అయోమయం!
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:40 AM
వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకునేందుకు అనుమతులు మంజూరు కావడం ప్రస్తుతం కష్టతరంగా మారింది. దీని కోసం ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు అనుమతులు ఇస్తారనే అంశంపై అయోమయం నెలకొంది. గతంలో వ్యవసాయ భూముల్లో పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, రియల్ ఎస్టేట్ వెంచర్‌లు వేయాలంటే ముందుగా రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకునేవారు. అనుమతులు ఇచ్చే సమయంలో పెద్దమొత్తంలో నగదు వసూలు చేస్తున్నారనే కారణంతో ల్యాండ్ కన్వర్షన్ ప్రక్రియను ఇటీవల కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు లేవనే కారణం చూపి రెవెన్యూ అధికారులు తప్పుకుంటున్నారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటేనే అనుమతులు ఇస్తామని ముడా అధికారులు చెబుతూ, అనుమతులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు.
- ల్యాండ్ కన్వర్షన్ రద్దు చేసి కొత్త విధానం తెచ్చిన ప్రభుత్వం
- వ్యవసాయేతర అవసరాలకు భూముల వినియోగంపై రైతుల దరఖాస్తులు
- ఈ వ్యవహారం మా పరిధిలో లేదంటున్న రెవెన్యూ అధికారులు
- అన్ని పత్రాలు సక్రమంగా ఉంటేనే అనుమతులంటున్న ముడా అధికారులు
- దరఖాస్తుల పరిశీలనలోనూ తీవ్ర జాప్యం!
- దిక్కతోచని స్థితిలో భూముల యజమానులు
వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకునేందుకు అనుమతులు మంజూరు కావడం ప్రస్తుతం కష్టతరంగా మారింది. దీని కోసం ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు అనుమతులు ఇస్తారనే అంశంపై అయోమయం నెలకొంది. గతంలో వ్యవసాయ భూముల్లో పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, రియల్ ఎస్టేట్ వెంచర్‌లు వేయాలంటే ముందుగా రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకునేవారు. అనుమతులు ఇచ్చే సమయంలో పెద్దమొత్తంలో నగదు వసూలు చేస్తున్నారనే కారణంతో ల్యాండ్ కన్వర్షన్ ప్రక్రియను ఇటీవల కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు లేవనే కారణం చూపి రెవెన్యూ అధికారులు తప్పుకుంటున్నారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటేనే అనుమతులు ఇస్తామని ముడా అధికారులు చెబుతూ, అనుమతులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం:
జిల్లాలో సగభాగంలో వ్యవసాయ భూముల్లో పరిశ్రమలు, ఇతర వాణిజ్యం సముదాయాలు, రియల్ ఎస్టేట్ వెంచర్‌లు వేయాలంటే ప్రస్తుతం మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అఽథారిటీ (ముడా) నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. మచిలీపట్నం, పెడన, నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాలతో పాటు మొవ్వ మండలంలోని సగ భాగం, కైకలూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు ముడా పరిధిలో ఉన్నాయి. జిల్లాలోని మిగిలిన ప్రాంతాలు సీఆర్‌డీఏ పరిధిలో ఉన్నాయి, జిల్లా విడిపోయాక కూడా జిల్లాలోని పెనమలూరు, గుడివాడ, పామర్రు, గప్నవరం నియోజకవర్గాలను సీఆర్‌డీఏ పరిధిలోనే కొనసాగిస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండలం ముడా పరిధిలో ఉంది. జిల్లాల విభజన అనంతరం ఏలూరు జిల్లాలో కలిసిన కైకలూరు నియోజకవర్గాన్ని ముడా పరిధిలోనే కొనసాగిస్తున్నారు. ముడా పరిధిలోని ఉన్న ప్రాంతాల్లో, పట్టణాల్లో 300 గజాలలోపు స్థలంలో ఇళ్లు కట్టుకోవాలంటే ముడా పరిధిలోని పంచాయతీలు, పురపాలక సంఘాలు అనుమతులు ఇవ్వాల్సి ఉంది. 