Share News

గందరగోళం!

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:51 PM

భూముల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం గతేడాది డిసెంబరులో ప్రారంభించిన రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమంలో స్పష్టత కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ రకాల వివాదాల్లో చిక్కుకుని ఎంతకూ పరిష్కారం కాని భూముల సమస్యలపై కలెక్టర్‌ తుది నిర్ణయం తీసుకునే అంశాలపై వివరించేందుకు రైతులు, బాధితులు వస్తే కలెక్టరేట్‌లోని మీకోసం అర్జీల నమోదు విభాగంలో ఈ తరహా అర్జీలను స్వీకరించడం లేదు. అర్జీలు ఇచ్చినట్లుగా నమోదు చేస్తే కలెక్టర్‌ను మీ కోసంలో కలిసి మాగోడు చెప్పుకుంటామని రైతులు కోరితే, ఇక్కడ నమోదు చేయరని, అంతా రెవెన్యూ క్లినిక్‌లకే వెళ్లాలని చెబుతున్నారు. బాధిత రైతులు ఇచ్చిన అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే, బాధిత రైతులు కలెక్టర్‌ను కలిసి సమస్యలను వివరించే ప్రక్రియలో గందరగోళం నెలకొంది.

గందరగోళం!

రెవెన్యూ క్లినిక్‌ల్లో కొరవడిన స్పష్టత

- కీలక సమస్యలు కలెక్టర్‌ దృష్టికి వెళ్లనీయకుండా అడ్డుకట్ట

- మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో అర్జీలు ఇవ్వాలని సలహాలు

-తహసీల్దార్‌, ఆర్డీవో స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపైనే వస్తున్నామంటున్న అర్జీదారులు

భూముల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం గతేడాది డిసెంబరులో ప్రారంభించిన రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమంలో స్పష్టత కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ రకాల వివాదాల్లో చిక్కుకుని ఎంతకూ పరిష్కారం కాని భూముల సమస్యలపై కలెక్టర్‌ తుది నిర్ణయం తీసుకునే అంశాలపై వివరించేందుకు రైతులు, బాధితులు వస్తే కలెక్టరేట్‌లోని మీకోసం అర్జీల నమోదు విభాగంలో ఈ తరహా అర్జీలను స్వీకరించడం లేదు. అర్జీలు ఇచ్చినట్లుగా నమోదు చేస్తే కలెక్టర్‌ను మీ కోసంలో కలిసి మాగోడు చెప్పుకుంటామని రైతులు కోరితే, ఇక్కడ నమోదు చేయరని, అంతా రెవెన్యూ క్లినిక్‌లకే వెళ్లాలని చెబుతున్నారు. బాధిత రైతులు ఇచ్చిన అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే, బాధిత రైతులు కలెక్టర్‌ను కలిసి సమస్యలను వివరించే ప్రక్రియలో గందరగోళం నెలకొంది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు అనాధీనం భూములుగా రెవెన్యూ రికార్డులలో నమోదై ఉన్న భూములను ప్రభుత్వం గతంలో ఇచ్చింది. ఈ భూములు ఇచ్చి సంవత్సరాలు గడిచింది. అయితే ఈ భూములకు సంబంధించిన పత్రాలు పుట్టించి కొందరు ఆక్రమించేశారు. ఆ ఆక్రమణలు తొలగించాలని మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన కుటుంబసభ్యులు వారి పరిధిలోని తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన నిర్ణయాధికారం మా చేతుల్లో ఉండదని కలెక్టర్‌, లేదా జేసీస్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని మండల, డివిజన్‌ స్థాయి రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ తరహా భూమి పంపిణీకి సంబంధించిన పత్రాలు కలెక్టరేట్‌లోనే ఉంటాయని, అక్కడి నుంచి పత్రాలు తీసుకోవాలని, ఈ విషయంలో తాము ఏం చేయలేమని కిందిస్థాయి అధికారులు పేర్కొంటున్నారు. మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన వారసులు, ఇతరత్రా వివాదాల్లో భూములు ఉండి ఇబ్బందులు పడుతున్న వారు తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల్లో అర్జీలు దాఖలు చేయగానే భూమిని ఆక్రమించుకున్న వారు రాజకీయ నాయకులను ఆశ్రయించి ఈ అంశంలో మండల, డివిజన్‌ స్థాయి అధికారులు జోక్యం చేసుకోకుండా ఒత్తిడి తెస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. ఎంతకూ ఈ సమస్యలను అధికారులు పట్టించుకోకపోవడంతో గన్నవరం, పామర్రు, మచిలీపట్నంతో పాటు మిగిలిన అన్ని నియోజకవర్గాల నుంచి బాధితులు కలెక్టరేట్‌కు వస్తున్నారు. కలెక్టర్‌ను మీకోసం కార్యక్రమం విభాగంలో కలిసి తమ ఇబ్బందులను వివరించేందుకు అర్జీలు ఇవ్వబోతే వాటిని తీసుకోవడం లేదు. మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేశారని, అక్కడకు వెళితే మీ పరిధిలోని ఆర్డీవోకు లేదా తహసీల్దార్‌లకు ఈ సమస్యలను పరిష్కరించాలని సూచిస్తూ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారని చెప్పి పంపేస్తున్నారు. తహసీల్దార్‌, ఆర్డీవోలు పరిష్కరించని కారణంగానే కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చామని, సోమవారం మినహా మిగిలిన రోజుల్లో కలెక్టర్‌ వివిధ కార్యక్రమాలు, పర్యటనల్లో ఉంటున్నారని, ఆయనను కలవడం కష్టంగా ఉందని అర్జీలు స్వీకరించాలని రైతులు. బాధితులు కోరినా వాటిని మీకోసం విభాగం అధికారులు స్వీకరించడం లేదు. దీంతో కలెక్టరేట్‌ ప్రాంగణంలోనే ఉన్న మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌ వద్దకు వెళుతున్నారు. ఆన్‌లైన్‌లో రైతుల పేర్లు, సమస్యను నమోదు చేసి, మీ తహసీల్దార్‌లు లేదా ఆర్డీవోలకు పంపామని అక్కడకు వెళ్లాలని మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయ అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని బాధితులు వాపోతున్నారు.

