బీమా కంపెనీకి వినియోగదారుల కమిషన వడ్డింపు
ABN , Publish Date - Apr 24 , 2026 | 10:23 PM
పాలసీదారులు మృతి చెందిన తర్వాత బీమా మొత్తాన్ని చెల్లించకుండా సేవాలోపం చేసిన హెచడీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స కంపెనీకి జిల్లా వినియోగదారుల కమిషన తగిన రీతిలో వడ్డించింది.
కర్నూలు లీగల్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): పాలసీదారులు మృతి చెందిన తర్వాత బీమా మొత్తాన్ని చెల్లించకుండా సేవాలోపం చేసిన హెచడీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స కంపెనీకి జిల్లా వినియోగదారుల కమిషన తగిన రీతిలో వడ్డించింది. ఏ.వెంకట కృష్ణారెడ్డి అనే వ్యక్తి హెచడీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స కంపెనీ నుంచి రూ.1.50 కోటికి బీమా పాలసీ తీసుకున్నాడు. ఆ తర్వాత అతను 2023 ఏప్రిల్ 4వ తేదీన ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడి చెల్లెలు కొర్రపాటి లోహిత తన అన్న తీసుకున్న బీమా పాలసీ కోసం ఇన్సూరెన్స కంపెనీకి క్లెయిమ్ దర ఖాస్తును చేసుకుంది. మృతుడు అందజేసిన ప్రపోజల్ ఫారమ్‌లో పలు లోపాలు ఉన్నాయని, అతడు ఉద్దేశపూర్వకంగా ప్రధాన విషయాలను దాచిపెట్టి పాలసీ తీసుకున్నాడనే కారణంతో బీమా కంపెనీ ఆమె దరఖాస్తును తిరస్కరించింది. దీంతో లోహిత జిల్లా వినియోగదారుల కమిషనను ఆశ్రయించింది. విచారణలో ఇన్సూరెన్స కంపెనీ ఎటువంటి ఆధారాలు లేకుండా బీమా క్లెయిమ్‌ను తిరస్కరించి సేవాలోపం చేసిందని కమిషన నిర్దారించింది. దీంతో ఇన్సూరెన్స కంపెనీ ఫిర్యాదికి పాలసీ మొత్తం రూ.1.50 కోట్లు చెల్లించాలని, మానసిక ఆవేదన, కోర్టు ఖర్చుల కింద మరో రూ.15వేలు 45 రోజుల్లోపు చెల్లించాలని వినియోగదారుల కమిషన చైర్మన కరణం కిషోర్ కుమార్, సభ్యులు ఎన.నారాయణరెడ్డి, ఎస్.నజీమా కౌసర్ ఆదేశాలు జారీ చేశారు. ఇన్సూరెన్స కంపెనీ ఫిర్యాదికి మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించకపోతే 6 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని కమిషన తమ తీర్పులో పేర్కొంది.