కాంట్రాక్టర్ల బకాయిల నిధుల విడుదలపై హర్షం
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:48 AM
కాంట్రాక్టర్లకు రూ.1,500 కోట్ల బకాయిలు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పి.శేషగిరిరావు...
సీఎంకు బిల్డర్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు
విజయవాడ (లబ్బీపేట), మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టర్లకు రూ.1,500 కోట్ల బకాయిలు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పి.శేషగిరిరావు, నేషనల్ ఆల్ ఇండియా ట్రస్టీ సీహెచ్ రామకోటయ్య, అడ్వైజరీ కమిటీ స్పోక్స్‌పర్సన్ బి.పంకజ్‌రెడ్డి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలోని అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. తొలుత ‘థ్యాంక్యూ సీఎం సార్’ అనే ప్లకార్డులు ప్రదర్శించారు. ఏళ్ల తరబడి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టర్ల ఇబ్బందులను పరిగణనలో తీసుకుని నిధులు విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు పయ్యావుల కేశవ్, జనార్దన్‌రెడ్డి, లోకేశ్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ సెక్రటరీలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో రోడ్లను అత్యంత నాణ్యతా ప్రమాణాలతో నిర్మిస్తున్నామని, తమ అసోసియేషన్‌లో సభ్యులైన కాంట్రాక్టర్లకు దేశవ్యాప్తంగా మంచిపేరు, ప్రఖ్యాతులు ఉన్నాయని చెప్పారు. ఇంకా కొంతమంది కాంట్రాక్టర్లకు ఉన్న బకాయిలను కూడా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మంజూరు చేసేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధాని అమరావతి నిర్మాణంలో అభివృద్ధి పనులకు స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించాలని కోరారు.