Share News

త్వరలో ‘కనెక్ట్‌ స్కూల్‌’

ABN , Publish Date - May 11 , 2026 | 04:01 AM

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు, దాతలు సులభంగా భాగస్వామ్యమయ్యేలా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

త్వరలో ‘కనెక్ట్‌ స్కూల్‌’

  • ప్రభుత్వ బడుల అభివృద్ధికి ‘బడికోసం’

  • విరాళాల కోసం పోర్టల్‌, యాప్‌

  • 68 రకాల వస్తువుల డెలివరీకి అవకాశం

  • పూర్వ విద్యార్థులు, దాతల సాయమే ఆసరా

  • త్వరలో లోకేశ్‌తో పోర్టల్‌ లాంచ్‌కు సన్నాహాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు, దాతలు సులభంగా భాగస్వామ్యమయ్యేలా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బడుల్లో అవసరాల కోసం విరాళాలు ఇచ్చే ప్రక్రియను సులభతరం చేసేందుకు వెబ్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ‘బడికోసం’ అనే పేరు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇంగ్లీష్ లో నూ అందరికీ చేరువయ్యేలా ‘కనెక్ట్‌ స్కూల్‌’ అనే పేరును నిర్ణయించింది. ఇప్పటివరకూ బడుల్లో విరాళాలు ఇచ్చేందుకు ఆన్‌లైన్‌ విధానం లేదు. ఇకనుంచి దాతలుగానీ, పూర్వ విద్యార్థులుగానీ నేరుగా పోర్టల్‌ లేదా యాప్‌ ద్వారా విరాళాలు పంపే అవకాశం రానుంది. ముఖ్యంగా విదేశాల్లో, సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు విరాళాలు ఇవ్వడం అత్యంత సులభం కానుంది.


వస్తువుల సంఖ్య కుదింపు

వాస్తవానికి నెల రోజుల కిందటే ఈ పోర్టల్‌, యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ భావించింది. అయితే, పైస్థాయి నుంచి మరిన్ని మార్పులకు సూచనలు చేయడంతో కొంత ఆలస్యమైంది. తొలుత ప్రణాళిక ప్రకారం పాఠశాలల్లో అవసరమయ్యే వస్తువులు 82 రకాలుంటాయని అంచనా వేశారు. ఆ తర్వాత వాటిని కుదించి ప్రస్తుతం ఆ సంఖ్యను 68కి తీసుకొచ్చారు. పోర్టల్‌, యాప్‌లో 68 రకాల వస్తువులతో చెక్‌ లిస్టు అందుబాటులో ఉంచుతారు. ఆయా పాఠశాలల్లో ఉన్న అవసరాలకు తగ్గట్టుగా ఆ లిస్టు మారుతుంది. వాటిలో ఫ్యాన్లు, కంప్యూటర్లు, ల్యాబ్స్‌లో అవసరమైన పరికరాలు, బెంచీలు, కుర్చీలు, తాగునీటికి అవసరమైన వస్తువులు, ఇతర అన్ని రకాల అవసరాలతో ఆ జాబితా రూపొందిస్తున్నారు. అందులో దాతలు ఏది కావాలంటే అది ఎంపిక చేసుకుని ఆ పాఠశాల అడ్ర్‌సతో నేరుగా పాఠశాలకు డెలివరీ చేయొచ్చు. లేదంటే ఆయా వస్తువులకు ఎంత వ్యయం అవుతుందనేది పోర్టల్‌లో కనిపిస్తుంది. పేమెంట్‌ గేట్‌వే ద్వారా ఆ మొత్తాన్ని నగదు రూపంలో పంపొచ్చు. అలా పంపితే దానిని ఎలా వినియోగించారు? ఎలాంటి వస్తువులు కొనుగోలు చేశారు? అనేది దాతలకు తిరిగి వాట్సాప్‌లో ఫొటోలు, సమాచారం పంపుతారు. ఒక పాఠశాలలో ఒక అవసరం తీరిపోతే జాబితా నుంచి దానిని తొలగిస్తారు. కొత్త అవసరాలు ఏర్పడినప్పుడు తిరిగి ఏం అవసరమో జాబితాలో చేరుస్తారు.


పూర్వ విద్యార్థులు మమేకమయ్యేలా..

కేవలం విరాళాలు ఇవ్వడమే ప్రధాన ఉద్దేశం అని కాకుండా చదువుకున్న బడులకు పూర్వ విద్యార్థులు చేయూతను అందించడం ద్వారా వారిని సొంత బడులతో మమేకం చేసేలా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. చాలా మంది పూర్వ విద్యార్థులకు చదువుకున్న బడులకు ఏదొక సాయం చేయాలని మనసులో ఉన్నా అక్కడకు వెళ్లడం వీలుపడక, సమయం లేక దూరమైపోతున్నారు. వెబ్‌ పోర్టల్‌ ద్వారా అయితే ఎక్కడున్నా వారికి నచ్చిన మేరకు సాయం చేసే వీలు కలుగుతుంది. చిన్న మొత్తం పెద్ద మొత్తం అనే భావన లేకుండా ఎంతైనా సరే వారి పేరుతో ఆన్‌లైన్‌లోనే బడులకు పంపొచ్చు.


పోర్టల్‌ ద్వారా డెలివరీలో చిక్కులు

తొలుత రూపొందించిన ప్రణాళిక ప్రకారం కొత్తగా ఏర్పాటుచేయబోతున్న పోర్టల్‌ నుంచి నేరుగా అమెజాన్‌ ఈకామర్స్‌ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయాలని భావించారు. ఏదైనా పాఠశాలను ఎంపిక చేసుకుని దానిపై క్లిక్‌ చేసి డెలివరీ ఆప్షన్‌ ఎంటర్‌ చేస్తే అది అమెజాన్‌కు కనెక్ట్‌ అవ్వాలని ప్రయత్నించారు. అయితే అమెజాన్‌ పోర్టల్‌ అందుకు అంగీకరించడం లేదు. నేరుగా తమ వెబ్‌సైట్‌లోకే వచ్చి ఏదైనా ఆర్డర్‌ పెట్టాలని సూచించింది. దీంతో ఆయా పాఠశాలల చిరునామాల ద్వారా ఆర్డర్‌ పెట్టే విధానం తీసుకొస్తున్నారు. అంటే ఆయా పాఠశాలల్లో ఏది అవసరమో చూసి.. ఏదైనా ఈకామర్స్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆ పాఠశాల చిరునామాకు డెలివరీ అయ్యేలా ఆర్డర్‌ పెట్టొచ్చు. దాతలు వస్తువుల రూపంలో కాకుండా నేరుగా నగదును విరాళంగా ఇవ్వాలనుకుంటే సులభంగా కొత్త పోర్టల్‌ ద్వారా ఎంత చిన్న మొత్తమైనా పంపొచ్చు. త్వరలో పోర్టల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు చూపించి అవసరమైన మేరకు మరిన్ని మార్పులు చేసి ఆ వెంటనే ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆ తర్వాత యాప్‌ను తీసుకురావాలని భావిస్తున్నారు.

Updated Date - May 11 , 2026 | 04:02 AM