Share News

కానిస్టేబుల్‌ వీరంగం!

ABN , Publish Date - Mar 13 , 2026 | 11:44 PM

ఓ కానిస్టేబుల్‌ వ్యవహారం ఆదోని పట్టణంలో ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బూతులతో రెచ్చిపోవడం, సివిల్‌ వివాదాల్లోకి తలదూర్చడం వంటి వ్యవహారాలతో ఆయన వార్తల్లోకెక్కారు.

   కానిస్టేబుల్‌ వీరంగం!
విచారణ చేపడుతున్న సీఐ రామలింగమయ్య

ఆదోని, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఓ కానిస్టేబుల్‌ వ్యవహారం ఆదోని పట్టణంలో ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బూతులతో రెచ్చిపోవడం, సివిల్‌ వివాదాల్లోకి తలదూర్చడం వంటి వ్యవహారాలతో ఆయన వార్తల్లోకెక్కారు. ఆదోని త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గార్డినియా విల్లా అప్రూవల్‌ వెంచర్‌లో కురువ రాఘవేంద్ర అనే వ్యక్తి ప్లాట్లు వేశారు. అయితే పట్టణంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి నెల రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితుడు రాఘవేంద్ర ఆవేదనతో వివరాలను వెల్లడించాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కానిస్టేబుల్‌ తన అనుచరులతో కలిసి వెంచర్‌ వద్దకు వెళ్లాడు. అక్కడ కాంపౌండ్‌ వాల్‌ను కూల్చివేసి ఆ పలకలను తన ఇంటికి తరలించుకుపోయాడు. అడ్డుకోబోయిన వెంచర్‌ యజమానిని, అక్కడి వర్కర్లను అత్యంత అసభ్య పదజాలంతో దూషించాడు. కానిస్టేబుల్‌ చేసిన హంగామా, ఆయన వాడిన పరుష పదజలానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బాధితుడు రాఘవేంద్ర ఫిర్యాదుతో త్రీటౌన్‌ సీఐ రామలింగమయ్య క్షేత్రస్థాయిలో వెంచర్‌ను పరిశీలించారు. పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కానిస్టేబుల్‌ ప్రవర్తనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. విచారణ అనంతరం తప్పు ఉన్నట్లు తేలితే కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై బాధితుడు రాఘవేంద్ర స్పందిస్తూ కానిస్టేబుల్‌ వేధింపుల వల్ల తాము ప్రాణభయంతో ఉన్నామని, పోలీసులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని కోరారు.

Updated Date - Mar 13 , 2026 | 11:44 PM