Share News

వీడని వివాదాలు!

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:47 AM

కృష్ణా యూనివర్సిటీలో ఏళ్ల తరబడి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఏటా నిర్వహించాల్సిన ప్రొఫెసర్ల పదోన్నతుల ఫైల్‌ను 20 నెలలుగా పెండింగ్‌ పెట్టేశారు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా కీలక బాధ్యతలు చూస్తున్న ఒక మహిళా అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు మూడేళ్లుగా అసలు ఇంటర్వ్యూ నిర్వహించలేదు. దీంతో ఆమె న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మిగిలిన వారు అదేబాట పట్టనున్నారు. ఈ వివాదాలు విద్యార్థుల బోధనపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

వీడని వివాదాలు!

- కృష్ణా యూనివర్సిటీలో అంతర్గత పోరు!

- 20 నెలలుగా పెండింగ్‌లో ప్రొఫెసర్ల పదోన్నతుల ఫైల్‌

-హైకోర్టును ఆశ్రయించిన ఒక మహిళా అసోసియేట్‌ ప్రొఫెసర్‌

- ఉన్నత విద్యామండలి, గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు మిగిలిన వారు సమాయత్తం

- పరిష్కారానికి నోచుకోని కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య

- విద్యాబోధనపై పడనున్న వివాదాల ప్రభావం!

కృష్ణా యూనివర్సిటీలో ఏళ్ల తరబడి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఏటా నిర్వహించాల్సిన ప్రొఫెసర్ల పదోన్నతుల ఫైల్‌ను 20 నెలలుగా పెండింగ్‌ పెట్టేశారు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా కీలక బాధ్యతలు చూస్తున్న ఒక మహిళా అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు మూడేళ్లుగా అసలు ఇంటర్వ్యూ నిర్వహించలేదు. దీంతో ఆమె న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మిగిలిన వారు అదేబాట పట్టనున్నారు. ఈ వివాదాలు విద్యార్థుల బోధనపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

కృష్ణా యూనివర్సిటీలో అనేక సమస్యలు తిష్టవేశాయి. ఇక్కడ పనిచేస్తున్న ప్రొఫెసర్లకు పదోన్నతులు ఇవ్వకుండా నెలల తరబడి జాప్యం చేస్తున్నారు. దీంతో ఇటీవల ప్రొఫెసర్లంతా కలిసి వీసీ వద్దకు వెళ్లి తమ పదోన్నతుల సంగతి తేల్చాలని కోరారు. ఆయన నుంచి స్పష్ట్టమైన హామీ రాకపోవడంతో వారు నిరాశగా వెనుదిరిగి వచ్చేశారు. అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌లు, కాంట్రాక్టు అధ్యాపకులకు సంబంధించిన పలు సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడటంతో ఈ ప్రభావం పాఠ్యాంశాల బోధనపై పడుతుందనే విమర్శలు వస్తున్నాయి.

ఇంటర్వ్యూలు నిర్వహించి 20 నెలలు!

ఏపీ యూనివర్సిటీ చట్టం, యూజీసీ నిబంధనల ప్రకారం ఏటా జనవరి, జూన్‌ నెలల్లో రెండు పర్యాయాలుగా కేరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ పథకం ద్వారా అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌లకు పదోన్నతులు ఇవ్వాలి. ఇందుకు గాను నోటిఫికేషన్‌ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించాలి. దరఖాస్తులను పరిశీలించి సెలెక్షన్‌ కమిటీ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించాలి. వాటి ఆధారంగా పదోన్నతులు ఇవ్వాలి. వర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌లకు అసోసియేట్‌ ప్రొఫెసర్‌లుగా, అసోసియేట్‌ ప్రొఫెసర్‌లకు ప్రొఫెసర్‌లుగా పదోన్నతుల ఇచ్చేందుకు 20 నెలల క్రితం ఇంటర్వ్యూలు నిర్వహించారు. దీంతో తమకు పదోన్నతులు వస్తాయనే ఆశతో అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌లు ఎదురుచూస్తున్నారు. కానీ పదోన్నతులు ఇవ్వకుండా సంబంధిత ఫైళ్లను తొక్కిపెట్టేశారు.