మండల స్థాయిలో చేయాల్సిన పనులు రెవెన్యూ క్లినిక్‌లలో..

రెవెన్యూ క్లినిక్‌లో అడంగల్‌లో పేర్లు మార్పు చేయాలని, పట్టాదార్‌ పాస్‌పుస్తకాల కోసం, భూమికి సంబంధించిన సర్వే చేయాలని, రెవెన్యూ రికార్డులలో భూమి తక్కువగా నమోదైతే సంబంధిత భూమిని కలపాలని, 22-ఏ నుంచి భూములను తొలగించాలని, భూమి రికార్డులలో ఆధార్‌ కార్డు నెంబర్లకు సంబంధించి తప్పులు సరిదిద్దాలని, తహసీల్దార్‌ల డిజిటల్‌ సంతకాలు కనపడటం లేదని, ఇటీవల కాలంలో జరిగిన క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలు నమోదు కాలేదని, తదితర సమస్యలను పరిష్కరించాలని రైతులు అర్జీలు ఇస్తున్నారు. ఈ తరహా సమస్యలు పరిష్కరించేందుకు గ్రామస్థాయిలోని సచివాలయాల్లో అర్జీలు దాఖలుచేస్తే తహసీల్దార్‌ కార్యాలయ పరిధిలోనే పరిశీలించి పరిష్కరించవచ్చని రెవెన్యూ అఽధికారులు చెబుతున్నారు. కానీ చిన్నపాటి సమస్యలపై సచివాలయాల్లో అర్జీలు ఇచ్చేందుకు వెళితే వాటిని నమోదు చేయకపోవడం లేదా పట్టించుకోకపోవడంతోనే రెవెన్యూ క్లినిక్‌లకు అధిక సంఖ్యలో అర్జీలు వస్తుండటం గమనార్హం. భూముల సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్‌లో అర్జీలు ఇచ్చినా కలెక్టర్‌ వద్దకు వెళ్లి ఈ సమస్యలను చెప్పుకునే వెసులుబాటు కూడా ఉందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. కలెక్టర్‌ స్థాయిలో నిర్ణయాలు తీసుకునే అంశాలలో కలెక్టరేట్‌లో మీకోసం విభాగానికి వెళితే అక్కడి సిబ్బంది వద్దకు రైతులు వెళితే రెవెన్యూక్లినిక్‌లలో అర్జీలు ఇవ్వాలని చెబుతుండటం అయోమయానికి గురిచేస్తోంది.

Updated Date - Mar 15 , 2026 | 11:51 PM