, జోన్‌, రిజర్వేషన్‌ కోటా అన్నిట్లో తప్పులున్నాయని, వాటిని సరిదిద్ది పంపాలని కమిషన్‌ సమాధానం పంపింది. మరోసారీ మహిళా శిశు సంక్షేమ శాఖ తప్పులతోనే వివరాలు పంపడంతో భర్తీ అధికారాలను బదిలీ చేయడం కుదరదని ఏపీపీఎస్సీ తేల్చి చెప్పింది. ఆశ్చర్యకరంగా ఏపీపీఎస్సీ తిరస్కరించినప్పటికీ పోస్టుల భర్తీ బాధ్యతను మెడికల్‌ సర్వీసెస్‌ బోర్డుకు అప్పగిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ అక్టోబరులో ఏకంగా జీవో జారీ చేసింది.


న్యాయ వివాదం

అసలు మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు, మహిళా శిశు సంక్షేమశాఖ పోస్టులకు సంబంధం లేదు. వైద్య ఆరోగ్య శాఖ, హెల్త్‌ యూనివర్సిటీ పోస్టులను ఆ బోర్డుకు అప్పగించినా అర్థంచేసుకోవచ్చు. అసలు సంబంధం లేని పోస్టులను మెడికల్‌ బోర్డుకు ఇవ్వడం అధికారులనే విస్మయానికి గురిచేసింది. ఇది నిబంధనలకు విరుద్ధంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఫలితంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది.

జీవో ఉపసంహరించుకోవాలి

దాదాపు పదేళ్ల తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖలో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను గత ప్రభుత్వం చేపట్టింది. అంత సుదీర్ఘకాలం తర్వాత వచ్చిన పోస్టులను కూడా మధ్యలోనే నిలిపివేశారు. పైగా సంబంధం లేని మెడికల్‌ సర్వీసెస్‌ బోర్డును తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ఆ 243 పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేయాలంటే గత ప్రభుత్వం మెడికల్‌ సర్వీసెస్‌ బోర్డు ద్వారా పోస్టులను భర్తీచేయాలంటూ ఇచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలి. కానీ, ఆ దిశగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకుని ఆ పోస్టులను త్వరలో విడుదల చేయనున్న జాబ్‌ క్యాలెండర్‌లో పెట్టాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 16 , 2026 | 04:41 AM