‘ఉపాధి’పై సందిగ్ధం!
ABN , Publish Date - Apr 13 , 2026 | 12:18 AM
జిల్లాలో ఈ ఏడాది జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేపట్టడంలో సందిగ్ధం నెలకొంది. కేంద్రప్రభుత్వం ఈ పథకం పేరును వీబీ జీ రాంజీగా మార్చడంతో పాటు పనులను పారదర్శకంగా చేయించేందుకు పలు మార్పులు చేసింది. ఈ ఏడాది ఈ పథకం ద్వారా పనులు చేసేందుకు ఇంకా అనుమతులు రాకపోవడంతో పూర్తిస్థాయిలో పనులు చేపట్టలేని స్థితి జిల్లాలో నెలకొంది. గతేడాది, అంతకు ముందు అనుమతులు పొంది పూర్తికాని పనులను గుర్తించి ప్రస్తుతం చేయిస్తున్నారు. దీంతో ఈ నెలాఖరు వరకు పాతపనులే అరకొరగా చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధి హామీ పనులకు అనుమతుల కోసం వీబీ జీ రాంజీ ఉన్నతాధికారులు ఢిల్లీలోనే ఉండి పనులకు ఆమోదముద్ర వేయించే పనిలో ఉన్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు.
- వీబీ జీ రాంజీ ద్వారా పనులు చేపట్టేందుకు ఇంకా రాని అనుమతులు
- ఈ నెలాఖరు వరకు పాతపద్ధతిలోనే ఉపాధి హామీ పనులు
- కూలీల ఐరిస్ నమోదు అయితేనే పనిచేసినట్లు ధ్రువీకరణ
- పలు ప్రాంతాల్లో ఐరిస్ నమోదు కాక ఇక్కట్లు
- గతేడాది అనుమతులు పొంది పూర్తికాని పనులే ప్రస్తుతం చేయిస్తున్న సిబ్బంది
జిల్లాలో ఈ ఏడాది జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేపట్టడంలో సందిగ్ధం నెలకొంది. కేంద్రప్రభుత్వం ఈ పథకం పేరును వీబీ జీ రాంజీగా మార్చడంతో పాటు పనులను పారదర్శకంగా చేయించేందుకు పలు మార్పులు చేసింది. ఈ ఏడాది ఈ పథకం ద్వారా పనులు చేసేందుకు ఇంకా అనుమతులు రాకపోవడంతో పూర్తిస్థాయిలో పనులు చేపట్టలేని స్థితి జిల్లాలో నెలకొంది. గతేడాది, అంతకు ముందు అనుమతులు పొంది పూర్తికాని పనులను గుర్తించి ప్రస్తుతం చేయిస్తున్నారు. దీంతో ఈ నెలాఖరు వరకు పాతపనులే అరకొరగా చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధి హామీ పనులకు అనుమతుల కోసం వీబీ జీ రాంజీ ఉన్నతాధికారులు ఢిల్లీలోనే ఉండి పనులకు ఆమోదముద్ర వేయించే పనిలో ఉన్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లాలో ఏటా కూలీలకు 55.10 లక్షల పనిదినాలకుపైగా కల్పించే విధంగా పనుల అంచనాలు రూపొందించి వేసవి కాలానికి ముందే అనుమతులు ఇస్తారు. పంచాయతీల్లో గ్రామసభలు జరిపి ఏయే పనులు చేయాలని నిర్ణయించారో, వాటి ప్రాధాన్యతను వివరించి అనుమతులు తీసుకుంటారు. ఈ ఏడాది వీబీజీ రాంజీగా ఈ పథకం పేరును మార్చి కేంద్ర ప్రభుత్వ 60 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు కేటాయించేలా నిబంధనలు తెచ్చారు. జిల్లాలో ఈ పనులకు సంబంధించి అంచనాలు రూపొందించి ఆమోదం కోసం పంపినా ఇంతవరకు అనుమతులు రాలేదు. దీంతో పాత పద్ధతిలోని జాతీయ ఉపాధి హామీ పథకం పేరుతోనే ఈ నెలాఖరు వరకు ఉపాధి పనులు చేయిస్తున్నారు. వీబీజీ రాంజీ పథకంలో భాగంగా పనులు చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చినా పనులకు ఆమోదం లేకపోవడంతో నూతన పనులు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. జిల్లాలో వ్యవసాయ పనులు పూర్తికావడంతో కూలీలు ఉపాధి పనులు చేస్తామని ముందుకు వస్తున్నారు. