Ex Vice President Venkaiah Naidu: రాజ్యాంగం చలనశీల ఆలోచనల సమాహారం
ABN , Publish Date - Jan 05 , 2026 | 05:13 AM
రాజ్యాంగం పట్ల విశ్వాసమంటే.. దానిలోని అన్ని విషయాలనూ పూర్తిగా నమ్మి, ఆచరించేందుకు సిద్ధపడటమేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
సవరించుకునే హక్కు రాజ్యాంగ నిర్మాతలే కల్పించారు : వెంకయ్యనాయుడు
‘ముక్కలైన స్వాతంత్య్రం’, ‘మన రాజ్యాంగం- మన ఆత్మగౌరవం’ పుస్తకాల ఆవిష్కరణ
విజయవాడ కల్చరల్, జనవరి 4(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం పట్ల విశ్వాసమంటే.. దానిలోని అన్ని విషయాలనూ పూర్తిగా నమ్మి, ఆచరించేందుకు సిద్ధపడటమేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. బీజేపీ నాయకుడు రామ్‌మాధవ్ ఆంగ్లంలో రచించిన ‘ముక్కలైన స్వాతంత్య్రం’, ‘మన రాజ్యాంగం-మన ఆత్మగౌరవం’ పుస్తకాల తెలుగు అనువాదాలను ఆదివారం విజయవాడ పుస్తక మహోత్సవంలో వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం రాతి మీద రాత కాదని, అది చలనశీలమైన ఆలోచనల సమాహారమన్నారు. అవసరాలకు అనుగుణంగా సవరించుకునే వెసులుబాటు హక్కును రాజ్యాంగ నిర్మాతలే భావితరాలకు కల్పించారని తెలిపారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులనే కాక, అందులో పేర్కొన్న విధులను గుర్తించి యువత ఆచరించాలని సూచించారు. సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండే రచనలు పెరగాలని ఆకాంక్షించారు. సామాజిక బాధ్యత కలిగిన పౌరులంతా పుస్తకాలను బహుమతులుగా ఇవ్వాలని, పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించాలని కోరారు. రామ్ మాధవ్ మాట్లాడుతూ వ్యక్తులకైనా, సమాజాలకైనా కాలక్రమేణా అభిప్రాయాలూ, విశ్వాసాలూ మారడం సహజం, అనివార్యమన్నారు. దేశ విభజన తాలూకు దుష్పరిణామాలను నేటికీ అనుభవిస్తున్నామని చెప్పారు. దీనికి కారణమైన పరిణామాలను నేటితరం తెలుసుకోవాలన్నారు. వాటిని 21వ శతాబ్ది యువతకు తెలియజేయాలనే ప్రధాని మోదీ కోరిక మేరకు తాను ఈ రచనలకు పూనుకున్నానని చెప్పారు. ప్రచురణకర్త ఎమెస్కో విజయకుమార్ మాట్లాడుతూ ప్రచురణ రంగం ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాలన్నారు. ఆర్‌ఎ్‌సఎస్ ప్రచారక్ ఆదిత్య మాట్లాడుతూ నేటి తరానికి స్వాతంత్య్ర కాలం నాటి చరిత్రను, అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను సమగ్రంగా, సంక్షిప్తంగా అందించడంలో రామ్ మాధవ్ రచనలు చాలా ఉపయోగపడతాయన్నారు. పుస్తకాల సంపాదకుడు జి.వల్లీశ్వర్ కూడా ప్రసంగించారు.