మన రాజ్యాంగం... న్యాయ వ్యవస్థకు దీప స్తంభం
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:03 AM
‘భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి మార్గదర్శి. న్యాయ వ్యవస్థకు దీప స్తంభం’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ అన్నారు.
ప్రగతిశీల భారత నిర్మాణానికి కృషి చేద్దాం: హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్
అమరావతి, తుళ్లూరు, జనవరి 26(ఆంధ్రజ్యోతి): ‘భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి మార్గదర్శి. న్యాయ వ్యవస్థకు దీప స్తంభం’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆవరణలో 77వ భారత గణతంత్ర వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘చట్టాధిపత్యం, వివక్ష రహిత సమాజం, పౌర హక్కుల పరిరక్షణ, ప్రజల సంకల్పాధిపత్యం అనే మూల సూత్రాలు భారత ప్రజాస్వామ్య బలాన్ని ప్రతిబింబిస్తున్నాయి. భారత ప్రజల ఆశ, విశ్వాసం, పునరుద్ధరణకు గణతంత్ర దినోత్సవం ప్రతీకగా నిలుస్తుంది. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, హక్కుల సమన్వయంగా ప్రతి పౌరుడికి నిర్భయంగా జీవించే, స్వప్నాలను సాకారం చేసుకునే హక్కును ఇస్తుంది. బలమైన, ఐక్యమైన సుస్థిరమైన, ప్రగతిశీల భారత నిర్మాణానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలి’ అని సీజే పిలుపునిచ్చారు. అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ద్వారకానాథ్ రెడ్డి, అడ్వకేట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కేవీ రఘువీర్ తదితరులు ప్రసంగించారు. ఈ వేడుకల్లో పలువురు న్యాయమూర్తులు, హైకోర్టు రిజిస్ర్టార్ జనరల్, పలువురు రిజిస్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.