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు సంవత్సరాల్లో ఆమోదం పొంది పెండింగ్‌లో ఉన్న పనులను కూలీలతో చేయిస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరుకు వీబీజీ రాంజీ పథకం ద్వారా పనులకు ఆమోదం లభిస్తే మే నెలలో నూతన పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
తగ్గుతున్న కూలీల సంఖ్య
జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు చేసేందుకు 2.19 లక్షల మేర జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో ఎస్సీలు 73 వేల మంది, ఎస్టీలు నాలుగు వేల మంది, ఇతరులు 1.40 లక్షల మంది జాబ్ కార్డులు కలిగి ఉన్నారు. 2025-26 సంవత్సరంలో వీరికి 55 లక్షల పనిదినాలను కల్పించారు. ఈ ఏడాది ఇవే లెక్కలతో పనులు చేయించేందుకు అంచనాలు రూపొందించారు కానీ అనుమతులు రాకపోవడంతో ఈ నెలాఖరు నాటికి 20 లక్షల పనిదినాలు కల్పించేలా ఏర్పాట్లు చేసి జిల్లాలోని అన్ని మండలాల్లో పనులు చేయిస్తున్నారు.
కొత్త నిబంధనలు
అయితే పనిచేసిన కూలీలకు సంబంధించి ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకుని ఉండాలని, పనిచేసిన ప్రాంతంలోనే పనిపూర్తయిన తర్వాత కూలీలకు సంబంధించి ఐరిస్ తీసి ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలి. ఈ వివరాలు యాప్‌లో నమోదు అయితేనే సంబంధిత కూలీలు పనిచేసినట్లుగా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
సాంకేతిక సమస్యలతో ఇక్కట్లు
ఒక ప్రాంతంలో వంద మంది, అంతకు మించి కూలీలు పనిచేస్తుంటే సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడం, నెట్‌వర్క్ లేకపోవడంతో పనిచేసినవారి ఐరిస్ నమోదులో తీవ్రజాప్యం జరుగుతోంది. దీంతో మధ్యాహ్నం 12 గంటల వరకు ఐరిస్ తీయడమే సరిపోతోంది. కొంత మందికి సంబంధించి ఐరిస్ నమోదు కాకపోవడంతో వారు పనిచేసినట్లుగా లెక్కలోకి రావడం లేదు. గతంలో రెండు, మూడు గ్రామాల్లోని వివిధ ప్రాంతాల్లో 500 మందికిపైగా పనిచేసినట్లుగా నమోదు చేసేవారు. కొంతమంది పనికి రాకున్నా, వచ్చినట్లుగా చూపి మస్టర్ వేసేవారు. ఈ వ్యవహారంలో అనేక వింతలు, విడ్డూరాలు చోటు చేసుకునేవి, గ్రామస్థాయిలో రాజకీయ నాయకులు, ఇతరులు ఉపాధి పనులు చేసినట్లుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసేవారు. వారికి నగదు వస్తే మేట్‌లు, ఇతరత్రా సిబ్బంది వాటిని పంచుకునే వారు.
తగ్గిన కూలీల సంఖ్య
ఇక నుంచి ఉపాధి పనులు చేసిన కూలీల ఐరిస్‌ను ప్రత్యేక యాప్‌లో నమోదు తప్పనిసరి చేయడంతో కూలీల సంఖ్య 500 నుంచి 300, 250 తగ్గిపోతోంది. ఇక నుంచి ఉపాధి హామీ పథకంలో గతంలో మాదిరిగా పనిచేయకున్నా, అసలు పనికిరాని వారి పేర్లను పనిచేసినట్లుగా నమోదు చేయడానికి వీలులేదని, సర్వర్ సహకరించడం లేదని ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులు చెబుతున్నారు. నూతన యాప్‌తో పనులు పూర్తి చేసిన తర్వాత జరిగే సోషల్ ఆడిట్‌లో తమకు ఇబ్బందులు ఉండవని ఉద్యోగులు అంటున్నారు.