ఆమెకు మూడేళ్లుగా ఇంటర్వ్యూ నిల్‌

గత మూడేళ్లుగా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఒక మహిళా అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు పదోన్నతి ఇచ్చేందుకు ఇంటర్వ్యూ నిర్వహించలేదు. తనకు ఏకారణంతో ఇంటర్వ్యూ నిర్వహించలేదని ఆమె అడిగితే సమాధానం చెప్పలేదు. దీంతో ఈ అంశంపై ఆమె కోర్టును ఆశ్రయించిట్లు సమాచారం.

ఫిర్యాదులు చేసేందుకు సన్నద్ధం!

యూనివర్సిటీ వీసీగా రామ్‌జీ బాధ్యతలు చేపట్టి ఈ నెల 17వతేదీతో ఏడాది పూర్తి కానుంది. అయినా అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్లకు సంబంధించిన పదోన్నతుల ఫైల్‌ పెండింగ్‌లోనే ఉందని వారు వాపోతున్నారు. తమతో పాటు ముగ్గురు ప్రొఫెసర్‌లకు సీనియర్‌ ప్రొఫెసర్‌లుగా పదోన్నతి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇతర బోధనేతర బాధ్యతలు అప్పగించి పనులు చేయిస్తూనే, పదోన్నతులు ఇవ్వకుండా జాప్యం చేయడంపై వారంతా ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంపై తొలుత ఉన్నత విద్యామండలికి, ఆ తర్వాత గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. అప్పటికీ యూనివర్సిటీ అధికారులు స్పందించకుంటే న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. సకాలంలో పదోన్నతులు ఇవ్వకపోవడంతో నెలకు కనీసంగా రూ.50వేలు తమకు రావాల్సిన జీతభత్యాలు నిలిచిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టు అధ్యాపకులు

వర్సిటీలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న అధ్యాపకులకు మినిమం టైమ్‌స్కేలు(ఎంటీఎస్‌), వార్షిక ఇంక్రిమెంట్లు కొన్నేళ్లుగా ఇవ్వడంలేదు. గతేడాది విద్యాసంవత్సరం ప్రారంభమైన జూన్‌ నెలలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న అధ్యాపకులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, పనితీరు బాగుండని వారి స్థానంలో వేరే వారిని నియమించేలా ప్రణాళిక రూపొందించి గందరగోళం సృష్టించారు. దీంతో కాంట్రాక్టు అధ్యాపకులంతా ఇంటర్వ్యూలకు హాజరు కాకుండా తమ నిరసనను తెలియజేశారు. దీంతో దిగొచ్చిన యూనివర్సిటీ అధికారులు ఈ ఇంటర్వ్యూలను తర్వాత నిర్వహిస్తామని చెప్పి వాయిదా వేశారు. ఎంటీఎస్‌ను అమలు చేయకుండా జాప్యం చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ కాంట్రాక్టు అఽధ్యాపకులంతా కోర్టును ఆశ్రయించారు. కూటమి ప్రభుత్వం యూనివర్సిటీకి రెగ్యులర్‌ వీసీని నియమించి దాదాపు ఏడాది అవుతున్నా వీసీ ఈ అంశాన్ని పట్టించుకోకుండా సాచివేత ధోరణిని అవలంభిస్తున్నారని కాంట్రాక్టు అధ్యాపకులు వాపోతున్నారు.

వసతి గృహాల సంగతేంటి?

వర్సిటీ ప్రాంగణంలో బాలుర, బాలికల వసతిగృహాలు లేకపోవడంతో వివిధ పీజీ కోర్సులలో విద్యార్థులు చేరడం లేదు. 430 పీజీ సీట్లకు గానే 190 మంది మాత్రమే చేరారు. బాలికల వసతి గృహాన్ని గతేడాది విద్యా సంవత్సరం జూన్‌ నాటికే అందుబాటులోకి తీసుకువస్తామని వీసీ చెప్పారు. ఈ ఏడాది జూన్‌ నాటికి కూడా బాలికల వసతిగృహం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. బాలుర వసతి గృహాన్ని పునాదుల దశ వరకు నిర్మాణం చేసి, ఈ పనులు నిలిపివేస్తున్నట్లుగా యూనివర్సిటీ అధికారులు ఏడాది క్రితం ప్రకటించారు. ఎప్పటికి ఈ పనులు ప్రారంభిస్తారో తెలియని పరిస్థ్థితి నెలకొంది.

Updated Date - Feb 06 , 2026 | 12:47 AM