300 గజాలకు మించిన స్థలంలో గృహ సముదాయాలతో పాటు, వాణిజ్య పరంగా ఉపయోగించేందుకు ఇతరత్రా భవనాలు, గృహ సముదాయాలు నిర్మాణం చేయాలంటే ముడా నుంచి అనుమతులు తీసుకోవాలి. అయితే ఇక్కడే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముడాలోని ప్లానింగ్ విభాగంలో వివిధ భవనాల నిర్మాణం కోసం, పెట్రోల్ బంకులు, ఇతరత్రా వాణిజ్య సముదాయాల కోసం దరఖాస్తు చేసుకుంటే అన్ని పత్రాలు సక్రమంగా ఉండాలని చెబుతున్నారు. వ్యవసాయ భూములను వాణిజ్య సముదాయాల కోసం వాడుకుంటామని, తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిని అన్నదమ్ములకు వాటాలుగా విభజించి భూమిని సబ్ డివిజన్ చేసుకుని రావాలని ముడా అధికారులు పేర్కొంటున్నారు. దరఖాస్తుదారులు రెవెన్యూ అధికారుల వద్దకు వెళితే ల్యాండ్ కన్వర్షన్ అనేది మా చేతుల్లో లేదని చెబుతున్నారు. మీ ప్రాంతంలో ఉన్న భూమికి మార్కెట్‌లో ఉన్న ధరను బట్టి అందులో నాలుగు శాతం మేర నగదు చెల్లించి ముడాకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ల్యాండ్ కన్వర్షన్‌కు అనుమతులు ఇచ్చే అధికారం మాకు లేదని, ఏమైౖనా ఉంటే ముడా కార్యాలయంలోనే తేల్చుకోవాలని రెవెన్యూ అధికారులు చెప్పి పంపేస్తున్నారు. అన్నిపత్రాలు సక్రమంగా లేకుండా మేమెలా అనుమతులు ఇస్తామని ముడా అధికారులు చెబుతుండటంతో ఈ అంశంలో ఏ శాఖ అధికారులకు పూర్తిస్థాయి అధికారాలు ఉన్నాయనే అంశంపై స్పష్టత కొరవడింది.
ముడాను వేధిస్తున్న అధికారుల కొరత
ముడా కార్యాలయంలో వైస్‌చైర్మన్‌తో పాటు, పూర్తి స్థాయిలో డిప్యూటీ కలెక్టర్‌లు లేరు. ప్లానింగ్ విభాగంలో కొంత మంది సిబ్బందిని పెట్టి నెట్టుకొస్తున్నారు. ముడా వైస్ చైర్మన్‌గా ఏ అధికారి లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ అదనపు బాధ్యతలతో ఇన్‌చార్జి వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ముడా పరిధిలోని ఆయా ప్రాంతాల వారు పనుల కోసం వచ్చి వివిధ రకాల దరఖాస్తులు అందజేస్తున్నారు. వ్యవసాయ భూములను ఇతర వ్యాపారాలు, చిన్నపాటి పరిశ్రమలు స్థాపించేందుకు వచ్చిన దరఖాస్తులు తొలుత ముడా కార్యాలయంలోని జానియర్ ప్లానింగ్ అధికారి వద్దకు, ఆ తర్వాత అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి లాగిన్ నుంచి ప్లానింగ్ ఆఫీసర్ లాగిన్‌కు వెళుతున్నాయి. భూముల సబ్ డివిజన్‌కు సంబంధించిన వివరాలు, ఇతరత్రా అంశాల పత్రాలు సక్రమంగా లేవని, వచ్చిన దరఖాస్తులను ముడా అదికారులు వెనక్కు పంపేస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులు ముడా పరిధిలోని తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ అనుమతులు ఇచ్చేమార్గం చెప్పాలంటూ తిరుగుతున్నారు. ఈ తరహా దరఖాస్తులు వందల సంఖ్యలో పెండింగ్‌లో పెడుతుండటంతో చిన్నపాటి పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చిన వారు ఇబ్బందుల పాలవుతున్నారు. తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయ అధికారులు, సిబ్బంది ల్యాండ్ కన్వర్షన్‌కు సంబంధించిన అంశాన్ని మా పరిధి నుంచి తొలగించారని, అన్నీ ముడా కార్యాలయ అధికారులే చూస్తారని చెప్పి తప్పించుకుంటున్నారు.ఽ ముడా పరిధిలోని ఈ తరహా సమస్యలను పరిష్కరించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని ముడా కార్యాలయంలో నియమించాలని పలువురు కోరుతున్నారు.